భావిపౌరులకు ఆరోగ్య భద్రత
భావిపౌరులకు ఆరోగ్య భద్రత
Published Wed, Aug 24 2016 9:50 PM | Last Updated on Thu, Oct 4 2018 4:39 PM
వచ్చే నెల మెుదటి వారం నుంచి సంచార వాహనాల ద్వారా వైద్యసేవలు
30 రకాల వైద్యపరీక్షల నిర్వహణ
అవసరమైన వారికి జీజీహెచ్‌లో చికిత్స
బాలాజీచెరువు (కాకినాడ): భావి పౌరులైన చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సంచార వాహనాల ద్వారా నేరుగా వారి వద్దకు వెళ్లి పరీక్షలు నిర్వహించి, వైద్యసేవలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో దాదాపు నాలుగు లక్షల మందికి పైగా అంగన్‌వాడీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా. జిల్లాలో వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న క్లస్లర్లకు రెండేసి చొప్పున వాహనాలను ఏర్పాటు చేసి, వాటిలో వైద్యసేవలు అందించేందుకు 68 మంది వైద్యులు, 34 మంది ఫార్మాసిస్టులతో పాటు ఏఎన్‌ఎంలను నియమించనున్నారు.
రెండు సంవత్సరాల క్రితం బాలల ఆరోగ్య పరిరక్షణ కోసం ‘రాషీ్ట్రయ స్వస్థ్య బాల’ కార్యక్రమం చేపట్టారు. ఒక సంచార వాహనం కేటాయించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఇద్దరు వైద్యులను, సిబ్బందిని కేటాయించి వైద్యసేవలు అందించేవారు. అయితే తర్వాత వైద్యులకు ఇతర బాధ్యతలు కేటాయించడంతో ఈ కార్యక్రమం నిలిచిపోయింది. దీని వల్ల విద్యార్థుల అనారోగ్య సమస్యలు పట్టించుకునేవారు లేకుండా పోయారు. దీంతో రాష్ట్రప్రభుత్వం రాషీ్ట్రయ స్వస్థ్య బాల కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకోసం సంచార వాహనాలతో పాటు ప్రత్యేకంగా వైద్యులను, సిబ్బందిని నియమించనుంది. వచ్చే నెల మెుదటి వారం నుంచి సేవలు అందించాలని సంకల్పించారు.
క్లస్టర్‌కు రెండు వాహనాలు
జిల్లాలో ఉన్న 4,412 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నాలుగు లక్షల 30 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ వైద్యసేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి క్లస్టర్‌కు రెండు సంచార వాహనాలలో 18 సంవత్సరాల లోపువయస్సు కలిగిన బాలబాలికలు, యువతీయువకులకు 30 రకాల వైద్యపరీక్షలు, సేవలు అందజేస్తారు. ఒకో సంచార వాహనంలో ఇద్దరు వైద్యులు (విధిగా ఒక మహిళా వైద్యురాలుండాలి), ఫార్మాసిస్టు, ఏఎన్‌ఎం ఉంటారు. వీరు గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, జూనియర్ కళాశాలలకు వెళ్లి రోజుకు వంద నుంచి 130 మందికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. వారికి ఒక కార్డు ఇచ్చి గుర్తించిన అనారోగ్యసమస్యలను దానిపై రాస్తారు. చిన్న చిన్న సమస్యలకు చికిత్స చేసి, మందులు ఇస్తారు. అవసరమైతే కాకినాడ ప్రభుత్వాస్పత్రికి పంపించి మెరుగైన వైద్యం అందిస్తారు.
వెన్నెముక, పుర్రె, మెదడు సంబంధిత లోపాలు, గ్రహణం మొర్రి, పెదవి చీలిక, అంగుట్లో చీలిక, వంకరపాదాలు, కంటిపొర, పుట్టుకతో వచ్చే చెవుడు, సాంక్రమిక గుండె జబ్బులు, పుట్టుకతో వచ్చే కంటిలోపం, అయోడిన్ లోపం, చర్మవ్యాధులు, గజ్జి, తామర, శ్వాసకోశవ్యాధులు, పిప్పిపళ్లు, మాటలు సరిగా రాకపోవడం, చిన్నగడ్డం, మూర్ఛ, నాడీ సంబంధిత సమస్యలు, విటమిన్ ఏ, విటమిన్ డీ లోపం వంటి వాటికి సంబంధించి పరీక్షలు నిర్వహిస్తారు.
Advertisement
Advertisement