Raniganj
-
‘మా కూతురు బతికే ఉండాలి దేవుడా’
సాక్షి, రాంగోపాల్‌పేట్ : రాణి గంజ్‌కు చెందిన ఓ యువతి (26) సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో చెల్లెలితో కలిసి ఎంఎంటీఎస్ రైలులో వెళ్లింది. సంజీవయ్య పార్కు వద్ద చెల్లికి లేఖ ఉన్న ఒక కవరు ఇచ్చి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిపోయింది. అక్క ఎక్కడికి వెళ్లిందో అర్థం కాక చెల్లెలు లేఖను చూసింది. అందులో.. ‘అమ్మా నేను చనిపోతున్నా ’ అని రాసి ఉంది. దీంతో ఆందోళనకు గురైన చెల్లెలు అమ్మానాన్నలకు చెప్పింది. వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇదిలా ఉండగా యువతి బ్యాగు నెక్లెస్‌రోడ్‌లో ఉన్న నాలా పక్కన అక్కడున్న వారికి కనిపించింది. దీంతో రాంగోపాల్‌పేట్ ఇన్స్పెక్టర్ బాబు, లేక్ ఇన్స్పెక్టర్ ధనలక్ష్మి పోలీసులు పెద్ద ఎత్తున సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి హుసేన్ సాగర్‌ను అణువణువూ గాలించారు. సాగర్‌లో దూకిన అమ్మాయి ఆచూకీ ఏమైనా దొరుకుతుందేమోననే ఆశతో సాగర్‌ను జల్లెడ పట్టారు. బయటనుంచి ప్రజలు కూడా గుమిగూడారు. యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతూ మా కూతురు బతికే ఉండాలి దేవుడా అని దండం పెడుతున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ గాలింపు కొనసాగింది. సాగర్‌తోపాటు పక్కనున్న నాలాలో కూడా వెతుకుతూనే ఉన్నారు. తరువాత అమ్మానాన్నలకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దానిని విన్న తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. అమ్మా..నేను బాగానే ఉన్నా.. అంటూ కూతురు ఎక్కడినుంచో ఫోన్‌చేసి చెప్పింది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రియుడితో కలిసి వెళ్లిపోయేందుకు ఆమె ఇలా నాటకమాడినట్లు తెలుస్తోంది. తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. -
బూడిదే మిగిలింది..
రాణిగంజ్‌లో శుక్రవారం సాయంత్రం పెయింట్స్ గోదాంలో జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం బూడిదైంది. గోదాంలో నిల్వ ఉంచిన రంగుల డబ్బాలతో పాటు, ఎలక్ట్రానిక్ గోదాంలోని సరుకు కూడా అగ్నికి ఆహుతయింది. ఫైర్ సిబ్బంది సుమారు 12 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. ఈ దుర్ఘటనలో రూ.4.5 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. రాంగోపాల్‌పేట్: రాణిగంజ్‌లోని పెయింట్ గోదాములో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగింది. పెయింట్ గోదాముతో పాటు దాన్ని ఆనుకునే ఉన్న ఎలక్ట్రికల్ గోదాముకు మంటలు అంటుకుని రెండు పూర్తిగా కాలిపోయాయి. మూడు ప్లోర్లతో పాటు అదనంగా ఏర్పాటు చేసుకున్న రేకుల షెడ్డుల్లోని వస్తువులన్నీ కాలిపోయి బూడిద మాత్రమే మిగిలింది. శుక్రవారం సాయంత్రం 5.30గంటల సమయంలో మొదలైన మంటలు ఏకధాటిగా 12గంటల పాటు మంటలు ఎగిసిపడ్డాయి. వాటిని ఆర్పేందుకు 14 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు శ్రమించాల్సి వచ్చింది. పొగను పూర్తిగా ఆర్పివేసేందుకు ఉదయం 6 గంటల నుంచి 7 ఫైరింజన్ల మధ్యాహ్నం 2గంటల వరకు పనిచేసి ఆర్పివేశాయి. రాత్రి 11.30గంటల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. సాయంత్రం నుంచి టెన్షన్ టెన్షన్ సికింద్రాబాద్‌లో ఇలాంటి భారీ అగ్ని ప్రమాదం జరుగడం రెండు దశాబ్దాల్లో మొట్టమొదటి సారి అగ్ని మాపక సిబ్బంది చెబుతున్నారు. మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతుండటంతో ఎక్కడ చుట్టు పక్కల వ్యాపిస్తాయోనని స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. గంటల తరబడి మంటలు వస్తూనే ఉండటం ఎప్పుడు ఏమి జరుగుతుందోననే ఆందోళన కనిపించింది. ఆస్తినష్టం రూ.4.5 కోట్లు ఈ అగ్ని ప్రమాదంలో ఆస్తినష్టం సుమారు రూ.4.5 కోట్ల మేరకు ఉంటుందని బాధితులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన గోదాము యజమాని బేగంపేట్‌కు చెందిన కల్పేష్ బోగాని షేడ్స్ పెయింట్స్ పేరుతో దాని పక్కనే దుకాణం నిర్వహిస్తున్నారు. కావేరి ఎలక్ట్రికల్ సంస్థ అధినేత శైలేష్ ఆర్పిరోడ్లో దుఖాణం నిర్వహిస్తూ ఇక్కడ గోదాము కొనసాగిస్తున్నారు. కావేరి ఎలక్ట్రికల్స్‌లో సుమారు రూ.3 కోట్ల వరకు సామాగ్రీ ఉందని శైలేష్ వాపోయాడు. పెయింట్స్ గోదాములో కూడా సుమారు కోటిన్నర రూపాయల వరకు పెయింట్స్ ఉండవచ్చని కల్పేష్ పోలీసులకు తెలిపారు. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న షేడ్స్ పెయింట్స్ యజమాని కల్పేష్ కళ్ల ముందే ఆస్తి మొత్తం కాలిపోతుండటంతో స్పృహ తప్పిపడిపోయాడు. వెంటనే అతన్ని ఓ ప్రవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పురాతన భవనం – నాలుగు అంతస్తుల్లో గోదాములు అగ్ని ప్రమాదం జరిగిన ఈ భవనం కావేరి, షేడ్స్ పెయింట్స్ గోదాములు కింది నుంచి నాలుగు ప్లోర్లు పక్కపక్కనే ఉన్నాయి. నాలుగవ అంతస్తు రేకుల షెడ్డుతో నిర్మించారు. ఈ భవనం 1979 సంవత్సరంలో నిర్మించగా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఇలాంటి ఈ భవనంలో వందలాది డబ్బాల పెయింట్స్, టర్పెంటాయిల్, థిన్నర్ డ్రమ్ములతో ఎక్కువ మొత్తంలో వీటిని నిలువ చేశారు. అన్ని ప్రేలుడు స్వభావం ఉన్నవే కావడంతో మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి చాలా ఖష్టమైంది. ఫైరింజన్ వెళ్లేందుకువీలు లేకపోవడంతో మంటలార్పేందుకు కష్టపడాల్సి వచ్చింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతురామ్మోహన్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కుప్పకూలిన భవనం అగ్ని ప్రమాదం జరిగిన నాలుగు అంతస్తుల్లో పక్కపక్కనే ఉన్న రెండు గోదాములున్న భవనం మొత్తం కూలిపోయింది. గంటల తరబడి మంటల్లో తగులబడటంతో ఆ వేడిమికి భవనం స్లాబులు, గోడలు కూలిపోయాయి. శనివారం మధ్యాహ్నం తర్వాత ప్రమాదం జరిగిన భవనం ప్రమాదకరంగా ఉండటంతో ఇటాచ్ సహాయంతో అధికారులు కూల్చివేశారు. భారీ అగ్ని ప్రమాదం సికింద్రాబాద్‌లో ఇలాంటి భారీ అగ్ని ప్రమాదం ఎప్పుడూ జరుగలేదు. మొదట మంటలను అదుపు చేసేందుకు 600 లీటర్ల ఫోమ్‌ను వినియోగించాము కానీ పేలుడు, నీరు కొడుతుండటంతో అది ఎక్కువ సేపు నిలువలేక మంటలు అదుపు చేయలేక పోయింది. 14 ఫైరింజన్లు 80 మంది సిబ్బంది, 5 వైపుల నుంచి మంటలను అదుపు చేశాం. దీంతో చుట్టు పక్కల మంటలు వ్యాపించకుండా అదుపు చేయగలిగాం. లేకపోతే పెయింట్స్, టర్పెంట్ ఆయిల్ లాంటి ప్రేలుడు వస్తువులకు మరింత భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉండేది. ఉన్నతాధికారులు రాత్రంతా ఇక్కడే ఉండి పర్యవేక్షించారు. – జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి బూడిదే మిగిలింది -
రాణిగంజ్‌లోని పెయింట్ గోడౌన్లో బారీ అగ్ని ప్రమాదం
-
రాణిగంజ్‌లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ రాణిగంజ్‌లోని బాంబే హోటల్ సమీపంలోని పెయింట్ గోడౌన్లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. పెయింట్స్ గోడౌన్ కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సమీప భవనాలకు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వేడి తీవ్రతకు సమీపానికి వెళ్లడానికి కూడా వీలు కాకుండా ఉంది. మరోవైపు భారీ శబ్ధాలతో పెయింట్ డబ్బాలు పేలుతుండటంలో భయాందోళన వాతావరణం నెలకొంది. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో అధికారులు లోకల్ ట్రైన్స్‌ను నిలిపేశారు. అలాగే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జాం అయింది. కాగా పెయింట్ గోదాంకు ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. -
ఆర్టీసీలో మరో ఇంటిదొంగ
రాణిగంజ్ డిపోలో రూ.10 లక్షలు స్వాహా కాంట్రాక్ట్ ఉద్యోగి ఘనకార్యం సాక్షి,సిటీబ్యూరో: ఆర్టీసీలో మరో ఇంటిదొంగ గుట్టు రట్టయింది. ఉద్యోగుల జీతాల సొమ్ములోంచి ఏకంగా రూ.10 లక్షలు స్వాహా చేశారు. రాణిగంజ్-1 డిపోలో జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఆఫీస్క్లర్క్గా పనిచేస్తున్న ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి శివాజీ సంస్థ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతం డబ్బును నొక్కేశాడు. గతంలో మిధానీ డిపోలో జరిగిన ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి రావడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని అన్ని డిపోల్లోని అకౌంట్లను తనిఖీలు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ ఎ. కోటేశ్వరరావు ఆదేశించారు. గతంలో ఆర్టీసీలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఉద్యోగులూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులే కావడం గమనార్హం. ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన కొందరిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ కేటగిరీల్లో వినియోగించుకుంటున్నారు. అలా విధులు నిర్వహిస్తున్న వారే ఇలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గతనెలలో మిధాని డిపోకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి.. వాణిజ్య కార్యక్రమాల ద్వారా ఆర్టీసీకి లభించిన రూ.40 లక్షలను స్వాహా చేశాడు. స్టాళ్ల ద్వారా వచ్చిన ఆదాయానికి తప్పుడు లెక్కలు చూపించి అతను సొమ్ము కాజేశాడు. ఈ ఘటనపై డిపో అధికారులు వెంటనే సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తాజాగా, రాణిగంజ్-1 డిపో లో పని చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగి శివాజీ కూడా ఉద్యోగుల జీతాల కోసం విడుదల చేసిన చెక్కుల్లో అంకెలను మార్చేసి ఎక్కువ డబ్బు డ్రా చేసినట్టు డిపో మేనేజర్ గుర్తించారు. ఇతను విడతల వారీగా మొత్తం రూ.10 లక్షల వరకు స్వాహా చేసినట్టు అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని డిపోల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు... వరుసగా జరుగుతున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని అన్ని డిపోల్లోనూ ఆదాయ,వ్యయాలపై కచ్చితమైన లెక్కలను సమర్పించాల్సిందిగా డిపో మేనేజర్లను ఆదేశించినట్లు ఈడీ చెప్పారు. ఆర్టీసీ సొమ్ము కాజేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, వారి నుంచి మొత్తం డబ్బు వసులు చేస్తామని ఆయన చెప్పారు.