Pudami Sakshiga : అంతరించిపోతున్న అరుదైన పక్షులు.. అక్రమంగా విదేశాలకు
ప్రపంచంలో జరుగుతున్న పర్యావరణ మార్పులతో ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. అదే కోవలో ఎన్నో పక్షిజాతులు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికే పలు జాతులు అంతరించిపోయాయి. స్టేట్ అప్ బర్డ్స్ వార్షిక నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 48% పక్షుల జనాభా తీవ్రంగా తగ్గిపోయింది.
మన దేశంలో ఇప్పటికే 50% పక్షుల జనాభా తగ్గిపోయింది. వాటిలో అరుదైన పక్షి ఆకుపచ్చ ముణియాలు కూడా ఉంది. ఈ రకం పక్షుల గురించి ఈ ఇంట్రెస్టింగ్ విశేషాలు మీకు తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా పక్షిజాతులు అంతరించిపోతున్నాయి. అక్రమ విదేశీ విక్రయాల వల్ల వీటి జనాభా తీవ్రంగా దెబ్బతింటుంది. మన దేశంలో దాదాపు 8 పక్షిజాతులు ఉన్నాయి. వీటిలో అత్యంత అరుదైన పక్షి ఆకుపచ్చ ముణియాలు. ఇవి ఆకారంలో చిన్నదిగా, బాహ్యబాగల్లో ఆకుపచ్చరంగుతో, ఉదరబాగల్లో లేత పసుపు వర్ణంతో,నలుపు తెలుపు చారాలతో (జీబ్రా స్ట్రిప్స్), ఎర్రటి కళ్ళు, ఎరుపు ముక్కుతో రామచిలుకను పోలిఉండటంతో చూడముచ్చటగా ఉంటుంది. అందుకే వీటి శాస్త్రీయ నామం Amandava formosa Formosa. అంటే లాటిన్ భాషలో అందంగా తయారైందని అర్థం. వీటిని గ్రీన్ స్ట్రాబెర్రీ ఫించ్, గ్రీన్ టైగర్ ఫించ్ అని కూడా పిలుస్తారు. ఆకుపచ్చ ముణియా,ఎరుపు ముణియా మాత్రమే ఎరుపు ముక్కు కలిగివుంటుంది. ఇది మరే ఇతర ముణియా జాతి పక్షుల్లో కనిపించని లక్షణం.
బాల్యదశలోని పక్షులు గోధుమ వర్ణంలోనూ, ఉదరబాగంలో లేత పసుపు రంగుతో ఆకర్షణీయంగా కనబడుతోంది. ఇవి దాదాపు 10 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. మగ పక్షులు ఆడపక్షుల కంటే ప్రకాశవంతంగా ఉంటుంది. ఇవి మధ్య, దక్షిణ భారతదేశానికి మాత్రమే స్థానికమైన పక్షులు. పొద అడవులు, పొడి నేల , వ్యవసాయ నేల , చెరుకు ,మక్కజాన్న ,రాగులు , సజ్జల పంట పొలాల్లో విరివిగా వీటి ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది.పెద్ద పెద్ద ఆకులతోను లేదా చెరుకు ఆకుల మధ్య వీటి గూళ్ళును వేలాడదీస్తుంది. జనవరి నుండి మే నెలలో సంతానోత్పత్తి కొరకు 4-6 గుడ్లు పెట్టి 16-25 రోజుల వరకు ఆడ,మగ పక్షుల చేత పొదగబడుతుంది. ఆహార సేకరణ కొరకు చిన్న చిన్న గుంపులు గుంపులుగా వెళ్లి పంట పొలాల్లోని చీడ పురుగులను, చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకుంటుంది. వీటి కూత హై పిచ్ గానంతో చెవులకు ఇంపుగా స్వీ...స్వీ అంటూ ముగుస్తుంది.
ఆది నుండి అక్రమ రవాణ:-
నిజానికి మనదేశంలో దాదాపు 250 దేశీయ అడవి పక్షులు,70 విదేశీ పక్షులు ,అక్రమ పక్షులవిక్రయం ( illegal bird trade ) లో ఉన్నాయి . ఇందులో ఆకుపచ్చ ముణియాలు ఆకర్షణగా కనిపించడంతో,మెలోడియస్ గానంతో, వేటగాళ్ల వలక సులభంగా చిక్కిపోవటం,పెంపరులతో స్నేహంగా మెలగడం,పెంచటం సులభ తరం కనుక పంజర పక్షులుగా మారాయి. 19 వ శతాబ్దంలో అహ్మదాబాద్ లోని ఒక కరప్షన్ ప్రాంతం అవడవత్ వీటి విక్రయానికి చిరునామాగా మారింది . అందువలనే వీటికి Green Avadavat అనే పేరు కూడా వచ్చింది. 1960 నుండి 1980 వరకు రెండు వేల ఆకుపచ్చ ముణియా పక్షుల మార్కెట్లలో బహిరంగంగా అమ్మకానికి గురైంది. దాదాపు 2000 నుంచి 3000 పక్షులు వరకు ప్రతియేటా ఇండియా నుంచి ఐరోపా ,ఉత్తర అమెరికా వంటి ఖండాంతర దేశాలకు అక్రమంగా ఎగుమతుల్లో తరలిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ తంతు 1980 నుండి యిప్పటి వరకు కొనసాగుతుంది. శతాబ్దాల నుంచి అక్రమ విదేశీ విక్రయాల వలన స్వేచ్చగా గాలిలో విహరించల్సిన పక్షులు ఇప్పుడు బాధిత పక్షులుగా పంజరాలకు పరిమితమైంది.
ఆవాస విధ్వంసమే ప్రధాన ముప్పు:-
ఈ పక్షులు మొదట్లో రాజస్థాన్ లోని మౌంట్ అభు కొండల్లో విరివిగా కనిపించేవి కానీ ఇప్పుడు వాటి ఉనికిని కోల్పోయి దక్షిణ భారతదేశానికి పరిమితమైంది. వీటిని సాంప్రదాయ వైద్య పద్దతిలో ఉపయోగించడం వలన జనాభా భారీగా తగ్గిందని అక్కడ ఆదివాసీ గిరిజన ప్రజలు చెబుతున్నారు.1980 లో అరకు లోయ పాదాల చెంత సుంకర మిట్ట ప్రాంతం ప్రధాన ఆవాస కేంద్రంగా పరిగణంపబడుతున్న సమయంలో అక్కడ బాక్సైట్ గనుల తవ్వకాల వలన ఆవాసం కోల్పోయి కనిపించకుండా పోయింది. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు మరియు పురుగు మందుల వాడకం వలన రసాయన పదార్థాలు జైవిక వ్యవస్థాపన జరిగి చనిపోతున్నాయి. అభివృద్ధి పనుల పేరుతో నివాస విధ్వంసం, అక్రమ విదేశీ విక్రయాలు, పంజార పక్షులుగా బంధించడం, ఆహారం కోసం వేటాడం వంటివి ప్రధాన ముప్పులుగా ఉన్నాయి.
చట్టాలున్న రక్షణ కరువైంది:-
భారత ప్రభుత్వం వీటి పరిరక్షణ నిమిత్తం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ (1972) లో షెడ్యూల్ 4 లో చెర్చింది.1981లో ఆకుపచ్చ మునియాలు అమ్మకానికి బాన్ విధించింది. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండెంజర్డ్ స్పీసీస్ (CITES) లో అంతరించిపోతున్న పక్షుల జాబితాలో చోటుచేసుకుంది. స్టేట్ ఆఫ్ ఇండియా బర్డ్స్ 2020 నివేదిక ప్రకారం.. ఇది తీవ్ర భయాందోళనకు గురికావడం, నిర్లక్ష్యం మరియు తక్కువ సమృద్ధిలో ఉండటం చాలా ప్రమాదకరం,ఆందోళనకరం అని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ 3 వ అనుకూల ఆవాసం:-
అడుగడుగునా అంతరాలు ఎదురుకొంటున్న పక్షికి అంధ్రప్రదేశ్ లోని గుడిస రిజర్వు ఫారెస్ట్ భారతదేశంలోనే 3 వ అతిపెద్ద అనుకూల ఆవాస కేంద్రంగా ఆశ్రయమిస్తుంది.అక్కడ సంతానోత్పత్తికి కూడా అనువైన ప్రాంతంగా మారింది. అంతే కాకుండా విశాఖపట్నంలోని దారకొండ మారేడుమిల్లి అడవుల్లో కూడా నాలుగు సైటింగ్స్ చేసినట్లు బర్డ్ వాచేర్స్
ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
పరిరక్షణ అవసరం :-
''ప్రపంచవ్యాప్తంగా ప్రమాద స్థితిలోన్న ఆకుపచ్చ మునీయాలు మరలా పచ్చదనం సంతరించుకోవాలంటే అడవులను పెంచాలి, అడవుల్లో వర్షపు నీతి నిల్వ కుంటలు ఏర్పాటుచేయాలి ,అడవుల్లో విజిలెన్స్ విభాగం తనిఖీ విధిగా చేయాలి , వీటి గుడ్లను పొదిగించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి ,వీటి ఆవాస మనుగడ పై పరిశోధనలు చేసేలా ప్రభుత్వాలు పూనుకోవాలి'' అని ఎస్వీ యూనీవర్సిటీ జువాలజి విభాగ ఆచార్య మారం రాజశేఖర్ తెలిపారు .
- గిడ్డకింద మాణిక్యం
అసోసియేట్ ప్రొఫెసర్, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి.
ఫోటోగ్రాఫర్- అసీమ్ కొఠిలా
డా. గుండులూరు స్వాతి,అసోసియేట్ ప్రొఫెసర్
జంతు శాస్త్ర విభాగం , ప్రభుత్వ డిగ్రీ కళాశాల పుత్తూరు.
తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters
పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com