రామయ్యకు నిత్యకల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామికి గురువారం నిత్యకల్యాణం చేశారు. ఉదయం సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకొచ్చి భద్రుడి గుడిలో అభిషేకం చేశారు. అనంతరం నిత్యకల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపంలో వేంచేయింపజేసి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. స్వామివారి, అమ్మవార్ల వంశ క్రమాన్ని భక్తులకు తెలియజేశారు. అర్చకులు ఆలయ విశిష్టత గురించి భక్తులకు వివరించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామివారికి విన్నవించారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణల మధ్య అత్యంత వైభవోపేతంగా రామయ్యకు నిత్యకల్యాణం జరిపించారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.