కాళ్లూ చేతులు కట్టేసి వ్యాపారి హత్య
సంజీవరెడ్డినగర్,న్యూస్‌లైన్: భార్యకు విడాకులిచ్చి తల్లితో కలిసి వేరుగా ఉంటున్నాడు.. ఉగాదికి తల్లి ఊరెళ్లింది.. ఏం జరిగిందో ఏమో తెలియదు ఓ వ్యాపారి ఇంట్లో దారుణహత్యకు గురయ్యాడు. స్నేహితుడు ఇంటికి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి వివరాలు సనత్‌నగర్ ఎస్సై రమేష్‌నాయక్ తెలిపిన ప్రకారం..ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన దాసరి అనిల్(42) నగరానికి వలసొచ్చి మోతీనగర్ అవంతినగర్తోటలో నివాసముంటున్నాడు.
బల్కంపేటలో ఫ్యాన్లకు అమర్చే రెగ్యులేటర్లు,స్విచ్‌బోర్డులు తయారు చేసి విక్రయిస్తుంటాడు. ఈయనకు వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ.. కుటుంబ తగాదాల కారణంగా 2004లో భార్యకు విడాకులిచ్చి తల్లి ప్రమీలారాణితో కలిసి ఉంటున్నాడు. ఉగాదికి తల్లి ఊరికి వెళ్లడంతో ఇంట్లోఒక్కడే ఉంటున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి ఇంటికొచ్చిన అనిల్ తెల్లారేసరికి దారుణహత్యకు గురయ్యాడు.
అయితే బుధవారం ఉదయం అనిల్ స్నేహితుడు తారాసింగ్ ఫోన్చేస్తుండగా స్విచ్ఛాఫ్ అని వస్తుండడంతో అనుమానంతో ఇంటికొచ్చాడు. తలుపులు తెరిచి లోపలికి వె ళ్లి చూడగా అనిల్ రక్తపుమడుగులో ఉండడంతో భయంతో వెంటనే పోలీసులకు సమాచారమందించాడు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు హత్యకుగల కారణాలను ఆరాతీశారు. క్లూస్‌టీం,డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి పరిశీలించినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు.
దుండగులు కాళ్లు,చేతులు కట్టి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి కత్తులతో మెడకోసి హతమార్చారు. తలపై కూడా కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఘటనాస్థలంలో ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనిల్‌కు పాతకక్షలు ఏమైనా ఉన్నాయా లేక భార్యతో గొడవలున్నాయా, స్నేహితులే హతమార్చారా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.