అక్రమాలపై ఉక్కుపాదం!
* ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రక్షాళనకు సర్కారు కసరత్తు
* ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా చర్యలకు ఉపక్రమణ
*బోగస్ డీలర్లపై కేసులు, రేషన్ అక్రమార్కులపై పీడీ యాక్ట్
* అక్రమాల నిరోధానికి అక్టోబర్ నుంచి ఈపాస్‌ను ప్రవేశపెట్టే యోచన
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. డూప్లికేట్ కార్డుల తొలగింపు ప్రక్రియను ఇప్పటికే దిగ్విజయంగా పూర్తి చేసిన ప్రభుత్వం..
ప్రస్తుతం బోగస్ డీలర్లు, రీసైక్లింగ్‌కు పాల్పడుతున్న మిల్లర్లు, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. పౌర సరఫరాల శాఖలో పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ ఈ-పాస్(ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలను, సరుకులు సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసేలా కసరత్తు ఆరంభించింది.
అక్రమాల్లో అందరూ పాత్రధారులే..!
రేషన్ దుకాణాల నిర్వహణ పూర్తిగా బోగస్ డీలర్ల చేతిలోకి వెళ్లిందని, దీనివల్లే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న సరుకులు పక్కదారి పడుతున్నాయని పౌర సరఫరాల శాఖ అంతర్గతంగా ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక సమర్పించింది. జంట నగరాల్లోనే సుమారు 270 మంది బోగస్ డీలర్లు ఉన్నారని, డూప్లికేట్ రేషన్ కార్డుల ద్వారా అక్రమంగా బియ్యాన్ని కర్ణాటక, మహారాష్ట్రకు తరలిస్తున్నారని గుర్తించింది.
మొత్తంగా రాష్ట్రంలో 15 నుంచి 20 శాతం సరుకులు పక్కదారి పడుతున్నాయని, ఇందులో అధికారులు సహా, మిల్లర్లు, స్టేజ్-1 కాంట్రాక్టర్లు పాత్రధారులని తేల్చింది. ఎంఎల్ఎస్ పాయింట్‌కు సైతం రాకుండానే 40 శాతం బియ్యం పక్కదారి పడుతోందని నివేదికలో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం అక్రమాల కట్టడికి చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఇటీవల అధికారులు రేషన్ దుకాణాల్లో తనిఖీలు ఆరంభించారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 200 దుకాణాలను తనిఖీ చేయగా 50 మందిని బోగస్‌గా తేల్చి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న మిల్లులపైనా దాడులు కొనసాగుతున్నాయి. అక్రమాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు.