30% కమీషన్ ఇస్తే మార్చిపెడతా!
30% కమీషన్ ఇస్తే మార్చిపెడతా!
Published Wed, Dec 14 2016 12:25 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
పెద్దనోట్ల రద్దు తర్వాత సీబీఐ చేస్తున్న దాడులతో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా బెంగళూరులో అరెస్టుచేసిన రిజర్వుబ్యాంకు అధికారి విషయంలో కూడా ఇలాగే జరిగింది. 30 శాతం కమీషన్ ఇస్తే ఎంత డబ్బైనా మార్చిపెడతానని మైఖేల్ కట్టుకరన్ అనే ఆ అధికారి చెప్పినట్లు తెలిసింది. ఆయన రిజర్వు బ్యాంకులోని ఇష్యూ డిపార్టుమెంటులో సీనియర్ స్పెషల్ అసిస్టెంటుగా పనిచేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూర్ కొల్లేగల్ బ్రాంచికి సంబంధించిన నగదు మార్పిడి వ్యవహారంలో ఈ అరెస్టులు జరిగాయి.
నిందితుల నుంచి రూ. 17 లక్షలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కట్టుకురన్‌తో పాటు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూరు క్యాషియర్ పరాశివమూర్తి కూడా మనీ లాండరింగ్‌కు సంబంధించిన 12 కేసుల్లో ఉన్నట్లు తేలింది. వాళ్లు మొత్తం కోటిన్నర రూపాయల పాతనోట్లను కొత్త నోట్లతో మారుస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలాంటి కేసుల్లో ఒక రిజర్వు బ్యాంకు అధికారి అరెస్టు కావడం ఇదే మొదటిసారి. పెద్దనోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లను ఇచ్చేందుకు మైఖేల్‌ను కొల్లేగల్‌లోని కరెన్సీ చెస్ట్‌కు పంపారు. కానీ అక్కడ ఆయన పరాశివమూర్తి, మరో కొందరితో కలిసి 13 మందికి 30% కమీషన్ పద్ధతిలో డబ్బులు ఇవ్వడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆర్‌బీఐ అధికారులు తెలిపారు.
Advertisement