రాణా ప్రతాప్, శివాజీ మన హీరోలు.. ఔరంగజేబ్ కాదు: రాజ్‌నాథ్
ఛత్రపతి శంభాజీ నగర్: రాణా ప్రతాప్ సింగ్, ఛత్రపతి శివాజీ మహారాజ్‌లు మన జాతి హీరోలని, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మేవాడ్ పాలకుడు మహారాణా ప్రతాప్ విగ్రహాన్ని శుక్రవారం ఛత్రపతి శంభాజీ నగర్లో ఆయన ఆవిష్కరించారు. జౌరంగజేబ్, బాబర్లను శ్లాఘించడం దేశంలోని ముస్లింలను అగౌరవపర్చడమే అవుతుందని చెప్పారు. ‘ధైర్యసాహసాలు, దేశ భక్తికి ప్రతిరూపం మహారాణా ప్రతాప్..ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు ముఖ్యంగా గెరిల్లా యుద్దతంత్రంలో ఆయనే స్ఫూర్తి’అని రాజ్‌నాథ్ తెలిపారు. ఔరంగజేబ్‌ను పొడిగేవారు అతడి గురించి పండిట్ నెహ్రూ ఏం రాశారో తెలుసుకోవాలని సూచించారు. స్వాతంత్య్రానంతరం వామపక్ష అనుకూల భావాలు కలిగిన కొందరు చరిత్రకారులు రాణా ప్రతాప్, శివాజీలకు తగు ప్రాధాన్యం ఇవ్వలేదు సరికదా, ఔరంగజేబ్‌ను కీర్తించారని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని మతాలను గౌరవిస్తూ ఉపనిషత్తులను అనువదించిన దారా షికోను ఔరంగజేబ్ చంపించాడన్నారు. మొఘలులతో జరిగిన మల్దిఘాటి యుద్దంలో రాణా ప్రతాప్ సైన్యాధికారి హకీంఖాన్ సూరి ప్రాణత్యాగం చేశాడని చరిత్రను మంత్రి గుర్తు చేశారు.