గర్భిణి స్త్రీల ‘స్లీపింగ్ పొజిషన్’ ఎలా ఉండాలి? పక్కకు తిరిగి పడుకోవడం వల్ల ఏదైనా సమస్య ఎదురవుతుందా? కొన్ని స్లీపింగ్ పొజిషన్‌లు బేyట హార్ట్‌పై ప్రభావం చూపుతున్నాయని అంటుంటారు. ఇది ఎంత వరకు నిజం?
– జి.సుమన, పొద్దుటూరు
ప్రెగ్నెన్సీ సమయంలో, గర్భాశయంలో బిడ్డ పెరిగే కొద్దీ బరువు మొత్తం వెన్నుపూస మీద, వెన్నుపూస పైన ఉండే పెద్ద రక్తనాళాల పైన పడుతుంది. పక్కకు పడుకోవడం వల్ల, ఒత్తిడి వల్ల రక్తనాళాలు కొద్దిగా మూసుకున్నట్లయ్యి, బిడ్డకి, తల్లికి రక్తసరఫరా తగ్గుతుంది. రక్త సరఫరా తగ్గడం వల్ల బిడ్డ సరిగా పెరగలేకపోవటం, ఉమ్మనీరు తగ్గటం, తల్లిలో బీపీ తగ్గటం, కళ్లు తిరిగినట్లు అనిపించడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి మొదటి మూడు నాలుగు నెలలు ఎలా పడుకున్నా ఫర్వాలేదు కానీ, ఐదవ నెల నుంచి పెరిగే బిడ్డ పొత్తికడుపుపై కనిపించడం జరుగుతుంది. అలానే బరువు వెన్నుపూస మీద, రక్తనాళాలపైన పడటం మొదలవుతుంది.
కాబట్టి వీలైనంతవరకు ఐదవ నెల నుంచి ఎడమవైపు పడుకోవడం వల్ల, తల్లి నుంచి బిడ్డకి, అలాగే తల్లి గుండెకి రక్తసరఫరా సరిగా వెళ్లడం జరుగుతుంది. ఇన్‌ఫీరియర్ వీనాకేవా అనే రక్తనాళం తల్లిలోని చెడు రక్తాన్ని గుండెకి పంపించి, గుండె నుంచి మంచి రక్తాన్ని అయెర్టా అనే రక్తనాళం ద్వారా తల్లికి, బిడ్డకి చేరవేస్తుంది. చక్కగా నడుంపైన పడుకోవటం వల్ల చెడు రక్తం తల్లిలో నిలిచి, వ్యర్థ పదార్థాలు తొలిగే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి గర్భిణీలు వీలైనంతవరకు, మొదటి నుంచే ఎడమవైపుకి తిరిగి పడుకోవటం మెల్లగా అలవాటు చేసుకుంటూ, ఐదవ నెల నుంచి తప్పనిసరి ఎడమవైపుకి తిరిగి పడుకోవటం మంచిది.
ఎడమవైపుకి తిరిగి పడుకుని, మోకాలు దగ్గర వంచుకుని పడుకోవటం మంచిది. ఇబ్బందిగా ఉంటే కాళ్ల మధ్యలో దిండు, నడుం పక్కకి దిండు, పొట్ట పక్కకి దిండు పెట్టుకుంటే కొద్దిగా సులువుగా ఉంటుంది. ఎక్కువసేపు పడుకోలేనప్పుడు, కొద్ది సమయానికి కుడివైపుకి తిరిగి పడుకోవచ్చు. ఒకవేళ చక్కగా నడుంపై పడుకున్నా, వీలైనంత త్వరగా పక్కకి తిరగడం, తల్లికి బిడ్డకి మంచిది. అవసరం అనుకుంటే మార్కెట్‌లో దొరికే ‘సి’ షేప్‌లో ఉండే మెటర్నిటీ పిల్లో (దిండు)ని వాడుకోవచ్చు.
గర్భిణి స్త్రీలు రకరకాల సప్లిమెంటరీలు తీసుకోవాలనే విషయం గురించి విన్నాను. ఎలాంటి సప్లిమెంట్‌లు తీసుకుంటే మంచిది. దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? lodine సప్లిమెంట్ గురించి తెలియజేయగలరు.
– కె.రాగిణి, విశాఖపట్టణం
గర్భిణీ సమయంలో, కడుపులో తొమ్మిది నెలలపాటు పెరిగే శిశువు అవసరాలకు, తల్లిలో జరిగే శారీరక మార్పులకు ఆహారం బలం, పోషక పదార్థాలు ఎంతో అవసరం. కడుపులో పెరిగే బిడ్డ... తల్లి నుంచి తనకు కావలసిన ఆహారం, పోషక పదార్థాలు మాయ ద్వారా, బొడ్డుతాడు ద్వారా తీసుకుంటుంది. అలా తీసుకునే క్రమంలో తల్లి సరైన పోషక పదార్థాలు తీసుకోనప్పుడు బిడ్డ సరిగా పెరగకపోవటం, అలానే తల్లిలో రక్తహీనత, క్యాల్షియం తక్కువ కావటం వల్ల కాళ్లనొప్పులు, నడుంనొప్పులు... ఇంకా ఎన్నో సమస్యలు ఏర్పడవచ్చు. గర్భిణి అన్ని పోషక పదార్థాలు ఉన్న ఆహారం తీసుకున్నా గాని తీసుకున్న ఆహారంలో ఉన్న పోషక పదార్థాలతో, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కేవలం 20–30 శాతం మటుకే రక్తంలోకి చేరుతాయి.
ఇవి బిడ్డ పెరుగుదలకి, తల్లిలో జరిగే మార్పులకు సరిపోకపోవచ్చు. దీనిని అరికట్టడానికి మంచి ఆహారంతో పాటు, ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం, విటమిన్ డి, బి కాంప్లెక్స్ విటమిన్స్‌తో కూడిన సప్లిమెంట్స్‌ను విడిగా తీసుకోవటం తప్పనిసరి. వీటిని టాబ్లెట్, సిరప్, పౌడర్ వంటి రూపాలలో తీసుకోవచ్చు. దీనివల్ల బిడ్డ ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే తల్లికి కూడా రక్తహీనత లేకుండా, నీరసం, ఎక్కువగా కాళ్లనొప్పులు, నడుంనొప్పులు వంటి ఇతర సమస్యలు లేకుండా, తొమ్మిది నెలల పాటు ఆనందంగా ఉంటూ, పండంటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. చాలామంది ఈ సప్లిమెంట్స్ వల్ల బాగా లావు అవుతారని, బిడ్డ బరువు ఎక్కువగా ఉంటుంది అనే అపోహలో ఉండి ఈ మందులను వాడటానికి ఇష్టపడరు.
ఈ సప్లిమెంట్స్ వల్ల కేవలం రక్తంలో హిమోగ్లోబిన్ సరిగా ఉండటం, ఎముకలు బలహీనపడకుండా ఉండటం, నీరసం లేకుండా ఉండటం, బిడ్డ ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు పెరుగుతాయి. అంతేకానీ వీటివల్ల తల్లి, బిడ్డ మరీ బరువు పెరగటం జరగదు. సప్లిమెంట్స్‌లో ఉండే ఫోలిక్ యాసిడ్ వల్ల బిడ్డలో వెన్నుపూసలో లోపాలు, ఇంకా ఇతర విటమిన్స్ వల్ల ఇతర అవయవ లోపాలు ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయోడిన్ అనేది మినరల్. తల్లికి, బిడ్డకి ఇద్దరికీ కూడా ఎంతో అవసరం. ఈ మినరల్ వల్ల తల్లిలో థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాయిడ్ హార్మోన్ సరైన మోతాదులో విడుదలయ్యే అవకాశాలు బాగా ఉంటాయి.
థైరాయిడ్ హార్మోన్ ప్రభావం వల్ల బిడ్డ మానసిక ఎదుగుదల సరిగా ఉంటుంది. తల్లిలో కూడా అన్ని జీవ ప్రక్రియలకు థైరాయిడ్ హార్మోన్ ఎంతో అవసరం. అయోడిన్, సముద్రపు ఆహారంలో, చేపలలో, ఉడకబెట్టిన గుడ్లు, పెరుగు, పాలు, స్ట్రాబెరీస్, చెరీస్‌లో, పొట్టుతో ఉన్న ఆలుగడ్డ వంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. అలానే అయోడైజ్డ్ ఉప్పులో కూడా ఉంటుంది. అయోడైజ్డ్ ఉప్పు రోజుకు అర టీస్పూన్ ఆహారంలో తీసుకున్నా సరిపోతుంది. విడిగా అయోడిన్ సప్లిమెంట్ అందరికీ అవసరం లేదు. సప్లిమెంట్స్ అన్నీ అధిక మోతాదులో తీసుకోవడం కూడా మంచిది కాదు. డాక్టర్ సలహా మేరకు ఒక్కొక్కరి శరీర తత్వాన్ని, బరువుని బట్టి, వారి అవసరాలను బట్టి, తినే ఆహారాన్ని బట్టి సప్లిమెంట్స్‌ను సరైన మోతాదులో తీసుకోవటం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment