సవాల్‌కు కట్టుబడి ఉన్నా: జూపల్లి
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నాటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిధులు వెచ్చించినట్లు చెప్పుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్న ప్రకటనలను ఎండగట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన ఆదివారం వారికి ఒక బహిరంగ లేఖ రాశారు.
'మీ అధినేత చంద్రబాబు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నానని చెబుతూనే, జిల్లా, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అనుసరించిన వైఖరిని, మోసపూరిత లేఖలతో కేంద్ర ప్రభుత్వాన్ని, సంస్థలనీ తప్పుదోవ పట్టిస్తూ, పాలమూరు- ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్న తీరును, ఆయన హయాంలో ప్రాజెక్టుల వ్యయంలో ఒక శాతం కంటే తక్కువ స్థాయిలో ఖర్చు చేసినా, జిల్లాను ఉద్దరించామని చెబుతున్న టీడీపీ నేతల ప్రకటనల్లోని డొల్లతనాన్ని ప్రజల ముందు ఆధారాలతో సహా బట్టబయలు చేయడానికి నాతో పాటు, నా సహచర ఎమ్మెల్యేలు, ఎంపీలు, సిద్ధంగా ఉన్నాం..' అని మంత్రి ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ చర్చ పాత్రికేయ సంఘాల ప్రతినిధుల సమన్వయంతో, పాత్రికేయులే న్యాయ నిర్ణేతలుగా ఉంటూ, టీవీ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం జరిగేలా ఏర్పాటు చేయాలని, ఇందుకోసం వారిని తాను ప్రత్యేకంగా అభ్యర్ధిస్తున్నానన్నారు. అసెంబ్లీ కమిటీ హాలులోఈనెల 13, 15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సిద్ధంగా ఉంటానని, ఈ తేదీలు, సమయం అసౌకర్యంగా ఉంటే మీరు నిర్ణయించే సమయానికి సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టుల విషయంలో మంత్రి జూపల్లి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డిల మధ్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే.