R&B road
-
టీడీపీ నేత చిల్లకొట్టుడు
జిల్లాలో ప్రభుత్వ సంపదకు రక్షణ లేకుండాపోయింది. అధికార పార్టీ నేతలు సర్కార్ ఖజానాకు భారీగా చిల్లులు పెడుతున్నారు. అడిగేవారెవరన్న తలబిరుసుతో గ్రామాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించిన ఇతర పార్టీ నేతలపై దాడులకు సైతం తెగబడుతున్నారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు భద్రత కరువైంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పాత సామెతకు ఇప్పటి టీడీపీ నేతల తీరు అతికినట్లు సరిపోతోంది. కొండపి మండలంలోని పెట్లూరు కొండపనాయుడు చెరువు, ఊర చెరువుల్లో గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత దందా ప్రారంభించాడు. ప్రభుత్వ అనుమతి లేకుండా వాటిలో ఉన్న చెట్లు నరికించి సొమ్ము చేసుకుంటున్నాడని మాజీ సర్పంచ్‌తో పాటు పలువురు చెరువు ఆయుకట్టుదారులు, రైతులు ఆరోపిస్తున్నారు. పెట్లూరుకు పైఎత్తున కొండపనాయుడు చెరువు సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అందులో 50 ఎకరాల్లో చిల్లచెట్లు, నల్లతుమ్మ, తెల్లతుమ్మ చెట్లు ఉన్నాయి. ఇవి దాదాపు 700 టన్నులు ఉంటాయి. అంతేకాకుండా ఆర్అండ్బీ రోడ్డును ఆనుకుని గ్రామం పక్కనే ఉన్న ఊర చెరువులో సైతం 25 ఎకరాల్లో మరో 250 టన్నుల చిల్లచెట్లు, వేప, తుమ్మ చెట్లు ఉన్నాయి. వీటిపై కన్ను పడిన గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత.. ఎలాగైనా వాటిని సొమ్ము చేసుకోవాలని టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పావులు కదపడం ప్రారంభించాడు. చివరకు ఎటువంటి అనుమతి లేకుండా చెట్లు నరికించే ప్రయత్నానికి తెరలేపాడు. అందులో భాగంగా సంతనూతలపాడు ప్రాంతం నుంచి ఏకంగా 20 మంది కూలీలను తెప్పించి కొండపనాయుడు చెరువులో నాలుగు రోజుల క్రితం వారితో గుడిసెలు సైతం వేయించాడు. కూలీలు రెండు రోజులుగా కట్టెలు కొడుతున్నారు. ఇప్పటికే 20 టన్నుల వరకు విక్రయించినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వ సొమ్మును సొంత ఖాతాకు జమ చేసుకుంటున్నా పట్టించుకున్న అధికారులు లేరు. ఈ వ్యవహారంపై ఇప్పటికే చవటపాలెం, పెట్లూరు గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు టీడీపీ నేత అక్రమాన్ని సొంత పార్టీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. గ్రామానికి చెందిన ఆస్తిని ఒకే ఒకరు సొంతం చేసుకోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. విషయం తెలుసుకున్న సాక్షి విలేకరి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ డీఈ రమేష్ దృష్టికి తీసుకెళ్లారు. చెట్లు అమ్ముకునేలా పంచాయతీకి కోర్టు ఆర్డర్ ఉన్నట్లు సదరు నేత తనకు చెప్పారని డీఈ పేర్కొన్నారు. 2003లో చెరువుల్లోని చెట్లకు పంచాయతీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించగా అదే ఇరిగేషన్‌శాఖ అధికారులు పంచాయతీ వేలం పాట ఎలా నిర్వహిస్తుందని, ఆ హక్కు తమశాఖకే ఉందని చెప్పి వేలం పాట ఆపివేయించారు. అప్పటి అధికారులు పంచాయతీకి ఓ నివేదిక కూడా సమర్పించారు. అందులో భాగంగా ఆరేళ్ల క్రితం ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో అధికారులు రెండు చెరువులకు వేలం పాట నిర్వహించారు. పాట పాడుకున్న వారు ఆ నగదును ఇరిగేషన్శాఖకే చెల్లించారు. మరి అప్పుడు ఇరిగేషన్ శాఖ ద్వారా చెరువుల్లోని చెట్లకు వేలం నిర్వహించగా ఇప్పుడు పంచాయతీకి కోర్టు ఆర్డర్ ఉందని డీఈ చెప్పటం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల అడుగులకు అధికారులు మడుగులొత్తుతున్నారని చెప్పేందుకు ఈ చిన్న ఉదాహరణ చాలని పెట్లూరు వాసులు చెబుతున్నారు. కలెక్టర్ విజయకుమార్ తక్షణమే స్పందించి ఈ వ్యవహారంపై జోక్యం చేసుకుని ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని వారు కోరుతున్నారు. చెట్లు నరికి సొమ్ము చేసుకుంటున్న సదరు నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చే స్తున్నారు. -
