RBI annual report
-
బాబు చేసిన పాపాలు
చంద్రబాబు సర్కారు 2016–17, 2017–18లో 7.6 శాతం.. 2018–19లో ఏకంగా 8.3 శాతం వడ్డీతో మార్కెట్ రుణాలు తీసుకుంది. ప్రస్తుత ప్రభుత్వం 2019–20 ఆర్థిక సంవత్సరంలో 7.2%, 2020–21లో 6.5% వడ్డీతో మాత్రమే మార్కెట్ రుణాలు తీసుకుంది. క్రమంగా అప్పులు కూడా తగ్గిస్తోంది. – ఆర్బీఐ నివేదిక సాక్షి, అమరావతి: గత చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అత్యధిక వడ్డీలకు అప్పులు చేసినట్లు ఆర్బీఐ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. ఏ సంవత్సరం కూడా ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం) నిబంధనలను పాటించలేదని కుండబద్దలు కొట్టింది. 2014–15 ఆర్థిక ఏడాది నుంచి ఇప్పటి వరకు దేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక నిర్వహణ, అప్పులు, అప్పులపై వడ్డీలు, వ్యయాల తీరు తెన్నులపై ఆర్బీఐ అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక వడ్డీలకు ఎక్కువ అప్పులు చేస్తోందని గగ్గోలు పెడుతున్న ఈనాడు, టీడీపీ బృందానికి.. బాబు గత ఐదేళ్ల పాలనలో ఆర్థిక నిర్వహణపై ఆర్బీఐ వెల్లడించిన అధ్యయన నివేదిక కనిపించడం లేదు. ఈ నివేదిక ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం మార్కెట్ అప్పులను ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ వడ్డీకి తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. స్టేట్ డెవలప్మెంట్ రుణాల కింద మార్కెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా తీసుకున్న అప్పులకు సాధారణం కన్నా 45 బేసెస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ పడినట్లు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. ఇప్పటి ప్రభుత్వం క్రమంగా అప్పులను కూడా తగ్గిస్తోందని తెలిపింది. 2020–21 బడ్జెట్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 35.5 శాతం ఉంటాయని అంచనా వేయగా, వాస్తవానికి సవరించిన అంచనాల్లో అవి 32.5 శాతానికే పరిమితం అయినట్లు వెల్లడించింది. ఆ అప్పులు కూడా తక్కువ వడ్డీకే తెచ్చిందని తెలిపింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో నాలుగేళ్ల పాటు ద్రవ్యలోటు 4 శాతం పైగానే ఉందని.. ఒక ఏడాది ఏకంగా 6 శాతానికి చేరిందని తెలిపే ఆర్బీఐ నివేదికలోని ఓ భాగం బాబు జమానాలో ఎఫ్ఆర్బీఎంను మించి అప్పులు బాబు హయాంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవడం అప్పట్లో దిగజారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టింది. రాష్ట్ర ఆర్థిక పరపతి దిగజారినప్పుడే ఎక్కువ వడ్డీలకు గానీ అప్పులు పుట్టవని ఆర్బీఐ నివేదిక వ్యాఖ్యానించింది. మరో పక్క 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు చంద్రబాబు హయాంలో ఏ సంవత్సరం కూడా ఎఫ్ఆర్బీఎం (ఫిస్కల్ రెస్పాన్స్‌బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్) నిబంధనలను పాటించలేదని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ద్రవ్య లోటు మూడు శాతం దాటకూడదని, అయితే బాబు ఐదేళ్ల పాలనలో ఒక ఏడాది ఏకంగా ఆరు శాతం, మిగతా నాలుగేళ్లు నాలుగు శాతంపైనే ఉందని నివేదిక వెల్లడిచింది. వీటన్నింటి వల్ల ఆర్థిక సూచికల ర్యాంకులో రాష్ట్రం దిగజారినట్లు నివేదిక స్పష్టం చేసింది. -
రూ.500 దొంగనోట్లు పెరుగుతున్నాయ్: తస్మాత్ జాగ్రత్త!
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థ మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో 79,669 రూ. 500 డినామినేషన్ నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ సంఖ్య రెట్టింపని ఆర్బీఐ వార్షిక నివేదిక తెలిపింది. ఇక రెండువేల నోట్ల విషయంలో గుర్తించిన నకిలీ సంఖ్య 13,604గా ఉంది. 2020–21తో పోల్చితే ఈ సంఖ్య 54.6 శాతం అధికం. 2016లో అమలులో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దు ప్రధాన లక్ష్యాలలో ఒకటి నకిలీ కరెన్సీ నోట్ల చెలామణిని అరికట్టడం కావడం గమనార్హం. కాగా, ఇందుకు సంబంధించి తాజా పరిస్థితి ఏమిటన్నది గణాంకాల్లో పరిశీలిస్తే... ► 2020–2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 2,08,625 నకిలీ నోట్లను గుర్తిస్తే, 2021–22లో ఈ సంఖ్య 2,30,971కి చేరింది. ► 2020–21తో పోల్చితే 2021–22లో రూ.10, రూ.20, రూ.200, రూ.500 (కొత్త డిజైన్), రూ. 2,000ల విలువ కలిగిన నకిలీ నోట్లలో వరుసగా 16.4 శాతం, 16.5 శాతం, 11.7 శాతం, 101.9 శాతం, 54.6 శాతం పెరుగుదల నమోదైంది. ► అయితే ఇదే కాలంలో రూ.50, రూ.100 దొంగ నోట్లు వరుసగా 28.7%, 16.7% తగ్గడం గమనార్హం. ► 2021–22లో గుర్తించిన మొత్తం నకిలీ నోట్లలో 6.9 శాతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గుర్తించగా, 93.1 శాతం నోట్లను ఇతర బ్యాంకులు పసిగట్టాయి. ► 2021 ఏప్రిల్ నుండి 2022 మార్చి 31 వరకు కరెన్సీ ప్రింటింగ్‌పై చేసిన మొత్తం వ్యయం రూ. 4,984.8 కోట్లు. అంతకుముందు సంవత్సరం (2020 జూలై 1 నుండి 2021 మార్చి 31 వరకు) ఈ మొత్తం రూ. 4,012.1 కోట్లు. 2021 మార్చికి ముందు ఆర్బీఐ జూలై–జూన్ మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించేది. అయితే 2021 ఏప్రిల్ నుంచి ‘ఏప్రిల్–మార్చి’ని ఆర్థిక సంవత్సరంగా మార్చారు. ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో పాడైపోయిన నోట్లను వెనక్కు తీసుకోడానికి సంబంధించిన సంఖ్య 88.4 శాతం పెరిగి 1,878.01 కోట్లకు చేరింది. 2020–21లో ఈ సంఖ్య 997.02 కోట్లు. -
2,000 కరెన్సీ నోట్లు : ఆర్బీఐ షాకింగ్ నివేదిక
ముంబై: ఆర్థిక వ్యవస్థ నుంచి 2000 వేల రూపాయల నోట్లు క్రమంగా వెనక్కుమళ్లుతున్నాయి. 2022 మార్చి నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్లలో వీటి శాతం కేవలం 1.6 శాతానికి పడిపోయింది. నోట్ల సంఖ్య 214 కోట్లుగా ఉంది. ఆర్బీఐ 2021–22 వార్షిక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. రుణ వృద్ధిలో బ్యాంకింగ్ కీలకపాత్ర పోషించాలని నివేదిక సూచిస్తూనే, అదే సమయంలో రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అకౌంట్ల పనితీరును జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరిశీలించాలని, బ్యాలెన్స్ షీట్ల పటిష్టతపై దృష్టి సారించాలని ఉద్ఘాటించింది.దేశంలో వర్చువల్ కరెన్సీని ప్రవేశపెట్టడం వల్ల కలిగే లాభ,నష్టాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. డిజిటల్ కరెన్సీని ప్రారంభించేందుకు గ్రేడెడ్ విధానాన్ని (దశలవారీ పరిశీలిలన) అవలంబిస్తామని పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం చెలామణిలో ఉన్న అన్ని డినామినేషన్ల కరెన్సీ నోట్ల సంఖ్య 13,053 కోట్లు. 2021 ఇదే నెల్లో ఈ నోట్ల సంఖ్య 12,437 కోట్లు. మార్చి 2020 చివరి నాటికి, చెలామణిలో ఉన్న రూ. 2000 డినామినేషన్ నోట్ల సంఖ్య 274 కోట్లు. ఇది మొత్తం చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో 2.4 శాతం. మార్చి 2021 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్లలో 245 కోట్లకు లేదా 2 శాతానికి ఈ పరిమాణం క్షీణించింది. ఇక గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 214 కోట్లకు (1.6 శాతానికి) పడిపోయింది. విలువ పరంగా కూడా రూ. 2000 డినామినేషన్ నోట్లు చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్ల విలువలో 22.6 శాతం నుండి మార్చి 2021 చివరి నాటికి 17.3 శాతానికి, మార్చి 2022 చివరి నాటికి 13.8 శాతానికి తగ్గాయి. నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చి చివరి నాటికి చెలామణిలో ఉన్న రూ.500 డినామినేషన్ నోట్ల సంఖ్య 3,867.90 కోట్ల నుంచి 4,554.68 కోట్లకు పెరిగింది. పరిమాణం పరంగా మొత్తం బ్యాంక్ నోట్లలో మార్చి చివరినాటికి రూ. 500 డినామినేషన్ అత్యధికంగా 34.9 శాతం వాటాను కలిగి ఉంది. ఆ తర్వాత రూ. 10 డినామినేషన్ బ్యాంక్ నోట్ల వెయిటేజ్ చెలామణిలో ఉన్న నోట్లలో 21.3 శాతంగా ఉంది. రూ.500 డినామినేషన్ నోట్లు మార్చి 2021 చివరి నాటికి 31.1 శాతం. మార్చి 2020 నాటికి 25.4 శాతం వాటా కలిగి ఉంది. విలువ పరంగా చూస్తే, ఈ నోట్లు మార్చి 2020 నుండి మార్చి 2022 వరకు 60.8 శాతం నుండి 73.3 శాతానికి పెరిగాయి. 2021 మార్చి చివరినాటికి రూ.28.27 లక్షల కోట్లుగా ఉన్న అన్ని డినామినేషన్ల మొత్తం కరెన్సీ నోట్ల విలువ ఈ ఏడాది మార్చి చివరి నాటికి రూ.31.05 లక్షల కోట్లకు పెరిగింది. విలువ పరంగా రూ. 500, రూ. 2000 నోట్ల వాటా 31 మార్చి 2022 నాటికి చెలామణిలో ఉన్న బ్యాంక్ నోట్ల మొత్తం విలువలో 87.1 శాతం. ఇది మార్చి 2021 నాటికి 85.7 శాతం. చెలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ–పరిమాణం 2020–21లో వరుసగా 16.8 శాతం, 7.2 శాతం పెరిగాయి. 2021–22లో వరుసగా ఈ పెరుగుదల 9.9 శాతం, 5 శాతంగా ఉంది. చెలామణిలో ఉన్న కరెన్సీ (సీఐసీ) బ్యాంకు నోట్లు, నాణేల రూపంలో ఉంది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500, రూ. 2000 డినామినేషన్లలో బ్యాంకు నోట్లను జారీ చేస్తోంది. 50 పైసలు, రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 నాణేలు చెలామణిలో ఉన్నాయి. పెరిగిన ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ నివేదిక ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాలెన్స్ షీట్ 8.46 శాతం పెరిగి రూ.61.9 లక్షల కోట్లకు చేరింది. కరెన్సీ జారీ కార్యకలాపాలు, ద్రవ్య విధానం, నగదు నిల్వల నిర్వహణ, ఇందుకు అనుగుణంగా నిర్వహించే విధులను ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ ప్రతిబింబిస్తుంది. సెంట్రల్ బ్యాంక్ ఆదాయం 20.14 శాతం పెరిగితే, వ్యయాలు భారీగా 280.13 శాతం పెరిగి 1,29,800.68 కోట్లకు చేరాయి. 2020–21లో మొత్తం మిగులు రూ.99,122 కోట్లయితే, 2021–22లో ఈ పరిమాణం 69.42 శాతం తగ్గి రూ.30,307.45 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని కేంద్రానికి డివిడెండ్‌గా ఇవ్వాలని గతవారం ఆర్బీఐ నిర్ణయించింది. 2022 మార్చి నాటికి మొత్తం అసెట్స్‌లో దేశీయ అసెట్స్ వెయిటేజ్ 28.22 శాతం అయితే, ఫారిన్ కరెన్సీ అసెట్స్, పసిడి (గోల్డ్ డిపాజిట్లు, నిల్వలు) వాటా 71.78 శాతంగా ఉంది. 2021 మార్చి నాటికి ఈ వెయిటేజ్‌లు వరుసగా 26.42 శాతం, 73.58 శాతాలుగా ఉన్నాయి. గోల్డ్ హోల్డింగ్స్ ఇదే కాలంలో 695.31 మెట్రిక్ టన్నుల నుంచి 760.42 మెట్రిక్ టన్నులకు చేరింది. కాగా ఉద్యోగుల వ్యయాలు 19.19 శాతం తగ్గి రూ.4,788.03 కోట్ల నుంచి రూ.3,869.43 కోట్లకు తగ్గాయి. 2021–22లో వివిధ సూపర్‌యాన్యుయేషన్ ఫండ్స్‌కు (ఉద్యోగుల పెన్షన్ ప్రణాళికలకు) సంబంధించి చెల్లింపులు తగ్గడం దీనికి కారణం. సంస్కరణలు, ద్రవ్యోల్బణం కట్టడే కీలకం సుస్థిర, సమతౌల్య, సవాళ్లను ఎదుర్కొనగలిగే ఆర్థిక వృద్ధికి వ్యవస్థాగత సంస్కరణలు కీలకమని ఆర్బీఐ పేర్కొంది. ముఖ్యంగా మహమ్మారి సవాళ్లు, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్థిక సంస్కరణల వేగవంతం ముఖ్యమని వివరించింది. దీనితోపాటు ద్రవ్యోల్బణం కట్టడి, మూలధన వ్యయాల పెంపు, పటిష్ట ద్రవ్య విధానాలు, సరఫరాల సమస్యలు అధిగమించడం కూడా ఎకానమీ పురోగతిలో కీలకమని వివరించింది. ప్రస్తుతం ఎకానమీ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ద్రవ్యోల్బణం ఒకటని వివరించింది. ఎకానమీ రికవరీలో స్పీడ్ తగ్గిందని కొన్ని హై–ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లు సంకేతాలు ఇచ్చినట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రభుత్వ సహకారం, సమన్వయంతో ఆర్బీఐ తగిన అన్ని చర్యలూ తీసుకుంటుందని స్పష్టం చేసింది. భౌగోళిక ఉద్రిక్తతలు సమసిపోయి, కోవిడ్ తదుపరి వేవ్‌లు తగ్గితే తిరిగి ఎకానమీ స్పీడ్ అందుకుంటుందన్న భరోసాను వెలిబుచ్చింది. అధిక టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ధరలపై ఒత్తిడి తెస్తుందని ఆర్బీఐ పేర్కొంది. -
భారీగా పెరిగిన రూ.500 నకిలీ నోట్లు
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన వార్షికనివేదికలను గురువారం ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దుతరువాత డిజిటల్ లావాదేవీకు కేంద్రం భారీ ప్రోత్సాహాన్నిస్తుండగా ఆర్బీఐ షాకింగ్ న్యూస్ చెప్పింది. 2018-19లో చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల పరిమాణం 6.2 శాతం పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో 108,759 మిలియన్ కరెన్సీ నోట్లు చెలామణిలో ఉన్నాయని సెంట్రల్ బ్యాంక్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ప్రధానంగా 500 రూపాయల నోట్ల చలామణి గణనీయంగా పెరిగింది. ఈ సంవత్సరంలో 42.9 శాతం నుంచి 51.0 శాతానికి పెరిగిందని నివేదిక తెలిపింది. దీంతో పాటు రూ.500, రూ.2వేల నకిలీ నోట్ల చలామని కూడా భారీగా పెరగడం గమనార్హం. దీంతో నరేంద్రమోదీ సర్కార్ కల డిజిటల్ ఎకానమీ కలకు చెక్‌పడింది. 2018-19లో చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ 17 శాతం పెరిగి రూ .211.11 లక్షల కోట్లకు చేరుకుంది. విలువ పరంగా, 2019 మార్చి చివరి నాటికి రూ .500, రూ .2,000 నోట్ల వాటా 82.2 శాతానికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో, మొత్తం నోట్ల విలువలో వీటి వాటా 80.2 శాతంగా ఉంది. 2019 మార్చి చివరి నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్లలో వాల్యూమ్ పరంగా, రూ .10 , రూ .100 నోట్లు 47.2 శాతంగా ఉంది. 2018 మార్చి చివరి నాటికి ఇది 51.6 శాతంగా నమోదైంది. గత సంవత్సరం 2.4 శాతం పెరుగుదలతో పోలిస్తే 2018-19లో చెలామణిలో ఉన్న నాణేల మొత్తం విలువ 0.8 శాతం పెరిగింది. అంతకుముందు సంవత్సరంలో 2.4 శాతం పెరుగుదలతో పోలిస్తే మొత్తం వాల్యూమ్ 1.1 శాతం పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగింపులో రూ.1, రూ .2, రూ .5 నాణేలు మొత్తం చెలామణిలో ఉన్న నాణేల పరిమాణంలో 83.6 శాతం ఉన్నాయి. విలువ పరంగా వీటి వాటా 78.3 శాతం. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, రూ .10, రూ .20, రూ .50 అనే డినామినేషన్లలో వరుసగా 20.2 శాతం, 87.2 శాతం, 57.3 శాతం నకిలీ నోట్లు పెరిగాయి. అయితే రూ.100ల నకిలీ నోట్లు మాత్రం 7.5 శాతం తగ్గాయి. ఆగస్టు 2017లో ప్రవేశపెట్టిన రూ .200 నోట్లలో అంతకుముందు సంవత్సరంలో 79 పోలిస్తే... 12,728 నకిలీ నోట్లను గుర్తించినట్టు ఆర్బీఐ నివేదించింది. అలాగే ఈ ఏడాది రూ .500ల (కొత్త డిజైన్ నోట్స్) నకిలీ నోట్లు 121.0 శాతం పెరగ్గా, రూ. 2వేల నోట్లలో నకిలీవి 21.9 శాతం పెరిగిందని సెంట్రల్ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. బ్యాంకు కుంభకోణాలు : 2019 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు మోసాల మొత్తం విలువ 74 శాతం ఎగిసి రూ. 72వేల కోట్లుగా ఉంది. ఇందులో ప్రభుత్వ బ్యాంకులది 90 శాతం వాటా. -
మా తదుపరి టార్గెట్ అదే : జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు లక్ష్యం డబ్బు జప్తు చేయడం కాదని, బ్లాక్‌మనీని వెలికితీయడమని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రత్యక్ష పన్నుల వాటా, పరోక్ష పన్నుల వాటా విస్తరించిందని జైట్లీ చెప్పారు. డీమానిటైజేషన్ తర్వాత డిపాజిట్ అయిన నోట్ల గణాంకాలపై ఆర్బీఐ నేడు విడుదల చేసిన 2016-17 వార్షిక రిపోర్టుపై అరుణ్‌జైట్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో తమ తదుపరి టార్గెట్, వచ్చే ఎన్నికల్లో బ్లాక్ మనీ వాడకాన్ని నిరోధించడమేనని జైట్లీ తెలిపారు. కొంతమంది నోట్ బ్యాన్‌ను అర్థం చేసుకోలేకపోయారని విమర్శించారు. బ్లాక్ మనీకి వ్యతిరేకంగా యుద్ధం చేయలేని వారు, దీని లక్ష్యాన్ని గందరగోళంలో పడేశారని మండిపడ్డారు. అధికారిక, అనధికారిక ఆర్థికవ్యవస్థలలో సమైక్యత తీసుకురావడమే దీని ఉద్దేశ్యమంటూ మంత్రి వివరించారు. డీమానిటైజేషన్‌తో సానుకూల ఫలితాలు వచ్చినట్టు జైట్లీ చెప్పారు. -
రద్దయిన పెద్ద నోట్ల లెక్క తేలింది
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు వివరాలపై ఇన్ని రోజులు నాన్చుతూ వస్తున్న రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆ నోట్ల లెక్క తేల్చింది. ఎన్ని నోట్లు తమ వద్ద డిపాజిట్ అయ్యాయో ప్రకటించింది. బుధవారం విడుదల చేసిన వార్షిక రిపోర్టులో 99 శాతం పెద్ద నోట్లు తమ వద్ద డిపాజిట్ అయినట్టు ఆర్బీఐ వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు ప్రకటన నుంచి ఇప్పటి వరకు రూ.15.28 లక్షల కోట్ల విలువైన పాత నోట్లు సెంట్రల్ బ్యాంకు వద్దకు వచ్చినట్టు పేర్కొంది. 2016 మార్చి వరకు చలామణిలో ఉన్న 632.6 కోట్ల వెయ్యి రూపాయిల నోట్లలో, ఇంకా 8.9 కోట్ల వెయ్యి రూపాయిల నోట్లు తమ వద్దకు రాలేదని వెల్లడించింది. అంటే కేవలం 1.3 శాతం వెయ్యి రూపాయిల నోట్ల మాత్రమే వెనక్కి రాలేదని తెలిపింది. తిరిగొచ్చిన పెద్ద నోట్లలో 7 లక్షల 62వేల నకిలీ నోట్లని చెప్పింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రూ.2000 నోట్లు, మొత్తం చలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువలో సగం శాతం ఉన్నట్టు ఆర్బీఐ రిపోర్టు బహిర్గతం చేసింది. అంతేకాక 2016-17లో కొత్త కరెన్సీ నోట్ల ప్రింటింగ్‌కు సెంట్రల్ బ్యాంకు రూ.7,965 కోట్లను వెచ్చించినట్టు కూడా వెల్లడించింది. అయితే మార్చి ముగింపు వరకు ఏడాది ఏడాదికి మొత్తంగా చలామణిలో ఉన్న కరెన్సీ వాడకం 20.2 శాతానికి తగ్గిపోయినట్టు ఆర్బీఐ తెలిపింది. తక్కువ విలువ కలిగిన బ్యాంకు నోట్లను ఎక్కువగా మార్కెట్లోకి తెస్తుండటంతో, బ్యాంకు నోట్ల వాల్యుమ్ మాత్రం 11.1 శాతం పెరిగినట్టు సెంట్రల్ బ్యాంకు తెలిపింది. ఈ ఏడాది వ్యాప్తంగా నాణేలకు ఏర్పడిన డిమాండ్‌లో స్థిరమైన పెరుగుదల కనిపించినట్టు ఆర్బీఐ తన రిపోర్టులో చెప్పింది. నాణేల మొత్తం విలువ సర్క్యూలేషన్లో 14.7 శాతానికి పెరిగినట్టు ఆర్బీఐ వెల్లడించింది. కాగ, గతేడాది ఇవి 12.4 శాతం మాత్రమేనని రిపోర్టులో పేర్కొంది. 1, 2 రూపాయిల నాణేలు మొత్తం కాయిన్ల విలువలో 69.2 శాతం ఉంటే, విలువ పరంగా 44.8 శాతం ఉన్నాయి. కాగ, గతేడాది నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ అకస్మాత్తుగా పెద్ద నోట్లు రూ.1000, రూ.500 రద్దు చేసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిర్దేశించిన గడువు విధించిన ప్రభుత్వం, ఆ నోట్లను బ్యాంకుల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. వాటి స్థానంలో కొత్త నోట్లను ఆర్బీఐ చలామణిలోకి తీసుకొచ్చింది. నిర్దేశించిన గడువు లోపల బ్యాంకుల వద్ద పాత నోట్లను డిపాజిట్ చేయని వారిపై ప్రభుత్వం కఠిన చర్యలకు కూడా ఆదేశించింది. అవినీతిపై పోరాటానికి, నల్లధన నిర్మూలనకు ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. -
రద్దయిన పెద్ద నోట్ల లెక్క తేలింది