నివాసాల తొలగింపులో ఉద్రిక్తత
- రామవరప్పాడు ఫ్లైఓవర్ బాధితుల నిరసన
- న్యాయం చేయాలంటూ ఆందోళన
రామవరప్పాడు : రామవరప్పాడు ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా మంగళవారం చేపట్టిన ఇళ్ల తొలగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రింగ్‌లోని కట్ట నివాసితుల నుంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసు బలగాల మధ్య జేసీబీలతో ఇళ్ల తొలగింపు చేపట్టారు. గతంలో సర్వే నిర్వహించిన అధికారులు అర్హుల పేర్లను గుర్తించి 131 మందికి గొల్లపూడి జెఎన్యూఆర్యూఎంలో ఇళ్లను కేటాయించారు. అయితే మిగిలి ఉన్న అర్హులకు ఇళ్లను కేటాయించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గృహలు కేటాయించని బాధితులు ఇళ్ల తొలగింపుతో ఇంటి పన్ను, ఆధార్, రేషన్ కార్డులు ఇతరత్రా ఆధారాలున్నా మాకు న్యాయం జరగలేదంటూ ఆందోళనకు దిగారు. అర్హుల జాబితాలో మా పేర్లు నమోదు కాలేదని అప్పటి నుంచి గ్రామంలోని ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా ప్రయోజన ం లేకపోయిందని వీరు ఆరోపిస్తున్నారు. కాగా చిన్న దుకాణాలు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న వారికి తీవ్ర అన్యాయం జరిగిందని, అర్హుల పేర్లు నమోదు సమయంలో దుకాణదారుల పేర్లను నమోదు చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజమైన అర్హులకు ప్రత్యామ్నాయం చూపాలని లేని పక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారు తేల్చి చెబుతున్నారు.
న్యాయం చేయకుంటే దూకేస్తా
అర్హత ఉన్న తనకు ఇల్లు కేటాయించలేదని, న్యాయం జరగకపోతే ఇక్కడినుంచి దూకేస్తానంటూ ఓ మహిళ విజయవాడ శివారు ప్రసాదంపాడు ఫోర్డ్ కార్ల షోరూం సమీపంలోని హోర్డింగ్ టవర్ ఎక్కి హడావుడి చేసింది. రామవరప్పాడుకు చెందిన పంచకర్ల విజయలక్ష్మి రింగ్ సమీపంలోని కట్టపై నివాసం ఉంటోంది. రామవరప్పాడు ఫ్లైవోవర్ నిర్మాణంలో భాగంగా అక్కడి నివాసాలను తొలగిస్తున్నారు. తన నివాసాన్ని తొలగిస్తారేమోనని ఆందోళనతో ఆమె సమీపంలోని టవర్ ఎక్కింది. అధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకూ దిగేది లేదంటూ పట్టుబట్టింది.
రూరల్ మండల తహశీల్దార్ మదన్మోహన్, పటమట సీఐ దామోదర్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెకు నచ్చజెప్పారు. ఈ విషయమై విచారణ నిర్వహించి న్యాయం చేస్తానని తహశీల్దార్ హామీ ఇవ్వడంతో టవర్ దిగింది. అనంతరం విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఇల్లు కేటాయించలేదని చెప్పారు. నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని విన్నవించింది.