rayadurgam assembly constituency
-
కాల్వకు 'జేసీబీ'తో బ్రేక్.. ఈసారి టికెట్ ఆయనకేనా?
ఓడలు బళ్ళు.. బళ్ళు ఓడలు కావడం కామనే. తెలుగుదేశంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నాయకుడికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదనే ప్రచారం సాగుతోంది. గత ప్రభుత్వంలో మంత్రిగా, అంతకుముందు ఎంపీగా పనిచేసిన ఆ నేతపై పచ్చ పార్టీ అధినేత గుర్రుగా ఉన్నారట. అందుకే ఈసారి టిక్కెట్ రాదంటూ ప్రచారం ఊపందుకుంది. ఇంతకీ ఆ నేత ఎవరు? కాల్వ కేరాఫ్ రామోజీ క్యాంపస్ కాలువ శ్రీనివాస్. గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయన తరచుగా మీడియాలో కనిపించేవారు. ఈనాడు జర్నలిస్ట్‌గా ఉంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కాలువ తొలిసారి అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 నుంచి 2019 దాకా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం అదే నియోజకవర్గానికి టీడీపీ ఇంఛార్జిగా పనిచేస్తున్నారు. టీడీపీ అనంతపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా.. పొలిట్ బ్యూరో సభ్యుడుగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాల్వకు జేసీబీతో బ్రేక్ చంద్రబాబు కావాలని రాజకీయాల్లోకి తీసుకువచ్చిన కాలువ శ్రీనివాస్‌కు గతంలో మంచి ప్రాధాన్యతే దక్కింది. అయితే ప్రస్తుతం ఆయనకు జేసీబీ (జేసీ బ్రదర్స్) రూపంలో కష్టాలు ఎదురవుతున్నాయి. రాజకీయ సమీకరణాల్లో భాగంగా వచ్చే ఎన్నికల్లో కాలువ శ్రీనివాస్‌కు రాయదుర్గం టిక్కెట్ దక్కదని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో కాలువ శ్రీనివాస్ కోసం రాయదుర్గం టిక్కెట్ త్యాగం చేసిన దీపక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు, లోకేష్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. జేసీ బ్రదర్స్‌లో ఒకరైన జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడే దీపక్ రెడ్డి. 2012 రాయదుర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దీపక్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ రాయదుర్గం నియోజకవర్గంపై కన్నేసిన దీపక్ రెడ్డి.. చంద్రబాబు, నారాలోకేష్ లతో మంచి సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారు. కార్యకర్తల విరాళాలు కాల్వ పాలు.! కాలువ శ్రీనివాస్ వైఖరిపై గత కొంత కాలంగా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. పార్టీ పదవులు ఇప్పిస్తానని పలువురు నేతల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు కాలువ శ్రీనివాస్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలు జరిగినప్పుడు పార్టీ ఫండ్ అభ్యర్థులకు ఇవ్వకుండా తన జేబులో వేసుకున్నారని కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వీటిపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాయదుర్గంలో కాలువ శ్రీనివాస్‌ను పక్కన పెట్టి.. దీపక్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని నారా లోకేష్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో తన రాజకీయ భవిష్యత్తుపై మాజీ మంత్రి బెంగ పెట్టుకున్నట్లు సమాచారం. కిం కర్తవ్యం.? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాకపోతే ఏం చేయాలన్న దానిపై కాలువ శ్రీనివాస్ తర్జన భర్జనలు పడుతున్నట్లు టాక్. పరిస్థితి నుంచి ఎలా బయటపడాలన్న దానిపై సన్నిహితులతో చర్చిస్తున్నారు. తనకు అనుకూలంగా ఉండే పార్టీ సీనియర్ నేతల ద్వారా కాలువ శ్రీనివాస్ లాబీయింగ్ ప్రారంభించినట్లు అనంతపురం తెలుగుదేశం పార్టీలో ప్రచారం సాగుతోంది. -
సీఎం రమేష్.. ఓ బ్రోకర్
* రాయదుర్గం టీడీపీ ఇన్చార్జ్ దీపక్‌రెడ్డి విమర్శ రాయదుర్గం, న్యూస్‌లైన్ : ‘తెలుగుదేశం పార్టీలో రాయలసీమ ఇన్చార్జ్గా ఉన్న సీఎం రమేష్ ఓ చీడ పురుగు.. పార్టీలో బ్రోకర్ పాత్ర పోషిస్తున్నాడ’ని టీడీపీ రాయదుర్గం నియోజకవర్గ ఇన్చార్జ్ దీపక్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నువ్వు వచ్చి పార్టీ అధినేతను కలువు అని సీఎం రమేష్ నాకు ఫోన్ చేశాడు. నేను హైదరాబాద్ వెళితే ఆ సమయంలో కాలవ శ్రీనివాసులు, మెట్టు గోవిందరెడ్డితో చంద్రబాబు చర్చిస్తున్నారు. నేనెళ్లగానే అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నా. పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పారు. ఆ సమయంలో సీఎం రమేష్ ఫోటో తీయించి అందరూ కలిసి పార్టీ విజయానికి కృషి చేస్తున్నామని పత్రికల్లో స్టేట్మెంట్లు ఇప్పించాడు. ఇది పొలిటికల్ గేం’ అని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితిలో నేను ఎలా కొనసాగాలో శనివారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. బీసీ మహిళ కేవీ ఉష నుంచి కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుని ఆమెను మోసగించినట్టు సమాచారం ఉందన్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి మల్లారెడ్డి నుంచి కూడా రూ. 20 కోట్ల నుంచి 60 కోట్ల వరకు సీఎం రమేష్ వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్తో పొత్తుకు ఆయనే కారణమని, ఈ ఎన్నికల్లో కూడా డ్రామాలు ఆడి పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. -
టీడీపీ టికెట్ నాకే వస్తుంది
బొమ్మనహాళ్, న్యూస్‌లైన్ : ‘నేను రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను.. టీడీపీ టికెట్టు నాకే వస్తుంది.. మీరంతా సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి’ అని కురుబ సంఘం నాయకురాలు కేవీ ఉష పేర్కొన్నారు. సోమవారం ఆమె బొమ్మనహాళ్ మండలంలోని ఉద్దేహాళ్‌లో ఇంటింటికి తిరిగి మహిళలకు పసుపు, కుంకుమ, చీరలను పంపిణీ చేశారు. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు.. ఓటు వేయడానికి ఇప్పుడేమీ ఎన్నికలు లేవు కదా అని ఆమెను ప్రశ్నించగా.. ఆమె నవ్వుకుంటూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో ఉష భర్త చరణ్‌కుమార్‌రెడ్డి, కురుబ సంఘం నాయకులు హనుమంతు, యోగానంద, హనుమంతు, క్రిష్ణ మీనా పాల్గొన్నారు. అడ్డుకున్నా ఆగని చీరల పంపిణీ.. పది రోజుల క్రితం నేమకల్లు, హరేసముద్రం, ఉంతకల్లు, కురువళ్లి, చంద్రగిరి, సిద్దరాంపురంలో ఉష చీరలు పంపిణీ చేస్తుండగా, టీడీపీకి చెందిన దీపక్‌రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అయితే సోమవారం నుంచి ఆమె తిరిగి చీరల పంపిణీని ప్రారంభించారు. కాగా.. నియోజకవర్గ ఇన్చార్జి అయిన తనతో సంప్రదించకుండా, పార్టీలో సభ్యత్వం తీసుకోకుండా చీరలను పంపిణీ చే స్తూ.. టీడీపీకి ప్రచారం చేస్తున్న ఆమె వెనుక కొంత మంది తమ పార్టీ పెద్దలు ఉన్నారని దీపక్ రెడ్డి రగిలిపోతున్నారు.