సాక్షి, హైదరాబాద్: దూలపల్లిలోని ఓ రసాయన గోదాంలో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా ఫైర్ ఆఫీసర్ సుధాకర్‌రావు, పేట్‌బషీరాబాద్ సీఐ రమేష్, ప్రత్యక్షసాక్షులు తెలిపిన మేరకు.. నర్‌పత్‌రావు అనే వ్యక్తి దూలపల్లి పారిశ్రామికవాడలో ఎలాంటి అనుమతులు లేకుండా పరిశ్రమల మధ్యలో సాల్వెంట్ గోదాం నిర్వహిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోదాంలో ముగ్గురు కార్మికులు రసాయనాలను మిక్సింగ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో రసాయన చర్య జరిగి ఒక్కసారిగా మంటలు ఎగిసిపట్టాయి. దీంతో గోదాంలో ఉన్న కార్మికులు బయటకు పరుగులు తీశారు. సుమీర్ అనే కార్మికునికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఐదు ఫైరింజన్లతో వచ్చిన సిబ్బంది నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. గోదాంను నిర్వహిస్తున్న వ్యక్తిపై పేట్‌బషీరాబాద్ సీఐ రమేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో మేడ్చల్ జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ సైదులు, జీడిమెట్ల ఫైర్ ఆఫీసర్ సుభాష్‌రెడ్డి, కూకట్‌పల్లి ఫైర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి ఉండి.. మంటలు అదుపులోకి వచ్చే వరకు పరిస్థితిని పర్యవేక్షించారు.
పెద్ద ఎత్తున రసాయనాలు నిల్వ..
కేవలం 250 గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా సదరు యజమాని గోదాంను నిర్వహిస్తున్నాడు. గోదాంలో దాదాపు 200 వరకు డ్రమ్ముల్లో రసాయనాలను నిల్వ ఉంచారు. దీంట్లో ఎక్కువగా మండే స్వభావం కలిగి ఉన్న రసాయనాలు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. గోదాంకు ఆనుకుని ఉన్న 3 ఫ్యాబ్రికేషన్ పరిశ్రమలలో ఉన్న కార్మికులు పరుగులు తీయడంతో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకోగలిగారు. ఒక్కో డ్రమ్ము పేలుతూ గాల్లోకి 20 మీటర్ల మేర ఎగిరి కింద పడ్డాయి.
( చదవండి: Solar Power: హైదరాబాద్ నగరంలో పవర్ హౌస్ )
Comments
Please login to add a commentAdd a comment