Rastha rokollu
-
వివక్షపై కన్నెర్ర
తెలంగాణ విషయంలో ప్రభుత్వ వివక్షపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు నిర్వహిస్తున్న సభకు ప్రభుత్వం హడావుడిగా అనుమతి ఇచ్చి, టీజేఏసీ శాంతిర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. స్వయంగా ముఖ్యమంత్రే వెనుక ఉండి ఏపీఎన్జీవోల సభ నడిపిస్తున్నారని ఆరోపిస్తూ సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. సర్కారు తీరుపై తెలంగాణవాదులు వివిధ రూపాల్లో విరుచుకుపడ్డారు. వచ్చిన తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షి, కరీంనగర్ : ఎల్కతుర్తిలో విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇదే మండలంలోని తిమ్మాపూర్, శాంతినగర్‌లోని సీమాంధ్రులు శాంతి ర్యాలీ నిర్వహించారు. తామిక్కడే స్థిరపడ్డామని, ఇక్కడే ఉంటామని పేర్కొన్న సీమాంధ్రులు తెలంగాణను అడ్డుకోవద్దని ఆ ప్రాంత నేతలకు విజ్ఞప్తి చేశారు. ఏపీఎన్జీవోల సభను వ్యతిరేకిస్తూ రామగుండంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంతోపాటు వివిధ పట్టణాల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. రామగుండం లో 48 గంటల పాటు విధులకు హాజరు కాబోమని ప్రకటించారు. వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనం, ధర్నాలు నిర్వహించారు. పలు మండలాల్లో జేఏసీల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని కోరుతూ టీజీఏసీ ఆధ్వర్యంలో చందుర్తి నుంచి వేములవాడ వరకు శనివారం పాదయాత్ర చేయనున్నారు. సీఎం కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తూ తెలంగాణ ఆకాంక్షను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. టీజేఏసీ ఇచ్చిన 24 గంటల బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలపాలని భావిస్తున్నారు. సీఎం తీరుపై రగిలిపోతున్న అన్ని వర్గాలు బంద్‌కు మద్దతుగా నిలబడుతున్నాయి. జిల్లా అంతటా బంద్‌లో క్రియాశీలంగా పాలుపంచుకునేలా టీఆర్ఎస్ ఆ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసింది. విద్యార్థులు, న్యాయవాదులు, ప్రజాసంఘాలు, విద్యాసంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు, వ్యాపార వాణిజ్యవర్గాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీలోని ప్రధాన కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొనాలని నిర్ణయించడంతో బస్సులు డిపోలు దాటి బయటకు వచ్చే పరిస్థితి లేదు. బంద్‌కు రామగుండంలో అన్ని కార్మిక సంఘాలతో కూడిన అఖిలపక్షం మద్దతిస్తోంది. కరీంనగర్ జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిట్టుమల్ల శ్రీనివాస్, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఎక్సైజ్ శాఖ అసోసియేషన్ ఉద్యోగ సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. -
ఉద్యమాగ్ని
సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజన నిర్ణయంపై ‘అనంత’ అట్టుడుకుతోంది. నెల రోజులుగా ఉద్యమాగ్ని ప్రజ్వరిల్లుతోంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు రాస్తారోకోలు, ర్యాలీలతో హోరెత్తించారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో ముందుకుసాగారు. అనంతపురంలో పశు సంవర్ధకశాఖ ఉద్యోగులు కాగడాల ప్రదర్శన చేపట్టారు. ఏపీ ఎన్జీఓలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ర్యాలీలు నిర్వహించారు. ముస్లిం యువకులు ఒంటెలు, గుర్రాలపై ర్యాలీ చేశారు. విద్యుత్ ఉద్యోగులు బైక్ ర్యాలీ చేపట్టగా.. చిన్నారులు తెలుగుతల్లి, జాతీయ నాయకుల వేషధారణలతో నగరంలో ర్యాలీ చేపట్టారు. జాక్టో, ఆర్ట్స్‌కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది, పంచాయతీరాజ్, నీటిపారుదల, రోడ్లుభవనాలు, బీసీ, ఎస్టీ, ఎస్సీ ప్రజాసంఘాలు, ఐకేపీ, వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, న్యాయవాదులు, కార్మికశాఖ, ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు చేపట్టిన రిలేదీక్షలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గుర్నాథ్రెడ్డి, కాపురామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, ముఖ్యనేత ఎర్రిస్వామిరెడ్డి సంఘీభావం తెలిపారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలేదీక్ష చేపట్టిన రెవెన్యూ ఉద్యోగులకు జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం సంఘీభావం ప్రకటించింది. ఆయాశాఖలు చేపట్టిన రిలేదీక్షా శిబిరాల్లో ప్రైవేటు, ప్రభుత్వ విద్యార్థులు, కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎస్కేయూలో జేఏసీ నాయకులు చేపట్టిన రిలేదీక్షలు 31వ రోజుకు చేరుకున్నాయి. బోధనేతర ఉద్యోగులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నాయకులు రాస్తారోకో నిర్వహించి సోనియా, దిగ్విజయ్ సింగ్, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. నిరసనల హోరు ధర్మవరంలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. తాడిమర్రి, బత్తలపల్లిలో సమైక్యవాదులు ర్యాలీలు చేపట్టారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ముదిగుబ్బలో ఉపాధ్యాయులు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ కులాల ఆధ్వర్యంలో సమైక్య నిరసనలు పెల్లుబికాయి. గుంతకల్లులో జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. గుత్తి, పామిడిలో జేఏసీ, జాక్టో ఆధర్యంలో చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. హిందూపురంలో మాల కులస్తుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. సడ్లపల్లె మహిళలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో టీచర్లు, విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఏపీట్రాన్స్కో డివిజనల్ కార్యాలయానికి విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు తాళాలు వేసి నిరసన తెలిపారు. చిలమత్తూరులో వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర నిరసనలు మిన్నంటాయి. లేపాక్షిలో సమైక్యవాదులు పాండురంగ భజన చేశారు. కదిరిలో సమైక్యాంధ్రకు మద్దతుగా వికలాంగులు రిలేదీక్షలు చేపట్టారు. కళ్యాణదుర్గంలో విద్యార్థి జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. మడకశిరలో జేఏసీ ఆధ్వర్యంలో చెవిలో పూలు పెట్టుకుని ర్యాలీ చేశారు. తేరువీధి, గాంధీబజార్‌కు చెందిన ప్రజలు ర్యాలీ చేశారు. అమరాపురంలో రోడ్డుపై వంటా-వార్పు చేపట్టారు. పుట్టపర్తిలో జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఓడీచెరువులో సమైక్యవాదులు ప్రదర్శన నిర్వహించారు. పెనుకొండలో రవాణాశాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాలీ నిర్వహించి..రాస్తారోకో చేశారు. గోరంట్లలో వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ముగ్గుల పోటీలు నిర్వహించారు. రొద్దం, పరిగిలో ట్రాన్స్‌కో జేఏసీ నాయకులు ర్యాలీ చేశారు. ఉపాధ్యాయుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సోమందేపల్లెలో ఉపాధ్యాయుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ నాయకులు ద్విచక్ర వాహనలతో ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో మహిళా టీచర్లు పూర్ణకుంభం చేతపట్టుకుని ర్యాలీ చేశారు. ఆర్టీసీ కండక్టర్ నాగరాజు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సమైక్యవాదులు రాయదుర్గంలో బంద్ చేశారు. చిరు వ్యాపారులు రిలే దీక్షలు చేపట్టారు. శింగనమలలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కల్లూరులో రోడ్లపైనే వరినాట్లు వేసి నిరసన తెలిపారు. బుక్కరాయసముద్రంలో జేఏసీ నాయకులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. నార్పలలో బెస్త సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. పుట్లూరులో సమైక్యవాదులు ర్యాలీ చేశారు. తాడిపత్రిలో జేఏసీ ఆధ్వర్యంలో పోలీసు స్టేషన్ వద్ద రిలేదీక్షలు చేపట్టగా.. మునిసిపల్ ఉద్యోగులు మునిసిపల్ కార్యాలయం ఎదుట రిలేదీక్షలు చేపట్టారు. యాడికిలో హమాలీలు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. పెద్దవడుగూరులో సమైక్యవాదుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఉరవకొండలో వీఆర్ఓలు రిలేదీక్షలు చేపట్టారు. బెళుగుప్పలో జేఏసీ నాయకులు ప్రదర్శన నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సమైక్యాంధ్ర గొప్పతనాన్ని చాటిచెప్పారు. -
నిరసన హోరు
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సింహపురివాసులు చేపట్టిన ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోంది. గత 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 15వ రోజైన బుధవారం సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగింది. నెల్లూరు నగరంలో రెండోరోజూ బంద్ జరిగింది. అధిక వాణిజ్య సముదాయాలను వ్యాపారులు మూసివేశారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ ఉద్యోగులు బంద్ పాటించడంతో ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయాయి. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉద్యోగులు వంటావార్పు నిర్వహించి అక్కడే భోజనాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. రెవెన్యూ, ఎన్జీఓ అసోసియేషన్లు కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు కొనసాగించాయి. నగరంలోని వేదాయపాళెంలో వైఎస్సార్సీపీ రూరల్ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష ప్రారంభమైంది. ఈ దీక్షను ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీలు ఏకమై ఉద్యమాన్ని ఉధృతం చేసి విభజనను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో సైతం సమైక్య ఆందోళనలు మిన్నంటాయి. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు కొనసాగాయి. అన్ని పార్టీల నేతలు ఆందోళనల్లో పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టిన గణాంకశాఖ ఉద్యోగులకు కాంగ్రెస్ నేత ఆనం జయకుమార్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఆనం సోదరులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి పదవి కోసం ఆనం రామనారాయణరెడ్డి సమైక్యాంధ్ర పోరుకు దూరంగా ఉన్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్రం అధికార కమిటీనీ వేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర డిమాండ్ చేశాడు. వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పీఎస్ఆర్ బస్టాండు వద్ద ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. వీఎస్‌యూ అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో మోటారు సైకిల్ ర్యాలీ, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్జీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్జీఓ హోమ్ నుంచి అయ్యప్ప గుడి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులతో విధులు బహిష్కరింప చేశారు. సమైక్యాధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. నగరంలోని నర్తకి సెంటర్లో చిరంజీవి యువత ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. విద్యుత్ ఉద్యోగులు కూడా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వాణిజ్య ఉద్యోగులు కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను బుధవారం పొదలకూరు, డేగపూడి గ్రామాల్లో సమైక్యవాదులు ఘెరావ్ చేశారు. తెలంగాణ విభజనకు వైఎస్సారే కారణమని ఎమ్మెల్యే చేసిన ఆరోపణపై సమైక్య వాదులు మండిపడ్డారు. వైఎస్సార్ విగ్రహం ఎదుట కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మనుబోలులో జర్నలిస్టులు ప్రదర్శన జరిపారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వెంకటాచలం మండలంలోని బురాన్‌పూర్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి నిరసన తెలిపారు. ఉదయగిరి మండలంలోని వెంగళరావునగర్, దుత్తలూరు మండలం సోమలరేగడలో విద్యార్థులు, యువకులు, గ్రామస్తులు వంటావార్పు నిర్వహించి సోనియా, కేసీఆర్ బొమ్మలను దహనం చేశారు. వింజమూరులో విద్యార్థి జేఏసీ నేతలు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరాయి. కొండాపురం మండలం సాయిపేటలో గ్రామస్తులు చిరంజీవి బొమ్మను దహనం చేశారు. కొమ్మిపాళెంలో పదేళ్లలోపు చిన్నారులు కేసీఆర్, సోనియా బొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బాలచెన్నయ్య ఆధ్వర్యంలో తిక్కవరంలో బుధవారం సమైక్యాంధ్రకు మద్దతుగా రాస్తారోకో నిర్వహించి కే సీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గూడూరు ఎమ్మెల్యే దుర్గాప్రసాద్‌రావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వరగలి క్రాస్‌రోడ్డు వద్ద రాస్తారోకో చేపట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కోటలో వైఎస్సార్సీపీ నాయకులు బంద్ పాటించారు. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు దబ్బల రాజారెడ్డి, కిలివేటి సంజీవయ్య సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ జేఏసీ వారు విధులను బహిష్కరించి ఒక్క బస్సు కూడా తిరగకుండా చేశా రు. ఆటో డ్రైవర్లు ఆటోలతో ర్యాలీ నిర్వహించి, కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దొరవారిసత్రంలో జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కోవూరులోని ఎన్జీఓ హోంలో పంచాయతీ పాలకవర్గం రిలే దీక్షలు నిర్వహించారు. కావలిలో ఆర్టీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు ర్యాలీ చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట రెవెన్యూ సర్వీస్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోసం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్, రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఉద్యోగులు విధులను బహిష్కరించారు. వీఎస్‌యూ పరిధిలోని కావలి పీజీ సెంటర్ విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మను పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వరకు ఊరేగించారు. ఆత్మకూరు మండలం నెల్లూరుపాళెం సెంటర్లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో యువకులు క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. నెల్లూరుపాళెం సెంటర్లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ట్రైనీ ఎస్ఐ వెంకటేష్‌కు బూట్లు తుడిచి పండ్లు అందజేశారు. పట్టణంలోని మున్సిపల్ బస్టాండులో ప్రైవేటు కళాశాల యజమానులు, సిబ్బంది రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఆత్మకూరు మండలం కరటంపాడులో విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఆత్మకూరు మండలం నసీ నగరంలో యువకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ బస్టాండు నుంచి మున్సిపల్ బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు.