వివక్షపై కన్నెర్ర | Discrimination in protest over the government in the district. | Sakshi
Sakshi News home page

వివక్షపై కన్నెర్ర

Published Sat, Sep 7 2013 5:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM

Discrimination in protest over the government in the district.

 తెలంగాణ విషయంలో ప్రభుత్వ వివక్షపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు నిర్వహిస్తున్న సభకు ప్రభుత్వం హడావుడిగా అనుమతి ఇచ్చి, టీజేఏసీ శాంతిర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. స్వయంగా ముఖ్యమంత్రే వెనుక ఉండి ఏపీఎన్జీవోల సభ నడిపిస్తున్నారని ఆరోపిస్తూ సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. సర్కారు తీరుపై తెలంగాణవాదులు వివిధ రూపాల్లో విరుచుకుపడ్డారు. వచ్చిన తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
 
 సాక్షి, కరీంనగర్ : ఎల్కతుర్తిలో విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇదే మండలంలోని తిమ్మాపూర్, శాంతినగర్‌లోని సీమాంధ్రులు శాంతి ర్యాలీ నిర్వహించారు. తామిక్కడే స్థిరపడ్డామని, ఇక్కడే ఉంటామని పేర్కొన్న సీమాంధ్రులు తెలంగాణను అడ్డుకోవద్దని ఆ ప్రాంత నేతలకు విజ్ఞప్తి చేశారు.
 
 ఏపీఎన్జీవోల సభను  వ్యతిరేకిస్తూ రామగుండంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంతోపాటు వివిధ పట్టణాల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు.
 
 రామగుండం లో 48 గంటల పాటు విధులకు హాజరు కాబోమని ప్రకటించారు. వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనం, ధర్నాలు నిర్వహించారు. పలు మండలాల్లో జేఏసీల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని కోరుతూ టీజీఏసీ ఆధ్వర్యంలో చందుర్తి నుంచి వేములవాడ వరకు శనివారం పాదయాత్ర చేయనున్నారు. సీఎం కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తూ తెలంగాణ ఆకాంక్షను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని జేఏసీ నేతలు ధ్వజమెత్తారు.
 
 
 టీజేఏసీ ఇచ్చిన 24 గంటల బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలపాలని భావిస్తున్నారు. సీఎం తీరుపై రగిలిపోతున్న అన్ని వర్గాలు బంద్‌కు మద్దతుగా నిలబడుతున్నాయి. జిల్లా అంతటా బంద్‌లో క్రియాశీలంగా పాలుపంచుకునేలా టీఆర్‌ఎస్ ఆ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసింది. విద్యార్థులు, న్యాయవాదులు, ప్రజాసంఘాలు, విద్యాసంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు, వ్యాపార వాణిజ్యవర్గాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీలోని ప్రధాన కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొనాలని నిర్ణయించడంతో బస్సులు డిపోలు దాటి బయటకు వచ్చే పరిస్థితి లేదు. బంద్‌కు రామగుండంలో అన్ని కార్మిక సంఘాలతో కూడిన అఖిలపక్షం మద్దతిస్తోంది. కరీంనగర్ జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిట్టుమల్ల శ్రీనివాస్, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఎక్సైజ్ శాఖ అసోసియేషన్ ఉద్యోగ సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement