200 అడుగుల ఎత్తునుంచి పడినా..
ఆమె పేరు రమీలా శ్రేష్ఠ (17). స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. కాసేపటి తర్వాత తన బోయ్ ఫ్రెండు సంజీబ్ (17)ను కలిసింది. ఇద్దరూ కలిసి నేపాల్లో చారిత్రాత్మకమైన ధరహరా టవర్ వద్దకు వెళ్లారు. వాళ్ల ప్రేమ విషయం ఇంట్లో ఎవరికీ తెలీదు. ఆ రోజంతా వాళ్లిద్దరూ కలిసి అక్కడ గడపాలని అనుకున్నారు. ఎనిమిదో అంతస్థులో ఉన్న బాల్కనీ వద్దకు వాళ్లు వెళ్లేసరికి ఆ టవర్ కొద్దిగా ఊగుతున్నట్లు అనిపించింది. కాసేపటికల్లా అక్కడున్నవాళ్లంతా భయంతో కేకలు పెట్టడం మొదలైంది. ప్రేమికులిద్దరూ స్పృహతప్పి 200 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయారు.
రమీలా, సంజీబ్లను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వాళ్ల తలకు, వెన్నెముకకు కూడా దెబ్బలు తగిలాయని, దాంతో వాళ్లు మరికొంత కాలం ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు చెప్పారు. అయితే.. వాళ్ల ప్రేమ వ్యవహారం మాత్రం ఇద్దరి ఇళ్లలోనూ తెలిసిపోయింది. ఈ విషయాన్ని వాళ్లకు డాక్టర్ సంతోష్ పాండే చెప్పారు. 200 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయినా కూడా ప్రేమజంట ఇద్దరూ ప్రాణాలు నిలుపుకొన్నారు. తమ ప్రేమను కూడా నిలబెట్టుకున్నారు.