నోట్ల రద్దు ప్రక్రియ అప్పుడే ప్రారంభమైంది!
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు ప్రక్రియకు ముహుర్తం ఒకటి రెండు నెలల ముందు తీసుకున్నది కాదంట. దాదాపు 10 నెలల ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైందని తెలిసింది. గత జనవరిలోనే డీమానిటైజేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్టు బుధవారం పార్లమెంట్ ప్యానెల్‌కు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ చెప్పినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్యానల్‌కు సమర్పించిన లిఖిత పూర్వక సమాధానంలో పెద్ద నోట్లను రద్దుచేయమని ప్రభుత్వం నవంబర్ 7న సెంట్రల్ బ్యాంకుకు సూచించినట్టు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. అనంతరం ఒక్కరోజులోనే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ నవంబర్ 8న సంచలన నిర్ణయం ప్రకటించినట్టు తెలిపారు.
పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన పరిణామాలపై వివరణ ఇవ్వడానికి బుధవారం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు హాజరైన ఉర్జిత్ పటేల్, రూ.9.2 లక్షల కోట్ల కొత్త కరెన్సీ నోట్లను బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. అయితే బ్యాంకింగ్ సిస్టమ్ ఎప్పటిలోగా సాధారణ పరిస్థితి వస్తుందన్న ప్రశ్నకు ఉర్జిత్ పటేల్ సమాధనం చెప్పలేకపోయారని తెలిసింది. అయితే అవసరమైన నగదును సెంట్రల్ బ్యాంకు సరఫరా చేస్తుందని ఉర్జిత్ తెలిపారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన అనంతరం చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీ అంటే రూ.15.44 లక్షల కోట్ల నగదు నిరూపయోగంగా మారిన సంగతి తెలిసిందే. ప్యానల్ ముందు హాజరైన ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులు మాత్రం పెద్ద నోట్ల రద్దు అనంతరం ఎన్ని పాత నోట్లు వెనక్కి వచ్చాయనే దానిపై కనీసం నోరు కూడా మెదపలేదట. ఇదే విషయంలో ఉర్జిత్ పటేల్‌తో పాటు, అధికారులు కూడా శుక్రవారం ప్రజాపద్దుల కమిటీ ముందు హాజరుకావాల్సి ఉంది.