సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజన నిర్ణయంపై ‘అనంత’ అట్టుడుకుతోంది. నెల రోజులుగా ఉద్యమాగ్ని ప్రజ్వరిల్లుతోంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు రాస్తారోకోలు, ర్యాలీలతో హోరెత్తించారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో ముందుకుసాగారు. అనంతపురంలో పశు సంవర్ధకశాఖ ఉద్యోగులు కాగడాల ప్రదర్శన చేపట్టారు. ఏపీ ఎన్జీఓలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ర్యాలీలు నిర్వహించారు.
ముస్లిం యువకులు ఒంటెలు, గుర్రాలపై ర్యాలీ చేశారు. విద్యుత్ ఉద్యోగులు బైక్ ర్యాలీ చేపట్టగా.. చిన్నారులు తెలుగుతల్లి, జాతీయ నాయకుల వేషధారణలతో నగరంలో ర్యాలీ చేపట్టారు. జాక్టో, ఆర్ట్స్‌కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది, పంచాయతీరాజ్, నీటిపారుదల, రోడ్లుభవనాలు, బీసీ, ఎస్టీ, ఎస్సీ ప్రజాసంఘాలు, ఐకేపీ, వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, న్యాయవాదులు, కార్మికశాఖ, ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు చేపట్టిన రిలేదీక్షలకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గుర్నాథ్‌రెడ్డి, కాపురామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, ముఖ్యనేత ఎర్రిస్వామిరెడ్డి సంఘీభావం తెలిపారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలేదీక్ష చేపట్టిన రెవెన్యూ ఉద్యోగులకు జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం సంఘీభావం ప్రకటించింది. ఆయాశాఖలు చేపట్టిన రిలేదీక్షా శిబిరాల్లో ప్రైవేటు, ప్రభుత్వ విద్యార్థులు, కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎస్కేయూలో జేఏసీ నాయకులు చేపట్టిన రిలేదీక్షలు 31వ రోజుకు చేరుకున్నాయి. బోధనేతర ఉద్యోగులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నాయకులు రాస్తారోకో నిర్వహించి సోనియా, దిగ్విజయ్ సింగ్, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు.
నిరసనల హోరు
ధర్మవరంలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. తాడిమర్రి, బత్తలపల్లిలో సమైక్యవాదులు ర్యాలీలు చేపట్టారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ముదిగుబ్బలో ఉపాధ్యాయులు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ కులాల ఆధ్వర్యంలో సమైక్య నిరసనలు పెల్లుబికాయి.
గుంతకల్లులో జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. గుత్తి, పామిడిలో జేఏసీ, జాక్టో ఆధర్యంలో చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. హిందూపురంలో మాల కులస్తుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. సడ్లపల్లె మహిళలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో టీచర్లు, విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఏపీట్రాన్స్‌కో డివిజనల్ కార్యాలయానికి విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు తాళాలు వేసి నిరసన తెలిపారు. చిలమత్తూరులో వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర నిరసనలు మిన్నంటాయి. లేపాక్షిలో సమైక్యవాదులు పాండురంగ భజన చేశారు. కదిరిలో సమైక్యాంధ్రకు మద్దతుగా వికలాంగులు రిలేదీక్షలు చేపట్టారు. కళ్యాణదుర్గంలో విద్యార్థి జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. మడకశిరలో జేఏసీ ఆధ్వర్యంలో చెవిలో పూలు పెట్టుకుని ర్యాలీ చేశారు. తేరువీధి, గాంధీబజార్‌కు చెందిన ప్రజలు ర్యాలీ చేశారు.
అమరాపురంలో రోడ్డుపై వంటా-వార్పు చేపట్టారు. పుట్టపర్తిలో జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఓడీచెరువులో సమైక్యవాదులు ప్రదర్శన నిర్వహించారు. పెనుకొండలో రవాణాశాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాలీ నిర్వహించి..రాస్తారోకో చేశారు. గోరంట్లలో వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ముగ్గుల పోటీలు నిర్వహించారు.
రొద్దం, పరిగిలో ట్రాన్స్‌కో జేఏసీ నాయకులు ర్యాలీ చేశారు. ఉపాధ్యాయుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సోమందేపల్లెలో ఉపాధ్యాయుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ నాయకులు ద్విచక్ర వాహనలతో ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో మహిళా టీచర్లు పూర్ణకుంభం చేతపట్టుకుని ర్యాలీ చేశారు. ఆర్టీసీ కండక్టర్ నాగరాజు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సమైక్యవాదులు రాయదుర్గంలో బంద్ చేశారు. చిరు వ్యాపారులు రిలే దీక్షలు చేపట్టారు. శింగనమలలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కల్లూరులో రోడ్లపైనే వరినాట్లు వేసి నిరసన తెలిపారు.
బుక్కరాయసముద్రంలో జేఏసీ నాయకులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. నార్పలలో బెస్త సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. పుట్లూరులో సమైక్యవాదులు ర్యాలీ చేశారు. తాడిపత్రిలో జేఏసీ ఆధ్వర్యంలో పోలీసు స్టేషన్ వద్ద రిలేదీక్షలు చేపట్టగా.. మునిసిపల్ ఉద్యోగులు మునిసిపల్ కార్యాలయం ఎదుట రిలేదీక్షలు చేపట్టారు. యాడికిలో హమాలీలు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. పెద్దవడుగూరులో సమైక్యవాదుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఉరవకొండలో వీఆర్‌ఓలు రిలేదీక్షలు చేపట్టారు. బెళుగుప్పలో జేఏసీ నాయకులు ప్రదర్శన నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సమైక్యాంధ్ర గొప్పతనాన్ని చాటిచెప్పారు.
ఉద్యమాగ్ని
Published Sat, Aug 31 2013 5:55 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
Advertisement
Advertisement