సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సింహపురివాసులు చేపట్టిన ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోంది. గత 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 15వ రోజైన బుధవారం సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగింది. నెల్లూరు నగరంలో రెండోరోజూ బంద్ జరిగింది. అధిక వాణిజ్య సముదాయాలను వ్యాపారులు మూసివేశారు.
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ ఉద్యోగులు బంద్ పాటించడంతో ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయాయి. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉద్యోగులు వంటావార్పు నిర్వహించి అక్కడే భోజనాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. రెవెన్యూ, ఎన్‌జీఓ అసోసియేషన్లు కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు కొనసాగించాయి. నగరంలోని వేదాయపాళెంలో వైఎస్సార్‌సీపీ రూరల్ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష ప్రారంభమైంది. ఈ దీక్షను ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీలు ఏకమై ఉద్యమాన్ని ఉధృతం చేసి విభజనను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో సైతం సమైక్య ఆందోళనలు మిన్నంటాయి. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు కొనసాగాయి. అన్ని పార్టీల నేతలు ఆందోళనల్లో పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టిన గణాంకశాఖ ఉద్యోగులకు కాంగ్రెస్ నేత ఆనం జయకుమార్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఆనం సోదరులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి పదవి కోసం ఆనం రామనారాయణరెడ్డి సమైక్యాంధ్ర పోరుకు దూరంగా ఉన్నాడని మండిపడ్డారు.
రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్రం అధికార కమిటీనీ వేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర డిమాండ్ చేశాడు. వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పీఎస్‌ఆర్ బస్టాండు వద్ద ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. వీఎస్‌యూ అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో మోటారు సైకిల్ ర్యాలీ, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్‌జీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్‌జీఓ హోమ్ నుంచి అయ్యప్ప గుడి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులతో విధులు బహిష్కరింప చేశారు. సమైక్యాధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. నగరంలోని నర్తకి సెంటర్‌లో చిరంజీవి యువత ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. విద్యుత్ ఉద్యోగులు కూడా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వాణిజ్య ఉద్యోగులు కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను బుధవారం పొదలకూరు, డేగపూడి గ్రామాల్లో సమైక్యవాదులు ఘెరావ్ చేశారు. తెలంగాణ విభజనకు వైఎస్సారే కారణమని ఎమ్మెల్యే చేసిన ఆరోపణపై సమైక్య వాదులు మండిపడ్డారు. వైఎస్సార్ విగ్రహం ఎదుట కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మనుబోలులో జర్నలిస్టులు ప్రదర్శన జరిపారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వెంకటాచలం మండలంలోని బురాన్‌పూర్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి నిరసన తెలిపారు.
ఉదయగిరి మండలంలోని వెంగళరావునగర్, దుత్తలూరు మండలం సోమలరేగడలో విద్యార్థులు, యువకులు, గ్రామస్తులు వంటావార్పు నిర్వహించి సోనియా, కేసీఆర్ బొమ్మలను దహనం చేశారు. వింజమూరులో విద్యార్థి జేఏసీ నేతలు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరాయి. కొండాపురం మండలం సాయిపేటలో గ్రామస్తులు చిరంజీవి బొమ్మను దహనం చేశారు. కొమ్మిపాళెంలో పదేళ్లలోపు చిన్నారులు కేసీఆర్, సోనియా బొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు.
గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బాలచెన్నయ్య ఆధ్వర్యంలో తిక్కవరంలో బుధవారం సమైక్యాంధ్రకు మద్దతుగా రాస్తారోకో నిర్వహించి కే సీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గూడూరు ఎమ్మెల్యే దుర్గాప్రసాద్‌రావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వరగలి క్రాస్‌రోడ్డు వద్ద రాస్తారోకో చేపట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కోటలో వైఎస్సార్‌సీపీ నాయకులు బంద్ పాటించారు.
సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షకు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు దబ్బల రాజారెడ్డి, కిలివేటి సంజీవయ్య సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ జేఏసీ వారు విధులను బహిష్కరించి ఒక్క బస్సు కూడా తిరగకుండా చేశా రు. ఆటో డ్రైవర్లు ఆటోలతో ర్యాలీ నిర్వహించి, కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దొరవారిసత్రంలో జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కోవూరులోని ఎన్జీఓ హోంలో పంచాయతీ పాలకవర్గం రిలే దీక్షలు నిర్వహించారు.
కావలిలో ఆర్టీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు ర్యాలీ చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట రెవెన్యూ సర్వీస్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోసం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్, రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఉద్యోగులు విధులను బహిష్కరించారు. వీఎస్‌యూ పరిధిలోని కావలి పీజీ సెంటర్ విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మను పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వరకు ఊరేగించారు.
ఆత్మకూరు మండలం నెల్లూరుపాళెం సెంటర్‌లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో యువకులు క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. నెల్లూరుపాళెం సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ట్రైనీ ఎస్‌ఐ వెంకటేష్‌కు బూట్లు తుడిచి పండ్లు అందజేశారు. పట్టణంలోని మున్సిపల్ బస్టాండులో ప్రైవేటు కళాశాల యజమానులు, సిబ్బంది రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఆత్మకూరు మండలం కరటంపాడులో విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఆత్మకూరు మండలం నసీ నగరంలో యువకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ బస్టాండు నుంచి మున్సిపల్ బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు.