రాజోలి రగడ
కర్నూలు(రూరల్)/ఎమ్మిగనూరు: రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) మరోసారి వివాదాస్పదమైంది. రాయలసీమ-తెలంగాణ ప్రాంతాల మధ్య తరచూ గొడవలకు కారణమవుతున్న ఈ ఆనకట్టు.. తాజాగా ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది. సీమ వైపు నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఆధునికీకరణ పేరిట ఏకంగా అర అడుగు ఎత్తు పెంచే ప్రయత్నాం చేయడం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు పూర్తిస్థాయిలో అమలు కాకమునుపే.. అందులోనూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపకాలు చేపట్టక ముందే కర్ణాటక ప్రభుత్వం ఎత్తు పెంపునకు శ్రీకారం చుట్టడం జల వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో తుంగభద్ర నదిపై అడ్డంగా నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్ట వివాదం ఆది నుంచి కొనసాగుతోంది. ఆర్డీఎస్ ఎడమ కెనాల్ ద్వారా కర్ణాటకలో 7500 ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాలకు.. కుడి కాలువ ద్వారా కర్నూలు, కడప జిల్లాల్లో లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందాల్సి ఉంది. అయితే కర్ణాటక కుటిల రాజకీయంతో ఆంధ్రాలో కుడికాలువ నిర్మాణానికి నోచుకోలేదు.
సుంకేసుల డ్యాం ద్వారా కేసీ కెనాల్‌కు అందుతున్న నీరే ఆర్డీఎస్ నీటి వాటాగా తెలంగాణవాదులు మెలికపెడుతూ వచ్చారు. 2003లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే ఆ పార్టీకి చెందిన కర్నూలు జిల్లా నేతల సహకారంతో ఆర్డీఎస్ ఆనకట్టకు కర్నూలు వైపు మూసి ఉన్న స్లూయిస్(వెంట్)లను రైతులు ధ్వంసం చేశారు. దీంతో మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల రైతులు.. ప్రజాప్రతినిధుల మధ్య జల వివాదం చెలరేగింది. రెండు ప్రాంతాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో అప్పట్లో పలువురికి గాయాలయ్యాయి. 2005లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మొత్తం 5 స్లూయిస్‌లో నాలుగింటిని మూయించారు.
అప్పటి నుండి ఈ వివాదం సద్దుమణిగింది. వైఎస్ మరణానంతరం ఆగస్టు 14, 2010న మరోసారి ఆర్డీఎస్ వివాదం చెలరేగినా అప్పటి మంత్రి శిల్పామోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, అబ్రహాం(అలంపూర్) చొరవతో ఇరుప్రాంత రైతులు శాంతించారు.
ఆనకట్ట ఎత్తు పెంపునకు కర్ణాటక కుట్ర
ఆధునికీకరణ పనుల పేరిట ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తును అర అడుగు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం పన్నిన కుటిల యత్నాన్ని కోసిగి మండలం రైతులు ఆదివారం అడ్డుకున్నారు. ఇప్పటికే కర్నూలు వైపున్న అన్ని స్లూయిస్‌లను మూయించి మా కడుపులు కొట్టడమే కాకుండా ఏకంగా ఆనకట్ట ఎత్తు పెంచి తాగునీరు కూడా రాకుండా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆర్డీఎస్ ఆనకట్ట వద్దకు చేరుకొని పనులను నిలుపుదల చేయించారు.
కర్నూలు రైతుకు కష్టకాలం: జిల్లా ప్రజల తాగు, సాగునీటి అవసరరాలకు ప్రధాన వనరు తుంగభద్ర నది. తీరం వెంబడి విస్తరించిన పశ్చిమ ప్రాంతంతో పాటు కేసీ కెనాల్ పరీహాహకమంతా ఈ నదితోనే పెనవేసుకుంది. ప్రభుత్వాల మధ్య సమన్వయం లేక, పాలకుల్లో చిత్తశుద్ధి కొరవడటంతో ఆది నుంచి జిల్లాకు అన్యాయం జరుగుతోంది. ఆర్డీఎస్కు దిగువనున్న మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాల రైతులు నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది.