బీజేపీ నేత హత్య కేసులో నలుగురి అరెస్టు
గ్రేటర్ నోయిడా: బీజేపీ స్థానిక నాయకుడు విజయ్ పండిట్ హత్య కేసులో నలుగురిని అరెస్టు చేశామని పోలీసులు బుధవారం చెప్పారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందని, ఈ కేసులో జీతూ, సన్నీ, మరో ఇద్దరు షార్ప్‌షూటర్లు అంకిత్ గుజ్జర్, అన్నీలను అరెస్టు చేశామని డీఐజీ కే సత్యనారాయణ చెప్పారు. జీతూ, సన్నీ, అశోక్, గగన్, భోలూ ఈ హత్యకు పథకం వేశారని అన్నారు. తమ పథకం అమలుకు వీరు సుందర్ భాటీ, అనిల్ దుజన గ్యాంగ్‌లను సంప్రదించారని చెప్పారు. విజయ్ పండిట్‌కు నిందితులకు మధ్య గత రెండేళ్లుగా కక్షలు రగులుకొంటున్నాయని అన్నారు.
రెండేళ్ల క్రితం పండిట్ సహచరుడు రవీందర్ శర్మ హత్యకు గురయ్యాడని, ఆ కేసులో కూడా ఈ అయిదుగురు నిందితులని వివరించారు. ఈ హత్యనంతరం స్థానికంగా పలు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయని, పలువురి ఇండ్లు దగ్ధమయ్యాయని చెప్పారు. ఇళ్ల దహనం కేసులో విజయ్ పండిట్ నిందితుడని అన్నారు. ఈ కేసులో విషయంలో రవీందర్ శర్మ కుటుంబం రాజీకి వచ్చినప్పటికీ పండిట్ అడ్డుకున్నాడని దీంతో నిందితులు బీజేపీ నాయకునిపై కక్ష పెంచుకున్నారని డీఐజీ చెప్పారు. ఈ నెల 7న దాద్రీలోని ఒక స్కూలు వద్దకు నిందితులు చేరుకున్నారని, అటువైపుగా వస్తున్న పండిట్‌పై ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించారని చెప్పారు. ఈ కేసుపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని పండిట్ సతీమణి, దాద్రీనగర్ పంచాయత్ చైర్పర్సన్ గీత డిమాండ్ చేస్తున్నారు.