సంచార వైద్య బృందం కౌన్సెలింగ్ వాయిదా..
సంచార వైద్య బృందం కౌన్సెలింగ్ వాయిదా..
Published Wed, Dec 14 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM
ఆందోళనలో అభ్యర్థులు
నిరాశగా ఇళ్లకు తిరుగుముఖం
కాకినాడ వైద్యం : జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ కార్యాలయంలో రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) మొబైల్ హెల్త్ టీం ఎంపికకు నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.చంద్రయ్య వెల్లడించారు. కాకినాడలో డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో జేసీ–2 రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఔట్‌సోర్సింగ్ విధానంలో 204 మంది మొబైల్ బృందం(వైద్యులు, ఫార్మాసిస్ట్, ఏఎన్ ఎం, టెక్నికల్ అసిస్టెంట్ల) భర్తీకి బుధవారం కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా 12.30 గంటల సమయంలో వైద్య, ఆరోగ్య కమిషనర్ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు, తిరిగి ఎప్పుడు ప్రారంభించేది తెలియజేస్తామంటూ అధికారిక ఉత్తర్వులు వచ్చినట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ ప్రకటించారు. ఈ వాయిదాతో డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ దాకా మొబైల్ బృందానికి జరగాల్సిన శిక్షణ వాయిదా వేసినట్లు తెలిపారు. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందతున్నారు. అధికారులు సెల్‌ఫోన్లో పంపిన సమాచారం అందుకుని ఒరిజినల్ అర్హత పత్రాలు, రూ.100 బాండ్‌పేపర్ పట్టుకుని వ్యయప్రయాసల కోర్చి కాకినాడ వస్తే, ఇలా ప్రకటించడం శోచనీయమన్నారు. చంటి పిల్లలతో వచ్చిన మహిళలు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా ఇంటర్వూలు, తనిఖీలు, కౌన్సెలింగ్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీల పేరిట తమను అధికారులు అనేక పర్యాయాలు తిప్పి పంపుతున్నారని వాపోయారు. నిరుద్యోగుల ఇక్కట్లను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని సిబ్బంది నియామకాల కోసం కచ్చితమైన తేదీని ప్రకటించాలని కోరారు.
Advertisement
Advertisement