మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
తాగునీటి సమస్యపై నిలదీయడంతో మనస్తాపం
మర్పల్లి : గ్రామ పంచాయతీలకు నిధుల లేమి కారణంగా ఏ పని చేపట్టలేకపోయాననే మనోవేదనతో ఓ మహిళా సర్పంచ్ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలం రావులపల్లిలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గత ఎన్నికల్లో నాదిరిగ కములమ్మ(45) కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్‌గా గెలుపొందారు. సర్పంచ్‌గా ఎన్నిక కాగానే సొంత ఖర్చుతో గ్రామంలో మురుగునీటి కాలువలను శుభ్రం చేయడంతోపాటు, వీధి దీపాలు, పైప్‌లైన్ పనులు చేయించారు. అయితే ఇటీవల లోఓల్టేజి కారణంగా తరుచూ తాగునీటి కోసం ఏర్పాటు చేసిన మోటార్లు కాలిపోవడంతో గ్రామంలోని ఐదోవార్డులో తాగు నీటి సమస్య తలెత్తింది.
దీంతో ఆ వార్డుకు చెందిన పలువురు సోమవారం ఉదయం సర్పంచ్ ఇంటికెళ్లి తాగునీటి సమస్యపై నిలదీశారు. నిధులు రావడం లేదని కములమ్మ చెబుతున్నా వినకుండా వాగ్వాదానికి దిగి దుర్భాషలాడారు. దీంతో మనస్తాపం చెందిన కములమ్మ ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగి కాలనీవాసుల ముందే పడిపోయింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.