కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హుళక్కేనా?
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని నిర్మించాలన్న ప్రతిపాదనకు చెల్లుచీటీ పలికారా? వరంగల్ జిల్లా కేంద్రంలోని కాజీపేట ప్రాంత అయోధ్యపురంలోని దేవాదాయ శాఖ భూమిలో రైల్వే కోచ్ల తయారీ ఫ్యాక్టరీ నిర్మించడానికి 2011-12లో నాటి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అయితే ఇప్పటికీ కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎలాంటి పనులూ మొదలు కాలేదేమిటని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి డిసెంబర్ 9న పార్లమెంట్లో ప్రశ్నిం చారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో తయారవుతున్న వ్యాగన్లు రైల్వే అవసరాలకు సరిపోతున్నందున కొత్త కోచ్ ఫ్యాక్టరీలను ఇప్పట్లో నెలకొల్పడం సాధ్యం కాదని రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు.
ఇప్పటికే తెలంగాణలో ఉండే రెండు పెద్ద ఫ్యాక్టరీలు మూతపడ్డాయి.
గతంలో వరంగల్ నగరంలోని అజాం జాహి మిల్లు మూయించి 4 వేలమంది కార్మికులను రోడ్డున పడేశారు. ఆ ఫ్యాక్టరీ మూతపడి 20 ఏళ్లు దాటింది. దీంతో మరో తరంలోని రెండింతలమంది కార్మికులు రోడ్డున పడి ఉద్యోగ జీవితాలను కోల్పోయారు. ఆంధ్రోళ్ల కుట్రల వల్లే అజాం జాహి వంటి ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేంద్రంతో కొట్లాడి అయినా సాధించుకోవచ్చని ఆశచూపిన తెరాస అప్పట్లో జనాల్ని నమ్మించింది. మరి గత ప్రభుత్వం అంగీకరించిన కోచ్ ఫ్యాక్టరీని ఇప్పుడు ఏర్పాటు చేయలేమని కేంద్ర మంత్రి జవాబిచ్చినా తెరాస ప్రభుత్వంలో స్పందన లేదు.
కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పితే ఫ్యాక్టరీ ఏర్పడనున్న ప్రాంతానికి చెందిన కడిపికొండ, రాంపేట, తరా లపల్లి, వనమాల కనిపర్తి, మల్లకపల్లి, భట్టుపల్లి, మడికొండ గ్రామాలతోపాటు... ధర్మసాగర్, జాఫ ర్గఢ్, వర్ధన్నపేట, సంగెం గీసుగొండ, హసన్పర్తి, ఆత్మకూరు మండల ప్రజలకు కూడా ఉద్యోగాలు లభిస్తాయని జిల్లా ప్రజలు ఆశించారు. కానీ కోచ్ ఫ్యాక్టరీ రాదని తేలడంతో ప్రజల్లో నిరాశా నిస్పృ హలు పెరుగు తున్నాయి. ఉన్న ఫ్యాక్టరీల ద్వారానే సరిపడా వ్యాగన్లు తయారు చేసే అవకాశాలు ఉన్నప్పుడు తెలంగాణలో కొత్త ఫ్యాక్టరీకి అనుమ తులు ఎందుకిచ్చినట్లు?
రాష్ట్రం తగిన స్థలాన్ని అప్పగిస్తే పనులు ప్రారంభిస్తామని కేంద్రం చెప్పగానే రాష్ట్ర ప్రభు త్వం ఆదేశాల ప్రకారం రెవెన్యూ అధికారులు హడావుడిగా స్థల నిర్ధారణ చేసి అడ్డుగా ఉన్న నివాస ఇండ్లను కూల్చివేసి 54 ఎకరాల స్థలాన్ని కేంద్రానికి అప్పజెప్పారు. ఫ్యాక్టరీ రాకపోగా, కూల్చివేతలో నష్టపోయిన వారికి ఏం సహాయం చేస్తారు? ఆ ప్రాంత ప్రజలకు ఏం సమా ధానం చెబుతారు? వెనుకబడిన లేక వెనుకబడేసిన తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రజలకు దక్కకుండా, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని నిర్మించకుండా ఇతర ప్రాంతాలకు తరలించుకు పోయే ప్రయత్నాలను తెలంగాణ ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలి. నామమాత్ర ప్రస్తావనల తో ఈ సమస్య పరిష్కారం కాదు. మననీళ్లు, మన ఉద్యోగాలు, మన వనరులు అంటూ ఆశ చూపి అధికారంలోకి వచ్చిన పార్టీ అసలు విషయానికి వచ్చేసరికి చేతులెత్తేయడం బాధ్యతా రాహిత్యం.
రాంపేట రంజిత్
పౌరహక్కుల సంఘం ఉపాధ్యక్షులు, వరంగల్ మొబైల్ : 9989545123