అతి భారీ వర్షాలు - స్తంభించిన జనజీవనం
చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తుపాన్ ప్రభావం
కావలి వద్ద 20 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం
ఉప్పొంగుతున్న స్వర్ణముఖీ నది
పలు చెరువులకు గండ్లు,
తమిళనాడుకు వస్తున్న పలు రైళ్లు ఆలస్యం
చిత్తూరు : వాయుగుండం ప్రభావంతో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాల్లోని చెరువులు గండ్లు పడ్డాయి. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాల ధాటికి రహదార్లు కొట్టుకుపోవడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. అలాగే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సముద్రం ముందుకు దూసుకువచ్చింది.
కడప జిల్లా రైల్వే కోడూరులో 22.4 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. పలు చెరువులకు గండ్లు పడ్డాయి. రాజంపేటలోని చక్రాలమడుగుకు గండిపడటంతో జాతీయ రహదారిపైకి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. వరద నీటిలో నలుగురు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. అలాగే రెండు జేసీబీలు, మూడు ట్రాక్టర్లు ప్రవాహా ఉధృతికి కొట్టుకుపోయాయి. భారీ వరద నీరు రావడంతో తుండుపల్లిలో ఆదినారాయణరెడ్డి కుంచా ప్రాజెక్టుకు చెందిన రెండు గేట్లు తెరిచారు.
చిత్తూరు జిల్లాలో సోమలలో పలు చెరువులకు గండిపడ్డాయి. కొండచరియలు విరిగిపడి తిరుమల రెండో ఘాట్ రోడ్డుపై రాకపోకలు స్థంభించాయి. స్వర్ణముఖి నది ఉధృత ప్రవాహానికి ఓ కారు కొట్టుకుపోయింది. భారీ వర్షాలకు ఆకాశగంగ నిండింది. మరో నాలుగు మీటర్లు వరద పెరిగితే గోగర్భం జలాశయం గేట్లు ఎత్తివేయ్యాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
నెల్లూరు జిల్లా కావలిలో 20 మీటర్ల మీర సముద్రం ముందుకు వచ్చింది. ప్రకాశం జిల్లాలో చిన్నగంజాం పల్లెపాలెం వద్ద సముద్రం ఐదు మీటర్లు ముందుకు వచ్చింది. రానున్న 24గంటల్లో భారీ అతి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. తమిళనాడు నుంచి ఏపీకి వస్తున్న పలు రైళ్లు ఆలస్యంగా నడస్తున్నాయి.