వినియోగదారుల ఖాతాలకు నేరుగా కిరోసిన్ సబ్సిడీ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇకమీదట కిరోసిన్ సబ్సిడీని రేషన్ కార్డుదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయనున్నట్లు ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కిరోసిన్ పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని వెల్లడి కావడంతో సబ్సిడీ మొత్తాన్ని అర్హుల ఖాతా ల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు.
ఇందులో భాగంగా మైసూరు, తుమకూరు, ధార్వాడ జిల్లాల్లో సబ్సిడీ బదిలీని ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు చెప్పారు. తద్వారా అక్రమాలకు అడ్డు కట్ట పడిందని తెలిపారు. మిగిలిన జిల్లాలకు కూడా పథకాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించారు.