టీడీపీ నేత చిల్లకొట్టుడు | no saftey for public property | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత చిల్లకొట్టుడు

Published Fri, Jan 2 2015 2:19 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

టీడీపీ నేత చిల్లకొట్టుడు - Sakshi

టీడీపీ నేత చిల్లకొట్టుడు

జిల్లాలో ప్రభుత్వ సంపదకు రక్షణ లేకుండాపోయింది. అధికార పార్టీ నేతలు సర్కార్ ఖజానాకు భారీగా చిల్లులు పెడుతున్నారు. అడిగేవారెవరన్న తలబిరుసుతో గ్రామాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించిన ఇతర పార్టీ నేతలపై దాడులకు సైతం తెగబడుతున్నారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు భద్రత కరువైంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పాత సామెతకు ఇప్పటి టీడీపీ నేతల తీరు అతికినట్లు సరిపోతోంది.

 కొండపి మండలంలోని పెట్లూరు కొండపనాయుడు చెరువు, ఊర చెరువుల్లో గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత దందా ప్రారంభించాడు. ప్రభుత్వ అనుమతి లేకుండా వాటిలో ఉన్న చెట్లు నరికించి సొమ్ము చేసుకుంటున్నాడని మాజీ సర్పంచ్‌తో పాటు పలువురు చెరువు ఆయుకట్టుదారులు, రైతులు ఆరోపిస్తున్నారు. పెట్లూరుకు పైఎత్తున కొండపనాయుడు చెరువు సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అందులో 50 ఎకరాల్లో చిల్లచెట్లు, నల్లతుమ్మ, తెల్లతుమ్మ చెట్లు ఉన్నాయి. ఇవి దాదాపు 700 టన్నులు ఉంటాయి.

అంతేకాకుండా ఆర్‌అండ్‌బీ రోడ్డును ఆనుకుని గ్రామం పక్కనే ఉన్న ఊర చెరువులో సైతం 25 ఎకరాల్లో మరో 250 టన్నుల చిల్లచెట్లు, వేప, తుమ్మ చెట్లు ఉన్నాయి. వీటిపై కన్ను పడిన గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత.. ఎలాగైనా వాటిని సొమ్ము చేసుకోవాలని టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పావులు కదపడం ప్రారంభించాడు. చివరకు ఎటువంటి అనుమతి లేకుండా చెట్లు నరికించే ప్రయత్నానికి తెరలేపాడు.

అందులో భాగంగా సంతనూతలపాడు ప్రాంతం నుంచి ఏకంగా 20 మంది కూలీలను తెప్పించి కొండపనాయుడు చెరువులో నాలుగు రోజుల క్రితం వారితో గుడిసెలు సైతం వేయించాడు. కూలీలు రెండు రోజులుగా కట్టెలు కొడుతున్నారు. ఇప్పటికే 20 టన్నుల వరకు విక్రయించినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వ సొమ్మును సొంత ఖాతాకు జమ చేసుకుంటున్నా పట్టించుకున్న అధికారులు లేరు. ఈ వ్యవహారంపై ఇప్పటికే చవటపాలెం, పెట్లూరు గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

సదరు టీడీపీ నేత అక్రమాన్ని సొంత పార్టీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. గ్రామానికి చెందిన ఆస్తిని ఒకే ఒకరు సొంతం చేసుకోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. విషయం తెలుసుకున్న సాక్షి విలేకరి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ డీఈ రమేష్ దృష్టికి తీసుకెళ్లారు. చెట్లు అమ్ముకునేలా పంచాయతీకి కోర్టు ఆర్డర్ ఉన్నట్లు సదరు నేత  తనకు చెప్పారని డీఈ పేర్కొన్నారు. 2003లో చెరువుల్లోని చెట్లకు పంచాయతీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించగా అదే ఇరిగేషన్‌శాఖ అధికారులు పంచాయతీ వేలం పాట ఎలా నిర్వహిస్తుందని, ఆ హక్కు తమశాఖకే ఉందని చెప్పి వేలం పాట ఆపివేయించారు.

అప్పటి అధికారులు పంచాయతీకి ఓ నివేదిక కూడా సమర్పించారు. అందులో భాగంగా ఆరేళ్ల క్రితం ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో అధికారులు రెండు చెరువులకు వేలం పాట నిర్వహించారు. పాట పాడుకున్న వారు ఆ నగదును ఇరిగేషన్‌శాఖకే చెల్లించారు. మరి అప్పుడు ఇరిగేషన్ శాఖ ద్వారా చెరువుల్లోని చెట్లకు వేలం నిర్వహించగా ఇప్పుడు పంచాయతీకి కోర్టు ఆర్డర్ ఉందని డీఈ చెప్పటం పలు అనుమానాలకు తావిస్తోంది.

అధికార పార్టీ నేతల అడుగులకు అధికారులు మడుగులొత్తుతున్నారని చెప్పేందుకు ఈ చిన్న  ఉదాహరణ చాలని పెట్లూరు వాసులు చెబుతున్నారు. కలెక్టర్ విజయకుమార్ తక్షణమే స్పందించి ఈ వ్యవహారంపై జోక్యం చేసుకుని ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని వారు కోరుతున్నారు. చెట్లు నరికి సొమ్ము చేసుకుంటున్న సదరు నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చే స్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement