RBSK
-
బాల్యానికి భరోసా
సాక్షి, అమరావతి : చిన్నతనంలోనే ఆరోగ్య సమస్యలు గుర్తించి వారికి వైద్యమందిస్తే పెద్దయ్యాక దుష్ప్రభావాలు కనిపించవనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోంది. గత 12 నెలల్లో ఐదు నుంచి 18 ఏళ్లలోపు వయసున్న సుమారు 1.22 కోట్ల మందికి ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) కింద చేపట్టిన ఈ పరీక్షల్లో పలువురు చిన్నారుల్లో లోపాలు గుర్తించారు. వారిని ఇప్పటికే వివిధ ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదలకు సంబంధించిన లోపాలు గుర్తించి వారికి వయసొచ్చాక ఎలాంటి సమస్యలు లేకుండా చేయాలన్నది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ,ప్రైవేటు స్కూళ్లు,కళాశాలల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఎక్కువగా పదేళ్లలోపు వయసున్న చిన్నారుల్లోనే సమస్యలు కనిపించాయి. దేశంలోనే గొప్పగా కంటివెలుగు కార్యక్రమం చిన్నారులకు వైద్య పరీక్షలే కాదు.. ‘వైఎస్సార్ కంటివెలుగు’లో భాగంగా 66 లక్షలమందికి కంటిపరీక్షలు నిర్వహించారు. ఇందులో సమస్యలున్న 55 వేలమందికి విజన్కిట్స్ పంపిణీ చేశారు. 1.58 లక్షల మందికి ప్రభుత్వం ఉచితంగా కళ్లద్దాలు అందజేసింది. 9,666 మంది చిన్నారులను పెద్దాస్పత్రులకు పంపి చికిత్స చేయించింది. ఎప్పట్నుంచో చిన్నారులు కంటి సమస్యలతో బాధపడుతుండగా నేరుగా స్కూళ్లకే వెళ్లి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అద్దాలు ఇచ్చింది మొదటగా మన రాష్ట్రంలోనే. ఆర్బీఎస్కే కింద పరీక్షల వివరాలు మొదటి దశలో స్క్రీనింగ్ 62,83,203 పుట్టుకతోనే లోపాలున్నవారు 46,627 శారీరక లోపాలతో ఉన్నవారు 36,614 జబ్బులతో బాధపడుతున్నవారు 44,288 ఎదుగుదలలో లోపాలు 9,322 రెండోదశలో స్క్రీనింగ్ 59,99,438 పుట్టుకతోనే సమస్యలున్నవారు 10,439 రకరకాల శారీరక లోపాలున్నవారు 8,921 జబ్బులతో బాధపడుతున్నవారు 54,548 ఎదుగుదల లోపాలున్నవారు 30,084 వైఎస్సార్ కంటివెలుగు కింద మొత్తం స్కూళ్లు 60,406 స్క్రీనింగ్ చేయించుకున్న విద్యార్థులు 66 లక్షలు అద్దాలు తీసుకున్నవారు 1.58 లక్షలు పెద్దాస్పత్రులకు సిఫార్సు 9,666 విజన్కిట్లు తీసుకున్నవారు 55,000 -
ఒకే ఒక్కడు!
జగిత్యాల : జిల్లాలో వైద్యశాఖలో ఒకే అధికారి పలు శాఖలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రంగా అవతరించి రెండేళ్లు అయింది. అయినా వైద్య శాఖలో పూర్తిస్థాయి అధికారుల నియామకం జరుగడంలేదు. దీంతో ఉన్న అధికారులకే పలు శాఖల అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నారు. దీంతో పలు శాఖల్లో పూర్తిస్థాయిలో అధికారులు కేటాయించలేదు. వైద్యశాఖలో డెప్యూటీ డీఎంహెచ్‌వోగా జైపాల్‌రెడ్డి నియమితులయ్యారు. డీఎంహెచ్‌వో సుగంధిని ఇటీవల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో జైపాల్‌రెడ్డికి అదనంగా ఇన్చార్జి డీఎంహెచ్‌వోగా బాధ్యతలు అప్పగించారు. డెప్యూటీ డీఎంహెచ్‌వోతోపాటు, ఇన్చార్జి డీఎంహెచ్‌వో, రాష్ట్ర బాలస్వస్తీయ కార్యక్రమం(ఆర్బీఎస్కే) జిల్లా కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైంది. జిల్లాలోని ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్కూళ్లకు వెళ్లి చికిత్స అందిస్తుంటారు. 10 వాహనాలు, 10 మంది ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటారు. ఈ శాఖకు సైతం ఆయన జిల్లా కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే కేసీఆర్ కిట్ పథకానికి జిల్లాలో ఎలా అమలు జరుగుతుందనే విషయం తెలుసుకునేందుకు అధికారులను నియమించారు. కేసీఆర్ కిట్‌కు సైతం జిల్లా ఇన్చార్జిగా జైపాల్‌రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైద్యశాఖలో నాలుగు ప్రధానమైన ఈ శాఖలను జైపాల్‌రెడ్డి ఇన్చార్జి. నాలుగు శాఖలకు ఒకరే ఇన్చార్జి కావడంతో ఆయన ఒత్తిడికి లోనవుతున్నారు. -
ప్రైవేటు చేతికి బాలల ఆరోగ్య పథకం
కర్నూలు(హాస్పిటల్): రాష్ట్రీయ బాల స్వాస్త్య స్కీమ్ (ఆర్బీఎస్కే)లోని స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రైవేటు చేతికి వెళ్లింది. ఈ పథకాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఉత్తర్వులు జారీ చేసింది. మరో వారం రోజుల్లో పాఠశాలలు తెరవాల్సి ఉండగా ఇప్పటి వరకు స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద వైద్యులను, సిబ్బందిని సైతం నియమించలేదు. జిల్లాలో 2,992 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, 3,549 అంగన్వాడీ కేంద్రాలు, 51 ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో మొత్తం 5.30 లక్షల మంది 18 ఏళ్లలోపు విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరందరికీ గతంలో ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ ద్వారా ప్రభుత్వ వైద్యులే నెలకు రెండుసార్లు పాఠశాలలకు వెళ్లి వైద్యపరీక్షలు చేసేవారు. విద్యార్థులకు ఉన్న వ్యాధులను గుర్తించి చికిత్స చేయడం, వారికి సాధ్యంకాని వ్యాధులుంటే ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేయడం చేసేవారు. ఈ ప్రోగ్రామ్‌ను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ధనుష్ ఇన్ఫోటెక్ అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ జిల్లాలో 40 వైద్యబృందాలను ఏర్పాటు చేస్తుంది. ఒక్కో బృందంలో ఇద్దరు వైద్యులు, ఇద్దరు పారా మెడికల్ సిబ్బంది ఉంటారు. ఒక్కో బృందం ప్రతి రోజూ 120 మంది విద్యార్థులను పరీక్షించి చికిత్స చేయాలి. విద్యార్థులను పూర్తి స్థాయిలో 30 రకాల వ్యాధుల గురించి పరీక్షించి, వారికి సాధ్యంకాని వ్యాధులుంటే రెఫరల్ ఆసుపత్రులకు పంపించాలి. ఈ మేరకు ఒక్కో విద్యార్థికి రూ.47.50 ఇచ్చే విధంగా ఒప్పందం చేసినట్లు సమాచారం. నియామకాలూ మొదలు కాలేదు ఈ ప్రోగ్రామ్ కింద జిల్లాలో 40 బృందాల్లో 80 మంది వైద్యులు, 80 మంది పారా మెడికల్ సిబ్బందిని నియమించాల్సి ఉంది. జూన్ 12వ తేది నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. కాని ఇప్పటి వరకు ధనుష్ ఇన్ఫోటెక్ సంస్థ నియామకాలు చేపట్టలేదు. నియామకాలతో పాటు 40 మొబైల్ వాహనాలను సైతం ఆ సంస్థ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి ఎంఓయూ, గైడ్‌లైన్స్ జిల్లా అధికారులకు కూడా చేరలేదు. ఎంపిక చేశారు..ఉత్తర్వులు ఇవ్వలేదు ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ కింద రెండేళ్ల క్రితం జిల్లాలో 40 వైద్యబృందాల కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నియామకాలు చేపట్టారు. ఈ మేరకు 15 మంది అల్లోపతి, 15 ఆయుర్వేద వైద్యులను ఎంపిక చేశారు. కానీ ఇప్పటి వరకు వారికి నియామక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఓ వైపు ఆర్బీఎస్కే కింద ఎంపికయ్యామన్న ఆనందం ఉన్నా రెండేళ్లైనా నియామకపు ఉత్తర్వులు ఇవ్వక పోవడంపై వైద్యులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయి వివరాలు అందలేదు స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్‌ను ధనుష్ అనే సంస్థకు ఇచ్చారని తెలిసింది. వారు చేసే ప్రోగ్రామ్‌లో భాగంగా రోజూ 40 వాహనాలు వెళ్తున్నాయా లేదా, రోజూ ఒక్కో బృందం 120 మంది విద్యార్థులను పరీక్షిస్తుందా లేదా అని పరిశీలించాలని చూచాయగా మాత్రమే మాకు చెప్పారు. ప్రోగ్రామ్ గురించి ఎంఓయూ, నియమ నిబంధనలకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు ఇంకా అందలేదు. – హేమలత, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ జిల్లా కో ఆర్డినేటర్ -
సంచార వైద్య బృందం కౌన్సెలింగ్ వాయిదా..
ఆందోళనలో అభ్యర్థులు నిరాశగా ఇళ్లకు తిరుగుముఖం కాకినాడ వైద్యం : జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ కార్యాలయంలో రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) మొబైల్ హెల్త్ టీం ఎంపికకు నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.చంద్రయ్య వెల్లడించారు. కాకినాడలో డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో జేసీ–2 రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్ విధానంలో 204 మంది మొబైల్ బృందం(వైద్యులు, ఫార్మాసిస్ట్, ఏఎన్ ఎం, టెక్నికల్ అసిస్టెంట్ల) భర్తీకి బుధవారం కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా 12.30 గంటల సమయంలో వైద్య, ఆరోగ్య కమిషనర్ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు, తిరిగి ఎప్పుడు ప్రారంభించేది తెలియజేస్తామంటూ అధికారిక ఉత్తర్వులు వచ్చినట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ ప్రకటించారు. ఈ వాయిదాతో డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ దాకా మొబైల్ బృందానికి జరగాల్సిన శిక్షణ వాయిదా వేసినట్లు తెలిపారు. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందతున్నారు. అధికారులు సెల్ఫోన్లో పంపిన సమాచారం అందుకుని ఒరిజినల్ అర్హత పత్రాలు, రూ.100 బాండ్‌పేపర్ పట్టుకుని వ్యయప్రయాసల కోర్చి కాకినాడ వస్తే, ఇలా ప్రకటించడం శోచనీయమన్నారు. చంటి పిల్లలతో వచ్చిన మహిళలు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా ఇంటర్వూలు, తనిఖీలు, కౌన్సెలింగ్, డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీల పేరిట తమను అధికారులు అనేక పర్యాయాలు తిప్పి పంపుతున్నారని వాపోయారు. నిరుద్యోగుల ఇక్కట్లను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని సిబ్బంది నియామకాల కోసం కచ్చితమైన తేదీని ప్రకటించాలని కోరారు. -
ఆర్బీఎస్కే రాష్ట్ర నూతన కార్యవర్గం
పోచమ్మమైదాన్ : రాషీ్ట్రయ బాల స్వస్తీయా కార్యక్రమం (ఆర్బీఎస్కే) రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. వరంగల్‌లోని అనంతలక్ష్మీ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో రాష్రీ్టయ బాల స్వస్తీయ కార్యక్రమ వైద్యుల సమావేశం ఆదివారం జరిగింది. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా డాక్టర్ వలుబోజు మోహన్‌రావు, అధ్యక్షుడిగా డాక్టర్ గుండా రవీందర్, ఉపాధ్యక్షులుగా రమేష్, చం ద్రశేఖర్, హుస్సేన్, కార్యదర్శిగా కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రవికుమార్, కోశాధికారిగా మాధవి, సహాయ కార్యదర్శిగా మిసియెుద్దీన్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. -
ఎల్లుండి ఆర్బీఎస్కే కాంట్రాక్టు పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) పథకం కింద కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 22న జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఎహెచ్‌ఓ భానుప్రకాష్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేపడుతున్నామని, 18 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, 9 ఫార్మాసిస్టు పోస్టులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, 8 ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేస్తున్నామని, 1:10 పద్ధతిలో కౌన్సెలింగ్‌కు ఆహ్వానిస్తున్నామన్నారు.