హార్ట్ వర్క్
పెద్దగా సందేశాలిచ్చే పనేమీ పెట్టుకోలేదు సీనియర్ చిత్రకారుడు రమేశ్. దేన్నైనా టచ్ చేసి వదిలేస్తారు. టచింగ్‌లు మాత్రం ఇవ్వరు. అదే ఆయన ప్రత్యేకత. ఉన్నది ఉన్నట్టుగా గీసేసి, ‘ఇక మీ పని’ అన్నట్లు లేచి వెళ్లిపోతారు. ప్రపంచానికి మనిషిని మెత్తగిలేలా చెయ్యడం ఇది. ఈ కళలో ‘ఆర్ట్’తేరిపోయారు రమేశ్. ఇండియా ఆర్ట్ ఫెయిర్‌లో ప్రస్తుతం ఆయన షో నడుస్తోంది. షో ప్రారంభానికి ఎప్పుడో జనవరి 13న ఢిల్లీ వెళ్లొచ్చారు. మళ్లీ వెళ్లలేదు. వైజాగ్‌లోనే ఉండిపోయారు. ఏమిటీ మనిషి? తన ఆర్ట్ గురించి నలుగురికీ చెప్పుకోవాలని ఉండదా... అంత పెద్ద ఢిల్లీలో!! ఢిల్లీ అయినా, ఆయన ఎగ్జిబిషన్ పెట్టొచ్చిన వాషింగ్టన్ అయినా అంతే. ‘నేను చెప్పాలనుకున్నది నా ఆర్ట్ చెబుతుంది.
నా గురించి చెప్పుకోవలసిన అవసరం ఏముంది?’ అని పెద్దగా నవ్వుతారు రమేశ్. ఆ నవ్వే ఒక ఆర్ట్ పీస్‌లా ఉంటుంది. రమేశ్ రంగులకు ముఖ్య కాన్వాస్... భక్తి విశ్వాసాలు. పెయింటింగ్ పూజలో కూర్చున్నాడంటే అయ్యేవరకు కదలరు. ఇదేం గొప్పకాదు కానీ... ఆయన బొమ్మ గీస్తుంటే, ఆ బొమ్మ ఆయన్ని చెక్కుతూ ఉంటుందట! ‘నాకేదో సిద్ధించినట్టుగా ఉంటుంది. ఆర్ట్‌వర్క్ పూర్తవగానే’ అంటారు. రమేశ్‌కి ఇష్టమైన భారతీయ చిత్రకారుడు భూపేన్ కక్కర్. ఇక ఆయన ఆరాధించే హెరానిమస్ బాష్ (ఏజ్ఛీటౌnyఝuటఆౌటఛిజి) 16వ శతాబ్దపు చిత్రశిల్పి. వాళ్లిద్దరి ప్రభావం ఆయన్ని ఆర్ట్పైపు తిప్పడం వరకే కనిపిస్తుంది. ఆర్ట్ బ్రష్ తిప్పడంలో ఉండదు. అంతమాత్రాన తనదొక ప్రత్యేక రేఖాంశమని చెప్పుకోడానికి ఉవ్విళ్లూరరు రమేశ్. ఇక ఆయన ఇచ్చిన షోలు, ఆయనకు వచ్చిన అవార్డులు ఆయన చెయ్యి తగిలిన ఒలికిన రంగులే తప్ప, ఆయన అభిమానుల దృష్టిలో వాటికి ఏమంత ప్రాముఖ్యం లేదు.