మా తదుపరి టార్గెట్ అదే : జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు లక్ష్యం డబ్బు జప్తు చేయడం కాదని, బ్లాక్‌మనీని వెలికితీయడమని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రత్యక్ష పన్నుల వాటా, పరోక్ష పన్నుల వాటా విస్తరించిందని జైట్లీ చెప్పారు. డీమానిటైజేషన్ తర్వాత డిపాజిట్ అయిన నోట్ల గణాంకాలపై ఆర్బీఐ నేడు విడుదల చేసిన 2016-17 వార్షిక రిపోర్టుపై అరుణ్‌జైట్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో తమ తదుపరి టార్గెట్, వచ్చే ఎన్నికల్లో బ్లాక్ మనీ వాడకాన్ని నిరోధించడమేనని జైట్లీ తెలిపారు.
కొంతమంది నోట్ బ్యాన్‌ను అర్థం చేసుకోలేకపోయారని విమర్శించారు. బ్లాక్ మనీకి వ్యతిరేకంగా యుద్ధం చేయలేని వారు, దీని లక్ష్యాన్ని గందరగోళంలో పడేశారని మండిపడ్డారు. అధికారిక, అనధికారిక ఆర్థికవ్యవస్థలలో సమైక్యత తీసుకురావడమే దీని ఉద్దేశ్యమంటూ మంత్రి వివరించారు. డీమానిటైజేషన్‌తో సానుకూల ఫలితాలు వచ్చినట్టు జైట్లీ చెప్పారు.