rbi official
-
నోట్ల మార్పిడిలో ఆర్బీఐ ఆఫీసర్ హస్తం!
సాక్షి, బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు తర్వాత నోట్ల మార్పిడి అక్రమాల్లో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు దొరికిపోతుండగా, తాజాగా బెంగళూరులో ఐపీఎస్ అధికారి భార్య, ఆర్బీఐ అధికారిణిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెంగళూరులోని నృపతుంగ రోడ్లో ఉన్న రిజర్వు బ్యాంకు కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళాధికారి రాష్ట్ర మంత్రులకు సంబంధించిన పాత పెద్ద నోట్లను అక్రమ మార్గాల్లో మార్చడానికి సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య అయిన సదరు మహిళాధికారిపై సీబీఐ అధికారులు సాక్ష్యాలను సేకరిస్తున్నారు. భర్త ఐపీఎస్ అధికారి ద్వారా ఆమెతో పరిచయం పెంచుకున్న కొంత మంది కర్ణాటక మంత్రులు తమ వద్ద ఉన్న రూ. 5 కోట్ల నుంచి రూ. 8 కోట్ల వరకు నల్లధనాన్ని అక్రమ మార్గాల్లో వైట్‌మనీగా మార్చుకున్నారనే ఆరోపణలున్నాయి. సహకార బ్యాంకులపై విచారణ: నవంబర్ 10–14 తేదీల్లో మంగళూరు జిల్లా సహకారి బ్యాంకులోని సేవింగ్స్ అకౌంట్లలో రూ.428 కోట్లు డిపాజిట్ అయినట్లు సమాచారం. డీసీసీ బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పెద్ద మొత్తంలోని నగదుకు సంబంధించి వివరాలను సేకరించడానికి నాబార్డుతో విచారణ జరిపించనుంది. -
30% కమీషన్ ఇస్తే మార్చిపెడతా!
పెద్దనోట్ల రద్దు తర్వాత సీబీఐ చేస్తున్న దాడులతో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా బెంగళూరులో అరెస్టుచేసిన రిజర్వుబ్యాంకు అధికారి విషయంలో కూడా ఇలాగే జరిగింది. 30 శాతం కమీషన్ ఇస్తే ఎంత డబ్బైనా మార్చిపెడతానని మైఖేల్ కట్టుకరన్ అనే ఆ అధికారి చెప్పినట్లు తెలిసింది. ఆయన రిజర్వు బ్యాంకులోని ఇష్యూ డిపార్టుమెంటులో సీనియర్ స్పెషల్ అసిస్టెంటుగా పనిచేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూర్ కొల్లేగల్ బ్రాంచికి సంబంధించిన నగదు మార్పిడి వ్యవహారంలో ఈ అరెస్టులు జరిగాయి. నిందితుల నుంచి రూ. 17 లక్షలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కట్టుకురన్తో పాటు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూరు క్యాషియర్ పరాశివమూర్తి కూడా మనీ లాండరింగ్‌కు సంబంధించిన 12 కేసుల్లో ఉన్నట్లు తేలింది. వాళ్లు మొత్తం కోటిన్నర రూపాయల పాతనోట్లను కొత్త నోట్లతో మారుస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలాంటి కేసుల్లో ఒక రిజర్వు బ్యాంకు అధికారి అరెస్టు కావడం ఇదే మొదటిసారి. పెద్దనోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లను ఇచ్చేందుకు మైఖేల్‌ను కొల్లేగల్లోని కరెన్సీ చెస్ట్‌కు పంపారు. కానీ అక్కడ ఆయన పరాశివమూర్తి, మరో కొందరితో కలిసి 13 మందికి 30% కమీషన్ పద్ధతిలో డబ్బులు ఇవ్వడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆర్బీఐ అధికారులు తెలిపారు.