టీడీపీ, టీఆర్ఎస్ మధ్య ఘర్షణ
- వరంగల్ జిల్లా పాలకుర్తిలో రాళ్లతో పరస్పర దాడులు
- పలువురికి గాయాలు
పాలకుర్తి/పాలకుర్తి టౌన్: వరంగల్ జిల్లా పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఆదివారం జరిగిన గోదాముల శంకుస్థాపన కార్యక్రమంలో టీఆర్ఎస్, టీడీపీ మధ్య జరిగిన ఘర్షణలో ఎస్సైతో పాటు ఇరు పార్టీల కార్యకర్తలకు, జర్నలిస్టులకు గాయాలయ్యాయి. పాలకుర్తిలో చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో గోదాముల శంకుస్థాపనకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే దయాకర్‌రావు హాజరు కావల్సి ఉంది. ఈ నేపథ్యంలో తొలుత ఎమ్మెల్యే దయాకర్‌రావు పార్టీ కార్యకర్తలతో మార్కెట్ కార్యాలయానికి రాగా, టీడీపీ కార్యకర్తలు ‘జై తెలుగుదేశం, ఎర్రబెల్లి నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు.
ప్రతిగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ‘జై తెలంగాణ, కడియం, సుధాకర్‌రావు, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో టెంటు లాగడంతో అది కూలిపోయింది. ఏం జరిగిందో ఏమో ఒక్కసారిగా కార్యకర్తలు రాళ్లు, ఇటుకలతో పరస్పర దాడులకు దిగారు. సమాచారం అందుకున్న పాలకుర్తి ఎస్సై ఉస్మాన్ షరీఫ్ అక్కడికి వచ్చి.. సమూహాన్ని చెదరగొట్టే ప్రయత్నంలో ఎమ్మెల్యే దగ్గరున్న కార్యకర్తను లాఠీతో కొట్టారు. దీంతో ఎర్రబెల్లి ఎస్సైపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలోనే ఎస్సై తలపై రాయివచ్చి పడింది. రక్తస్రావం అవుతున్న ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అదనపు పోలీసు బలగాలు రావడం.. టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి తరిమి కొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు ఎర్రబెల్లిని పోలీసులు అరెస్టు చేసి జనగామ పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు నేతలు పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అనుమతించలేదు. తర్వాత పోలీసులు ఎమ్మెల్యేను బచ్చన్నపేటకు తీసుకురాగా, పీఎస్ ఎదుట టీడీపీ కార్యకర్తలు బైఠారుుంచి రాస్తారోకో చేశారు.