ప్రజా సమస్యలను పరిష్కరించండి
ప్రజావాణిలో జేసీ జె.మురళి మచిలీపట్నం : ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ జె.మురళి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులంతా తప్పనిసరిగా ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని, అత్యవసర పనులు ఉన్నప్పుడు కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి పొందాలని చెప్పారు. తాను వినికిడి సమస్యతో బాధపడుతున్నానని, వినికిడి యంత్రాన్ని అందజేయాలని కోడూరుకు చెందిన నాగం లక్ష్మీనాంచారమ్మ జేసీకి వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన ఆయన వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులను పిలిపించి ఆమెకు వినికిడి యంత్రాన్ని అందజేశారు. డీఆర్వో ఎ.ప్రభావతి, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. డీఈవో డి.దేవానందరెడ్డి, డీఎస్వో సంధ్యారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు.. దోసపాడు ఆర్అండ్బీ రోడ్డు నుంచి ఎస్టీ కాలనీ మీదుగా సిమెంటు రోడ్డు వేయించాలని, ఆర్అండ్బీ రోడ్డు నుంచి బీసీ కాలనీ రైల్వే కట్ట వరకు బీటీ రోడ్డు నిర్మించాలని, ఆర్అండ్బీ రోడ్డు నుంచి బీసీ కాలనీ వరకు సిమెంటు రోడ్డు నిర్మించాలని కోరుతూ పెదపారుపూడి జెడ్పీటీసీ సభ్యురాలు మూల్పూరి హరీష వినతిపత్రం అందజేశారు. బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ కోడూరు రామకృష్ణారావు అనే వ్యక్తి అధికారులకు అర్జీ సమర్పించారు. జగ్గయ్యపేట మండలం ధర్మవరప్పాడు గ్రామంలో పేదల ఆక్రమణలో ఉన్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ దరావత్తు రవీంద్రనాయక్ వినతిపత్రం అందజేశారు. తన భూమిని కొందరు ఆక్రమించుకున్నారని, ఖాళీ చేయాలని కోరితే చంపుతామని బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన కుంభం వెంకటేశ్వరమ్మ విన్నవించారు. గుడ్లవల్లేరు మండలం విన్నకోట దళితవాడలో చెరువును అక్రమంగా లీజుకు తీసుకున్న సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామానికి చెందిన ఎం.వీరయ్య, మరికొందరు అర్జీ అందజేశారు. బందరు మండలం ఎస్ఎన్గొల్లపాలెంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని ఖాళీ చేయించి, పేదలకు నివేశనాస్థలాలుగా ఇవ్వాలని కోరుతూ చోరగుడి రంజిత్‌కుమార్ వినతిపత్రం అందజేశారు. బందరు మండలం పెదయాదర గ్రామంలోని శ్మశానవాటికను అభివృద్ధి చేసి చుట్టూ ప్రహరీ నిర్మించాలని, అక్కడ షెడ్డు నిర్మించాలని కోరుతూ కంచర్లపల్లి శివరామప్రసాద్ అనే వ్యక్తి వినతిపత్రం సమర్పించారు. తమకు వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని కోరుతూ గుడివాడకు చెందిన ఎం.సుశీల, బావదేవరపల్లికి చెందిన నలుకుర్తి మరియమ్మ, పెడన మండలం బల్లిపర్రు గ్రామానికి చెందిన కలిదిండి సత్యనారాయణ వినతిపత్రాలు అందజేశారు. పమిడిముక్కల మండలం గురజాడ గ్రామ పంచాయతీలో అవకతవకలకు పాల్పడిన కార్యదర్శి ఎన్.సాంబశివరావుపై తప్పుడు నివేదిక ఇచ్చిన గుడివాడ డీఎల్పీవో ఎం.వరప్రసాదరావుపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త శ్రీనివాసగౌడ్ వినతిపత్రం అందజేశారు. మచిలీపట్నం చేపల మార్కెట్ రైస్ బజారులో రోడ్డు ఆక్రమణలను తొలగించాలని కోరుతూ పలువురు వ్యాపారులు అర్జీ అందించారు. -
305 కిలోల గంజాయి పట్టివేత
జి.మాడుగుల : మైదాన ప్రాంతానికి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. జి.మాడుగుల ఎస్ఐ శేఖరం కథనం ప్రకారం జి.మాడుగుల-పాడేరు ఆర్అండ్బి రోడ్డులో సంతబయలు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. పెదబయలు మండలంలో మారుమూల గ్రామాల్లో 75 కిలోల గంజాయి కొనుగోలు చేసి ఆర్టీసీ బస్సులో మైదాన ప్రాంతాలకు తరలిస్తుండగా అందిన సమాచారంతో బస్సును సోదా చేశారు. ఇందులో తమిళనాడు నూరూర్ జిల్లా కరూర్‌కు చెందిన మురియప్పన్, థానే జిల్లా ఉటియాపాలేనికి చెందిన మోహన్ కరియప్ప, మణిగౌతమ్, ముకెన్కచ్చమ్మ, రాససరస్వతిలను అరెస్టు చేసినట్టు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 2 లక్షలుంటుందన్నారు. వారి నుంచి మూడు సెల్ ఫోన్లు, రూ.4700ల నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. డుంబ్రిగుడలో 20 కిలోలు డుంబ్రిగుడ : పాడేరు నుంచి అరకు వైపు ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 20 కిలోల గంజాయిని పర్యటక కేంద్రం చాపరాయి జలపాతం వద్ద బుధవారం పట్టుకున్నట్టు డుంబ్రిగుడ ఎస్ఐ రామకృష్ణ తెలిపా రు. బస్సులో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో చాపరాయిలో మాటువేసి నిందితులను అదుపులో తీసుకొన్నామన్నారు. పట్టుబడిన వారిలో హుకుంపేట మండలం ఒల్డాకి చెందిన ఈశ్వరావు, భానుప్రకాష్లున్నారని ఆయన చెప్పారు. వీరిని రిమాండ్‌కు తరలిస్తున్నట్టు తెలిపారు. నర్సీపట్నంలో... నర్సీపట్నం టౌన్ : ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న రూ.15 లక్షల విలువైన 210 కిలోల గంజాయిని, వాహనాన్ని ఎక్సైజ్ పోలీసులు బుధవారం స్వాధీనం చేస్తున్నారు. ముందుస్తు సమాచారంతో ఎక్సైజ్ సీఐ ఎం.జగన్మోహన్రావు తన సిబ్బందితో గురంధరపాలెం పనుకుల వద్ద మాటు వేశారు. తమను గమనించిన వాహనదారుడు వదిలి పారిపోయాడని, వాహన రికార్డుల ఆధారంగా యజమాని హైదరాబాద్, బాలనగర్‌కు చెందిన జి.నాగరాజుగా గుర్తించామని సీఐ చెప్పారు. వాహన యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు. పారిపోయిన వ్యక్తి కోసం గాలిస్తున్నామన్నారు. ఈ దాడుల్లో ఎస్సై ఫణింద్ర, సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. -
పనుల్లో దగా.. కాంట్రాక్టర్లు ధగధగ
నవాబుపేట: కోట్ల రూపాయల నిధులు రోడ్లపాలవుతున్నాయి. కొత్త రోడ్డు వేశారన్న ఆనందం పల్లెవాసులకు మున్నాళ్ల ముచ్చటగా మారింది. అధికారులు మామూళ్లకు తలొగ్గడంతో కాంట్రాక్టర్లు ఇష్టరాజ్యంగా పనులు చేసి నిధులు కాజేస్తున్నారు. ఏడాది గడిచేసరికి ఆ రోడ్లు అస్థిత్వాన్ని కూడా కోల్పోయి దశాబ్దాల క్రితం వేసిన రోడ్లలా మారుతున్నాయి. మండలంలో ఆర్అండ్బీ శాఖ పని తీరు అధ్వానంగా మారింది. రూ. 2.84 కోట్లతో నిర్మించిన రోడ్లు ఏడాది తిరగక ముందే శిథిలావస్థకు చేరాయి. వికారాబాద్ మండలం బంగారుమైసమ్మ ఆలయం నుంచి నవాబుపేట మండలం మైతాప్‌ఖాన్‌గూడ వరకు 12 కిలోమీటర్ల పొడవున్నా ఆర్అండ్బీ రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీంతో మరమ్మతులు, రిబీటీ కోసం ప్రభుత్వం ఏడాది కిందట రూ. 2 కోట్లు మంజూరు చేసింది. పనులను నగరానికి చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్లలో దక్కించుకున్నారు. వారు కమీషన్ తీసుకొని మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పజెప్పారు. రెండో కాంట్రాక్టర్ పనుల్లో నాణ్యత పాటించకుండా మరమ్మతు పనులు చేపట్టడంతో ఆరు మాసాల్లోనే రోడ్డు మళ్లీ గుంతలమయంగా మారింది. పనుల్లో నాణ్యత లేదంటూ అధికారులు బిల్లులు నిలిపివేశారు. దీంతో కాంట్రాక్టర్ మళ్లీ రోడ్డుపై మరో పూత పూసి బిల్లులు క్లియర్ చేయించుకున్నాడు. ప్రస్తుతం రోడ్డు పరిస్థితి మునుపటిలాగే తయారైంది. రూ. 50 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాలది అదే పరిస్థితి... గతేడాది క్రితం మండల పరిధిలోని పూలపల్లి, ఎల్లకొండ, ఎత్రాజ్పల్లి, మీనపల్లిలాన్, కడ్చర్ల గ్రామాల్లో రూ. 10 లక్షల చొప్పున ఖర్చు చేసి పంచాయతీ భవనాలు నిర్మించారు. పనులు నాసిరకంగా చేపట్టడంతో అప్పుడు ఈ భవనాలు వర్షానికి ఉరుస్తున్నాయి. వీటి పరిస్థితి చూసి సర్పంచులు ఈ భవనాల్లో కార్యకలాపాలు సాగించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి.