Krishna District: సెల్ఫోన్ వివాదం.. నవ వధువు ఆత్మహత్య
తోట్లవల్లూరు (కృష్ణా): పెళ్లయిన నాలుగు నెలలకే ఆమెకు నూరేళ్లు నిండాయి. సెల్ఫోన్ కారణంగా జరిగిన గొడవ నవ వధువు ప్రాణాలు బలితీసుకుంది. కలుపు మందు తాగి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాలెంలో జరిగిన ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రిరాజుపాలెం గ్రామానికి చెందిన వల్లూరు యోహాను, మరియమ్మ దంపతుల చిన్న కుమార్తె రత్నకుమారి(19)ను ఉంగుటూరు మండలం నందమూరు గ్రామానికి చెందిన పేటేటి సన్నీకి ఇచ్చి ఈ ఏడాది ఫిబ్రవరి 18న వివాహం చేశారు. సన్నీ వ్యవసాయ పనుల రీత్యా భద్రిరాజుపాలెంలోని అత్తగారి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ నెల 13న సెల్ఫోన్ కారణంగా రత్నకుమారితో చిన్నగొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన రత్నకుమారి ఇంటి ఆవరణలో ఉన్న కలుపు మందు తాగి అపస్మారక స్ధితిలోకి వెళ్లింది.
చదవండి: (కంతేరు ఘటనలో సునీత ఆత్మహత్యాయత్నం)
కుటుంబసభ్యులు వెంటనే ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. రత్నకుమారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పెళ్లయి నాలుగు నెలలు కూడా నిండక ముందే మృతి చెందడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రత్నకుమారి ఇటీవల ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు కూడా రాసినట్లుగా తెలిసింది. మృతురాలి తండ్రి యోహాను ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అర్జున్ తెలియజేశారు.
►ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com