అగ్ని ప్రమాదం జరిగి పూర్తిగా కాలిపోయి, కూప్ప కూలిన భవనం
రాణిగంజ్‌లో శుక్రవారం సాయంత్రం పెయింట్స్ గోదాంలో జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం బూడిదైంది. గోదాంలో నిల్వ ఉంచిన రంగుల డబ్బాలతో పాటు, ఎలక్ట్రానిక్ గోదాంలోని సరుకు కూడా అగ్నికి ఆహుతయింది. ఫైర్ సిబ్బంది సుమారు 12 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. ఈ దుర్ఘటనలో రూ.4.5 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
రాంగోపాల్‌పేట్: రాణిగంజ్‌లోని పెయింట్ గోదాములో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగింది. పెయింట్ గోదాముతో పాటు దాన్ని ఆనుకునే ఉన్న ఎలక్ట్రికల్ గోదాముకు మంటలు అంటుకుని రెండు పూర్తిగా కాలిపోయాయి. మూడు ప్లోర్లతో పాటు అదనంగా ఏర్పాటు చేసుకున్న రేకుల షెడ్డుల్లోని వస్తువులన్నీ కాలిపోయి బూడిద మాత్రమే మిగిలింది. శుక్రవారం సాయంత్రం 5.30గంటల సమయంలో మొదలైన మంటలు ఏకధాటిగా 12గంటల పాటు మంటలు ఎగిసిపడ్డాయి. వాటిని ఆర్పేందుకు 14 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు శ్రమించాల్సి వచ్చింది. పొగను పూర్తిగా ఆర్పివేసేందుకు ఉదయం 6 గంటల నుంచి 7 ఫైరింజన్ల మధ్యాహ్నం 2గంటల వరకు పనిచేసి ఆర్పివేశాయి. రాత్రి 11.30గంటల సమయంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సైతం అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు.
సాయంత్రం నుంచి టెన్షన్ టెన్షన్
సికింద్రాబాద్‌లో ఇలాంటి భారీ అగ్ని ప్రమాదం జరుగడం రెండు దశాబ్దాల్లో మొట్టమొదటి సారి అగ్ని మాపక సిబ్బంది చెబుతున్నారు. మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతుండటంతో ఎక్కడ చుట్టు పక్కల వ్యాపిస్తాయోనని స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. గంటల తరబడి మంటలు వస్తూనే ఉండటం ఎప్పుడు ఏమి జరుగుతుందోననే ఆందోళన కనిపించింది.
ఆస్తినష్టం రూ.4.5 కోట్లు
ఈ అగ్ని ప్రమాదంలో ఆస్తినష్టం సుమారు రూ.4.5 కోట్ల మేరకు ఉంటుందని బాధితులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన గోదాము యజమాని బేగంపేట్‌కు చెందిన కల్పేష్ బోగాని షేడ్స్ పెయింట్స్ పేరుతో దాని పక్కనే దుకాణం నిర్వహిస్తున్నారు. కావేరి ఎలక్ట్రికల్ సంస్థ అధినేత శైలేష్ ఆర్పిరోడ్‌లో దుఖాణం నిర్వహిస్తూ ఇక్కడ గోదాము కొనసాగిస్తున్నారు. కావేరి ఎలక్ట్రికల్స్‌లో సుమారు రూ.3 కోట్ల వరకు సామాగ్రీ ఉందని శైలేష్ వాపోయాడు. పెయింట్స్ గోదాములో కూడా సుమారు కోటిన్నర రూపాయల వరకు పెయింట్స్ ఉండవచ్చని కల్పేష్ పోలీసులకు తెలిపారు. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న షేడ్స్ పెయింట్స్ యజమాని కల్పేష్ కళ్ల ముందే ఆస్తి మొత్తం కాలిపోతుండటంతో స్పృహ తప్పిపడిపోయాడు. వెంటనే అతన్ని ఓ ప్రవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
పురాతన భవనం – నాలుగు అంతస్తుల్లో గోదాములు
అగ్ని ప్రమాదం జరిగిన ఈ భవనం కావేరి, షేడ్స్ పెయింట్స్ గోదాములు కింది నుంచి నాలుగు ప్లోర్లు పక్కపక్కనే ఉన్నాయి. నాలుగవ అంతస్తు రేకుల షెడ్డుతో నిర్మించారు. ఈ భవనం 1979 సంవత్సరంలో నిర్మించగా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఇలాంటి ఈ భవనంలో వందలాది డబ్బాల పెయింట్స్, టర్పెంటాయిల్, థిన్నర్ డ్రమ్ములతో ఎక్కువ మొత్తంలో వీటిని నిలువ చేశారు. అన్ని ప్రేలుడు స్వభావం ఉన్నవే కావడంతో మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి చాలా ఖష్టమైంది. ఫైరింజన్ వెళ్లేందుకువీలు లేకపోవడంతో మంటలార్పేందుకు కష్టపడాల్సి వచ్చింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతురామ్మోహన్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
కుప్పకూలిన భవనం
అగ్ని ప్రమాదం జరిగిన నాలుగు అంతస్తుల్లో పక్కపక్కనే ఉన్న రెండు గోదాములున్న భవనం మొత్తం కూలిపోయింది. గంటల తరబడి మంటల్లో తగులబడటంతో ఆ వేడిమికి భవనం స్లాబులు, గోడలు కూలిపోయాయి. శనివారం మధ్యాహ్నం తర్వాత ప్రమాదం జరిగిన భవనం ప్రమాదకరంగా ఉండటంతో ఇటాచ్ సహాయంతో అధికారులు కూల్చివేశారు.
భారీ అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్‌లో ఇలాంటి భారీ అగ్ని ప్రమాదం ఎప్పుడూ జరుగలేదు. మొదట మంటలను అదుపు చేసేందుకు 600 లీటర్ల ఫోమ్‌ను వినియోగించాము కానీ పేలుడు, నీరు కొడుతుండటంతో అది ఎక్కువ సేపు నిలువలేక మంటలు అదుపు చేయలేక పోయింది. 14 ఫైరింజన్లు 80 మంది సిబ్బంది, 5 వైపుల నుంచి మంటలను అదుపు చేశాం. దీంతో చుట్టు పక్కల మంటలు వ్యాపించకుండా అదుపు చేయగలిగాం. లేకపోతే పెయింట్స్, టర్పెంట్ ఆయిల్ లాంటి ప్రేలుడు వస్తువులకు మరింత భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉండేది. ఉన్నతాధికారులు రాత్రంతా ఇక్కడే ఉండి పర్యవేక్షించారు.
– జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి బూడిదే మిగిలింది
Comments
Please login to add a commentAdd a comment