70 ఎకరాలు 30 పంటలు.. హైదరాబాద్ నగరానికి ఏడాది పొడవునా
ప్రకృతి వ్యవసాయదారుడిగా మారిన బ్యాంకింగ్ నిపుణుడు ఇమ్మానేని రంగప్రసాద్ తన పొలాన్ని ఉద్యాన పంటల జీవవైవిధ్య క్షేత్రంగా మార్చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలం జూపల్లె గ్రామపరిసరాల్లో 70 ఎకరాల భూమిని నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేసి ‘ఐఫార్మస్’ పేరుతో అభివృద్ధి చేశారు. 30 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల చెట్లతో పాటు నాటుకోళ్లు, ఆవుల పెంపకం చేపట్టారు. పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి ఏడాది పొడవునా అమృతాహారాన్ని అందించడమే లక్ష్యమంటున్న రంగప్రసాద్ కృషిపై కథనం.
హైదరాబాద్‌కు చెందిన ఇమ్మనేని రంగప్రసాద్ బ్యాంకింగ్ నిపుణుడు. డా. కిరణ్మయి మైక్రోబయాలజిస్టు. ఈ దంపతులకు సేంద్రియ/ప్రకృతి సేద్యం అంటే మక్కువ. ఈ మక్కువతోనే హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల దూరంలో సమీకృత సేంద్రియ ఉద్యాన పంటల క్షేత్రానికి ఎంతో శ్రమించి రూపుకల్పన చేశారు. ఏడాది పొ డవునా రసాయనిక అవశేషాల్లేని చాలా రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నాటు కోడిగుడ్లను నగరవాసులకు అందించాలని సంకల్పించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలం జూపల్లె గ్రామపరిసరాల్లో 70 ఎకరాల భూమిని నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేసి ‘ఐఫార్మ్స్’ పేరుతో జీవవైవిధ్య ఉద్యాన క్షేత్రంగా అభివృద్ధి చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల కాలువను అనుకొని ఉండటంతో ఈ క్షేత్రానికి సాగు నీటి కొరత లేదు. తెలంగాణ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నేత ఎమ్మెస్ సుబ్రహ్మణ్యం రాజు సూచనలు, సలహాలతో ఈ క్షేత్రం మెరుగైన ఉత్పాదకత సాధిస్తుండటం విశేషం.
దేశ విదేశీ రకాలెన్నో... అనేక రకాల నేలలు, ఎత్తుపల్లాలతో కూడిన ఈ పొ లాన్ని అనేక విభాగాలుగా విభజించి, ఒక్కో విభాగంలో ఒక్కో రకం ప్రధాన పంటలను, వాటి మధ్య అనేక అంతర పంటలను సాగు చేస్తున్నారు. ఏడాది పొ డవునా దిగుబడులు తీసుకునేందుకు వీలుగా వారానికోసారి ఆకుకూరలు, 15 రోజులకోసారి కూరగాయ మొక్కలు నాటుతూ (స్టాగ్గర్డ్ ప్లాం టేషన్ చేస్తూ) ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తున్నారు.
క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, క్యాబేజి, కాళీఫ్లవర్ వంటి పంటలు 15 రోజులకోసారి విత్తుతున్నారు. కాకర, బీర, సొర, టమాటో, బెండ వంటి పంటలను నెలకోసారి విత్తుతున్నారు. ఐఫార్మ్స్లో ఆరుబయట ఎత్తు మడులపై పెరుగుతున్న కసూరి మేతి, ఎర్ర ముల్లంగి, దిల్, గ్రీన్ లెట్యూస్, రెడ్ లెట్యూస్, పర్పుల్ కార్న్, బేబీ కార్న్, మిక్స్డ్ కలర్ కార్న్.. వంటి విదేశీ జాతుల కూరగాయలు వినియోగదారులను, సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచే నల్ల కంది, సుగంధ పసుపు, మామిడి అల్లం వంటి పంటలు కూడా ఈ క్షేత్రంలో సాగవుతున్నాయి.
అంతర పంటలు.. మొరంగడ్డ తీగతో మల్చింగ్...
మామిడి, జామ, సీతాఫలం, బొ΄్పాయి తదితర పండ్ల మొక్కల మొదళ్లలో మొరంగడ్డ (చిలగడదుంప) తీగ ముక్కలను నాటడం ద్వారా కలుపును నివారించడమే కాకుండా సజీవ ఆచ్ఛాదన కల్పిస్తుండటం మరో విశేషం. తీగ ముక్క నాటిన ఆరు నెలల్లో చిలగడదుంపలను తవ్వి వినియోగదారులకు అందిస్తూ ఆదాయం కూడా పొ ందుతున్నారు. పండ్ల తోటల్లో ఖరీఫ్‌లో, రబీలో కూడా అంతర పంటలను సాగు చేస్తున్నారు
సజీవ ఆచ్ఛాదన, కలుపు నివారణ, అదనపు ఆదాయం.. అంతర పంటల ద్వారా ఈ మూడు ప్రయోజనాలు సాధిస్తున్నారు. జామ తోటలో మొక్కల మధ్య చిలగడదుంప, సాళ్ల మధ్య వేరుశనగ వేశారు. వేరుశనగలతో వంట నూనె ఉత్పత్తి చేయడానికి ఎద్దు గానుగను ఏర్పాటు చేసుకుంటున్నామని రంగప్రసాద్ తెలిపారు. శాశ్వత పందిరికి దొండ తీగలు పాకించి.. పందిరి కింద సాళ్ల మధ్య ఖాళీలో వెల్లుల్లి, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. బొ΄్పాయి తోట మధ్యలో 9 రకాల తులసి రకాలను పెంచుతున్నారు. సీతాఫలంలో బాలానగర్, ఎన్ఎంకె గోల్డ్, రామాఫలం, లక్ష్మణఫలం రకాలు నాటారు. ఈ నాలుగూ ఒకేసారి కాపునకు రావు. ఒకటి పూర్తయ్యాక మరొకటి ఫలాలనిస్తాయి.
ఎటు చూసినా 10 అడుగుల దూరంలో మామిడి మొక్కలు నాటారు. మధ్యలో ఖరీఫ్‌లో కంది, రబీలో చిలగడదుంప సాగు చేస్తున్నారు. అందరూ ఎక్కువగా ఇష్టపడే బేనిషాన్, హిమాయత్ మొక్కలు పెట్టాం. ఎక్కడెక్కడి నుంచో అరుదైన రకాలను సైతం తెచ్చి అన్నీ కలిపి 70 రకాలను నాటామని రంగప్రసాద్ తెలిపారు. భవిఫ్యత్తులో అన్ని రకాల మామిడి పండ్లతో కూడిన బుట్టలను ప్రజలకు సరఫరా చేయనున్నట్లు సుబ్రమణ్యరాజు తెలిపారు.
ఒకసారి విత్తితే.. వరుసగా రెండు పంటలు!
ఆకుపచ్చ క్యాబేజీ, ఎరుపు బ్రోకలీ వంటి కొత్తరకం పంటలను ఐఫార్మ్స్లో పండిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే.. ఒకే మొక్కకు రెండు సార్లు దిగుబడి తీస్తున్నారు. ఒక పంట తీసుకున్న తర్వాత అదే మొక్క నుంచే 50 రోజుల్లో కార్శి(రటూన్ క్రాప్) పంట తీస్తున్నారు. గో ఆధారిత ప్రకృతి సేద్య నిపుణులు సుబ్రహ్మణ్యం రాజు పర్యవేక్షణలో ఈ ప్రయోగాత్మక సాగు జరుగుతోంది. ఆయన ఏమంటున్నారంటే.. మొదటి పంటగా క్యాబేజీ, బ్రోకలీ కోసిన తర్వాత మొక్కలను అలాగే ఉంచి, ఎప్పటిలాగే క్రమం తప్పకుండా నీరు ఇవ్వాలి. 2 వారాల్లో కొత్త పిలకలు వస్తాయి. పెద్దదాన్ని ఉంచి, మిగిలినవన్నీ తీసివేయండి.
400–500 గ్రాముల క్యాబేజీ, బ్రోకలీ కావాలంటే రెండు రెమ్మలు ఉంచండి. ప్రతి పది రోజులకు పంచగవ్య, ఫిష్ అమినో యాసిడ్, ఆవు మూత్రం పిచికారీ చేయడం ద్వారా పోషకాహారం ఇవ్వండి. పంట కాలంలో మూడు సార్లు పిచికారీ చేయాలి. రెండో పంట కోసం 40–50 రోజుల వరకు వేచి ఉండండి. ఈ కార్శి పంట వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రెండో పంటకు బెడ్ తయారీ అవసరం లేదు. అదనపు శ్రమ లేదు. తక్కువ కలుపు. తక్కువ వ్యవధి. కాబట్టి చాలా తక్కువ ఖర్చు. సీజన్ లో కన్నా ధర ఎక్కువగా వస్తుంది.
నాటు కోళ్లు
సమీకృత సేద్యం ద్వారానే ఉత్తమ ఫలితలు వస్తాయని రంగప్రసాద్ నమ్మిక. 35 దేశీ ఆవులతో కూడిన గోశాల ఈ క్షేత్రంలో ఉంది. సుమారు 400 నాటుకోళ్ల ఫారాన్ని నెలకొల్పారు. నాటు కోళ్లతో పాటు గిన్నెకోళ్లు, టర్కీ కోళ్లు, అసీల్ తదితర జాతుల కోళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆరోగ్యదాయకన రీతిలో ఆరుబయట తిరుగుతూ పెరిగేలా కోళ్లకు ఏర్పాట్లు చేశారు. నాటు కోడి గుడ్లను కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు అందించాలన్నదే రంగప్రసాద్ లక్ష్యం.
సంతృప్తికర∙ఉత్పాదకత
పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, జీవన ఎరువులు, జీవన పురుగుమందులను అవసరాన్ని బట్టి వాడుతున్నారు. తద్వారా పోషకలోపాలు లేకుండా, చీడపీడల బెడద లేకుండా.. సంతృప్తికరమైన రీతిలో పంటల ఉత్పాదకత సాధిస్తున్నట్లు సుబ్రహ్మణ్య రాజు(76598 55588) వివరించారు. హైదరాబాద్‌లోని ఆర్గానిక్ షాపులకు అందించడంతో పాటు ఎంపికచేసుకున్న గేటెడ్ కమ్యూనిటీలకు స్వయంగా తీసుకెళ్లి వారానికోసారి తమ సేంద్రియ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు రంగప్రసాద్. సేంద్రియ ఆహారోత్పత్తులను నేరుగా పొ లం నుంచి పొ ందగోరే గేటెడ్ కమ్యూనిటీలు, నివాస సముదాయాల సంక్షేమ సంఘాలు ఉచితంగా తమ క్షేత్రాన్ని సందర్శించవచ్చని సమీకృత సేంద్రియ సాగుదారుడు రంగప్రసాద్(98851 22544) ఆహ్వానిస్తున్నారు.
- నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్