‘టాప్’కు మరింత చేరువలో...ప్రపంచ నంబర్ 2గా సింధు
న్యూఢిల్లీ: తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు మరో చరిత్రకు సిద్ధమవుతోంది. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత వరల్డ్ టాప్ ర్యాంక్‌కు కేవలం ఒక అడుగు దూరంలో నిలిచింది. ఈ హైదరాబాదీ సంచలన షట్లర్ తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజాగా విడుదల చేసిన మహిళల సింగిల్స్ ర్యాంకుల్లో తెలుగు తేజం సింధు రెండో ర్యాంకుకు ఎగబాకింది. తద్వారా సైనా తర్వాత భారత్ తరఫున టాప్–3లో నిలిచిన రెండో క్రీడాకారిణిగా ఘనత వహించింది. ఆదివారం కరోలినా మారిన్ (స్పెయిన్) ను చిత్తు చేసి ఇండియా ఓపెన్ టైటిల్ గెలుచుకోవడంతో ఆమె మూడు స్థానాల్ని మెరుగుపర్చుకుంది.
75,759 రేటింగ్ పాయింట్లతో సింధు రెండో స్థానంలో నిలువగా... టాప్ ర్యాంకులో తై జు యింగ్ (చైనీస్ తైపీ; 87,911) కొనసాగుతోంది. మారిన్ నిలకడగా మూడో స్థానంలోనే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న మలేసియా ఓపెన్‌లో తొలిరౌండ్లోనే నిష్క్రమించిన సైనా (64,279) ఒక స్థానం దిగజారి తొమ్మిదో ర్యాంకులో నిలిచింది. పురుషుల సింగిల్స్ ర్యాంకుల్లో అజయ్ జయరామ్ 20వ ర్యాంకులో ఉన్నాడు. భారత్ తరఫున ఇదే మెరుగైన ర్యాంకు.