విద్యార్థి అదృశ్యం
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : స్థానిక పాతూరులోని నీరుగంటి వీధికి చెందిన, 6వ తరగతి విద్యార్థి రణధీర్ బుధవారం అదృశ్యమయ్యాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. నీరుగంటి వీధిలో నరసింహులు, నాగేంద్రమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. తిరుపతికి చెందిన నాగేంద్రమ్మ సోదరి సౌదారాణి , తన కుమారుడితో కలిసి వీరి వద్దే నివాసం ఉంటోంది.
బుధవారం స్కూలుకు వెళ్లమని చెప్పినా వినకుండాఇంటి వద్దే ఉన్న రణధీర్, ఉదయం 9.30 గంటల వరకూ మిత్రులతో కలిసి కాలనీలో ఆడుకుంటూ తిరిగాడు. అనంతరం ఆ బాలుడు కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు నగరమంతా గాలించారు. స్కూలుకు వెళ్లి టీచర్లను సైతం ఆరా తీశారు. అయినా ఆచూకీ లభించలేదు. దీంతో రాత్రి 10 గంటల సమయంలో వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలుడి కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.