ఒకరి కోసం అందరు
సామల మురళి–డిచ్పల్లి, ఎన్.చంద్రశేఖర్–మోర్తాడ్
గల్ఫ్ దేశాల్లో ఐక్యతారాగం చాటుతున్నారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం రాంపూర్ వాసులు. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన ఆ గ్రామస్తులు తమ కష్టసుఖాలను పంచుకోవడం కోసం ఒక్కటయ్యారు. కష్టాల్లో ఉన్న తమ తోటి కార్మికులకు అండగా నిలువడానికి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. రాంపూర్ గల్ఫ్ అసోసియేషన్ పేరుతో మూడేళ్ల నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యూఏఈ, బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్ దేశాల్లో ఉపాధి పొందుతున్న రాంపూర్ వాసులకు ఎలాంటి కష్టం వచ్చినా అసోసియేషన్ సభ్యులు తాము ఉన్నామనే భరోసాను కల్పిస్తున్నారు. రాంపూర్ వాసులకు ప్రధాన వృత్తి వ్యవసాయమే అయినప్పటికీ సాగునీటి సౌకర్యం లేకపోవడం, బోరుబావుల్లో నీరు సమృద్ధిగా లేక పంటలు పండించే పరిస్థితి లేకపోయింది. దీంతో వలస బాటపట్టారు. గ్రామ జనాభా దాదాపు 6వేల వరకు ఉండగా అందులో సుమారు 1200 మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు.
సంస్థ ఆవిర్భావం ఇలా...
గల్ఫ్ దేశాల్లో ఎంతో మంది తెలంగాణ కార్మికులు ఉన్నారు. వారి కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. అయితే ప్రత్యేకంగా రాంపూర్ వాసుల కోసం ప్రత్యేకంగా సంస్థ ఏర్పాటు చేసుకుని సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని భావించిన కర్రమొల్ల సాయన్న, మర్రికింది సంజీవ్, బుచ్చకోల్ల రవి, సక్కర్ల ఎర్రన్న, గూండ్ల బాలయ్యలు మూడేళ్ల కింద రాంపూర్ గల్ఫ్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న గ్రామస్తులందరినీ ఇందులో సభ్యులుగా చేర్చుకోవడం ద్వారా సంస్థను విస్తరించారు. ప్రస్తుతం సంస్థలో 300 మంది సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థలో చేరిన వారు సంస్థ నిర్ణయించిన మొత్తాన్ని సభ్యత్వ రుసుముగా చెల్లించాల్సి ఉంది. అలాగే ప్రతి నెలా కొంత మొత్తాన్ని జమచేసి సంస్థకు నిధుల లోటు లేకుండా చేశారు. గల్ఫ్ దేశాల్లో ఎక్కడ ఉన్నా సభ్యులు ఆన్లైన్లో సంస్థ పాలనా వ్యవహారాలు చూస్తున్న ప్రతినిధులతో సంప్రదింపులు జరుపు కొంటున్నారు. అలాగే తమ సభ్యత్వ రుసుం, ప్రతి నెలా జమ చేసే సొమ్మును సంస్థ ప్రతినిధులకు చేరేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే ఈ సంస్థ సభ్యులు ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి ఏ దేశంలో ఉన్నవారు ఆ దేశం లో సమావేశాలను నిర్వహించుకుంటున్నారు.
అందరికీ అండగా...
గల్ఫ్ దేశాల్లో ఉన్న రాంపూర్ వాసులకు ఏదైనా ప్రమాదం జరిగితే వైద్య చికిత్సల కోసం ఆర్థిక సహాయం అందించడం, వారిని స్వదేశానికి పంపడానికి అవసరమైన విమాన చార్జీలను చెల్లిస్తున్నారు. ఒక వేళ గల్ఫ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా వారికి కూడా సంస్థ ద్వారా సహాయం అందిస్తున్నారు. అలాగే ఏ కారణంతోనైనా గల్ఫ్ దేశాల్లో మరణిస్తే వారి మృత దేహాలను వీలైనంత తొందరగా స్వగ్రామానికి చేర్పించడం, అవసరమైన ఆర్థిక సహాయం అందించడం చేస్తున్నారు. మొదట గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారికి సహాయం అందించగా ఇప్పుడు ఆ సేవా కార్యక్రమాలను గ్రామానికి విస్తరించారు. గ్రామంలో హనుమాన్ మందిరాన్ని నిర్మించడానికి సంస్థ సభ్యులు ఎంతో కృషి చేశారు. అలాగే ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందించడానికి సంస్థ ఆర్థిక సహాయం చేస్తోంది. ప్రతి వేసవిలో చలివేంద్రాన్ని నిర్వహించి ప్రయాణికుల దాహార్తిని తీరుస్తున్నారు. పండుగల సందర్భంలో అన్నదానం నిర్వహిస్తున్నారు. అలాగే గ్రామంలోని వికలాంగులైన విద్యార్థులకు, పేద విద్యార్థులను ప్రోత్సహించడానికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు సంస్థ ద్వారా నగదు బహుమతులను అందిస్తున్నారు. ఇలా సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్న సంస్థ సభ్యులు ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాక గల్ఫ్ దేశాల్లో అవకాశం ఉన్న సమయంలో ఆటల పోటీలను నిర్వహించడం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వన భోజనాలు సైతం ఏర్పాటు చేస్తున్నారు.
ప్రత్యేక వెబ్సైట్, సోషల్ మీడియాలో ఖాతాలు
రాంపూర్ గల్ఫ్ అసోషియేషన్ సంస్థ సేవా కార్యక్రమాలను వివరించడంతో పాటు సహాయం పొం దగోరేవారి వివరాలను తెలుసుకోవడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అంతేగాక ఫేస్బుక్, వాట్సప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఖాతా లను తెరిచి సంస్థ కార్యక్రమాలను ఎప్పటికప్పు డు అందరికి తెలిసే విధంగా పోస్టుచేస్తున్నారు.
ప్రవాసుల సేవలు అభినందనీయం
గల్ఫ్ దేశాల్లో ఉన్న రాంపూర్ వాసులు అసోసియేషన్‌గా ఏర్పడి సేవా కార్యక్రమాలను విస్తరించడం అభినందనీయం. రాంపూర్ గ్రామానికి మంచి పేరు తీసుకువస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న కార్మికులకు సహాయం అందించడమే కాకుండా గ్రామంలోని పేదలకు అండగా నిలువడం ఎంతో బాగుంది. వారి సేవా కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాయి.
– పాపాయి తిరుపతి, సర్పంచ్
రాంపూర్ అసోసియేషన్ ద్వారానే మృతదేహం ఇంటికి చేరింది
మా తమ్ముడు దేవేందర్ ఏడాది క్రితం సౌదీలో మరణించాడు. మృతదేహాన్ని ఇంటికి చేర్చడంలో మా అసోసియేషన్ సభ్యులు ఎంతో శ్రమించారు. సంస్థ సభ్యులు చొరవ చూపడం వల్లనే పది రోజుల్లో మృతదేహం ఇంటికి చేరింది. అసోసియేషన్ సభ్యులు ఆర్థికసాయం కూడా చేశారు. వారు చేసిన మేలు మరచిపోలేం.
– కిరణ్‌కుమార్, రాంపూర్ వాసి