ఏసీబీ వలలో డీఈ
రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
రాయచోటి : ఏసీబీ వలలో ఆర్‌డబ్ల్యుఎస్ డీఈ రంగప్రసాద్ చిక్కాడు. కాంట్రాక్టర్ వద్దనుంచి రూ. 5 వేలు లంచంగా తీసుకుంటూ బుధవారం సాయంత్రం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి, కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి కధనం మేరకు.. సుండుపల్లె మండలం పత్తివాండ్లపల్లెకు చెందిన కె. కృష్ణారెడ్డి రూ. 2 లక్షల జెడ్పీ నిధులతో వాయల్‌పాటివాండ్లపల్లెలో పైప్ లెన్ పనులు చేశాడు.
ఆ పనులకు బిల్లు పొందేందుకు ఎంబుక్ పూర్తి చేసి డీఈకి అందజేశారు. దానిపై సంతకం చేసేందుకు 4 శాతం లంచం ఇవ్వాలని డీఈ అడిగాడు. చివరకు రూ. 5 వేలైనా ఇవ్వకపోతే సంతకం పెట్టేదిలేదన్నాడు. బిల్లు కోసం పలుమార్లు డీఈ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో కృష్ణారెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఏసీబీ అధికారులు అందించిన రూ. 5 వేలను డీఈ రంగప్రసాద్‌కు కృష్ణారెడ్డి అందజేశారు, అప్పటికే సిద్ధంగా ఉన్న ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి డీఈ రంగప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డితో పాటు సీఐలు పార్థసారధిరెడ్డి రాంకిషోర్,సుధాకర్‌రెడ్డి,లక్ష్మీకాంత్‌రెడ్డి,చంద్రశేఖర్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ శంకర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఏ శాఖలోనైనా లంచం అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ్రప్రభుత్వ జీతం తీసుకుంటున్న ఉద్యోగులు నిజాయితీతో పనిచేయాల్సి ఉంటుందన్నారు.
కాంట్రాక్టరు క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ విల్లు కోసం తాను అనేక సార్లు డీఈ రంగప్రసాద్‌ను కలిశానన్నారు. లంచం ఇవ్వనిదే తాను సంతకం పెట్టనని చెప్పాడన్నారు. దీంతో విధిలేని పరిస్థితులో తాను ఏసీబీ అధికారులను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.