ఉర్జిత్ పటేల్‌పై కాంగ్రెస్ తీవ్ర వ్యాఖ్యలు
పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పూర్తిగా కనుమరుగైందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆర్థికవ్యవస్థకు కీలకంగా ఉన్న సెంట్రల్ బ్యాంకు స్వయంప్రతిపత్తిని ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్ త్యాగం చేశారని మండిపడింది. పెద్దనోట్ల రద్దుపై ఆర్బీఐ సంసిద్ధతగా లేకపోవడాన్ని తప్పుబట్టిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేష్, ఉర్జిత్ పటేల్ దేశాన్ని తప్పుదోవ పట్టించారని లేదా బ్యాంకు స్వయంప్రతిపత్తిని త్యాగం చేశారని వ్యాఖ్యానించారు. ఆయన తన గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్బీఐ దేశీయ ద్రవ్య సంస్థ. అవసరమైన బ్యాంకు నోట్లను ప్రజలకు అందుబాటులో ఉంచే పూర్తి బాధ్యత ఈ బ్యాంకుకే ఉంటుంది.
పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధాని ప్రకటించిన నిర్ణయానికి ఒకవేళ ఉర్జిత్ పటేల్ ఆమోదిస్తే, కరెన్సీ నోట్లను ఎప్పడికప్పుడూ ప్రజలకు సులభతరంగా అందుబాటులో ఉంచే విశ్వాసం కలిగి ఉండాలని పేర్కొన్నారు. కానీ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. ప్రజలకు సరిపడ నగదు అందుబాటులో ఉండటం లేదు. కరెన్సీ నోట్లు కొరత ఏర్పడింది. ఈ కొరత మరికొన్ని వారాల పాటు కొనసాగే ప్రమాదముందన్నారు. గత రెండు వారాలుగా కొనసాగుతుందని ఈ కరెన్సీ సంక్షోభానికి ఆర్బీఐ ఎందుకు మాట మాత్రం కూడా మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత సెంట్రల్ బ్యాంకు గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్‌కు ఉందన్నారు. ఈ సంక్షోభంపై ప్రభుత్వం మాట్లాడితే, ఆర్బీఐ మాట్లాడినట్టు కాదని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు మొత్తం ప్రక్రియలో అత్యున్నత బ్యాంకు స్వతంత్రను గవర్నర్ త్యాగం చేస్తున్నట్టేనని ఆరోపించారు.