వరల్డ్ హెల్త్ డే..
ఆరోగ్య సమస్య ఏమైనా వస్తే చికిత్స తప్ప ప్రత్యామ్నాయం లేదు. కానీ సమస్య రాకుండా ముందే నివారించుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదు. చికిత్స కంటే నివారణే మేలు అనే సూక్తి మేరకు వ్యాధుల నివారణకు ఉపయోగపడే అంశాల్లో మొట్టమొదటి అంశం టీకాలు (వ్యాక్సిన్లు). రెండో అంశం.. లక్షణాలు కనిపించగానే చేయించాల్సిన వైద్యపరీక్షలు. నేడు ‘వరల్డ్ హెల్త్ డే’. ఈ సందర్భంగా ఏ వయసులో. వారు ఏయే వ్యాక్సిన్లు తీసుకోవాలన్న అంశంపై అవగాహన కోసం ఈ కథనం.
టీకాలు..
చిన్నారి పుట్టిన వెంటనే.. ఓపీవీ, బీసీజీలతో పాటు హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత 6, 10, 14 వారాల్లో ఇస్తారు).
ఆరు వారాలప్పుడు:
డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా ఫస్ట్ డోస్
హెచ్‌ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్‌ఫ్లుయెంజా టైప్ బి) టీకా ఫస్ట్ డోస్
ఐపీవీ (ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్)/ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా ఫస్ట్ డోస్
పీసీవీ 13 (న్యూమోకోకల్ కాంజుగేట్ టీకా) ఫస్ట్ డోస్
రొటావైరస్ టీకా మొదటి డోస్ (ఇది నోటిద్వారా ఇస్తారు)
హెపటైటిస్–బి వ్యాక్సిన్ రెండో డోస్.
పది వారాలప్పుడు:
డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా రెండో మోతాదు
హెచ్‌ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్‌ఫ్లుయెంజా టైప్ బి) టీకా రెండో మోతాదు
ఐపీవీ / ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా రెండోడోస్
పీసీవీ 13 రెండో మోతాదు
నోటిద్వారా ఇచ్చే రొటావైరస్ టీకా రెండో డోస్
హెపటైటిస్–బి మూడో డోస్.
పద్నాలుగు వారాలప్పుడు:
డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా మూడో మోతాదు
హెచ్‌ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్‌ఫ్లుయెంజా టైప్ బి) టీకా మూడోమోతాదు
ఐపీవీ (ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్)/ ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా మూడో మోతాదు
పీసీవీ 13 (న్యూమోకోకల్ కాంజుగేట్ టీకా) మూడో మోతాదు
రొటావైరస్ టీకా మూడో డోస్ (ఇది నోటిద్వారా ఇచ్చే డోస్)
హెపటైటిస్–బి వ్యాక్సిన్ నాలుగో మోతాదు.
ఆరు నెలల వయసప్పుడు:
ఇన్‌ఫ్లుయెంజా టీకా మొదటి మోతాదు
ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) మొదటి మోతాదు
ఏడు నెలల వయసప్పుడు:
ఇన్‌ఫ్లుయెంజా టీకా రెండో మోతాదు
తొమ్మిది నెలల వయసప్పుడు:
ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) రెండో మోతాదు
ఎమ్‌ఎమ్‌ఆర్ (తట్టు, గవదబిళ్లలు, రుబెల్లా) టీకా ఫస్ట్ డోస్
టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఇస్తారు.
పన్నెండు నుంచి 15 నెలల వయసప్పుడు:
ఎమ్‌ఎమ్‌ఆర్ (తట్టు, గవదబిళ్లలు, రుబెల్లా) టీకా రెండో మోతాదు
వారిసెల్లా (చికెన్‌పాక్స్) టీకా మొదటి మోతాదు
హెపటైటిస్–ఏ టీకా మొదటి మోతాదు (దీని రెండో డోస్ సాధారణంగా 18 నెలలప్పుడు ఇస్తారు)
పీసీవీ (ప్యాక్‌డ్ సెల్ వాల్యూమ్) బూస్టర్.
పద్దెనిమిది నెలల వయసప్పుడు:
డీట్యాప్ టీకా మొదటి బూస్టర్ డోస్
హెచ్‌ఐబీ (హిబ్) టీకా మొదటి బూస్టర్ డోస్
ఐపీవీ లేదా ఓపీవీ టీకా
హెపటైటిస్–ఏ రెండో డోస్.
మూడేళ్ల వయసప్పుడు:
వారిసెల్లా వ్యాక్సిన్ రెండో డోస్ టీకా.
ఐదేళ్లప్పుడు:
డీ–ట్యాప్ టీకా రెండో బూస్టర్
ఐపీవీ టీకా ∙ఎమ్‌ఎమ్‌ఆర్ టీకా మూడో డోస్.
పది నుంచి పన్నెండేళ్ల వయసప్పుడు:
హెచ్‌పీవీ టీకా మొదటి డోస్ (దీని రెండు, మూడు డోసులు 9 నుంచి 18 ఏళ్ల వయసప్పుడు)
టీడ్యాప్ టీకా బూస్టర్ డోస్ ∙మెనింగోకోకల్ కాంజుగేట్ టీకా మొదటి డోస్ (దీని బూస్టర్ 16 ఏళ్ల వయసప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది).
పదిహేను నుంచి 16 ఏళ్ల వయసప్పుడు:
మెనింగోకోకల్ కాంజుగేట్ టీకా బూస్టర్ డోస్
టీడీ / డీటీ టీకా.
18 నుంచి 65 ఏళ్ల వరకు:
ఈ వయసులో ఎవరికైనా మంచి వ్యాధి నిరోధకత ఉంటుంది. గతం లో ఏదైనా వ్యాక్సిన్ తీసుకోకపోతే... డాక్టర్ సలహా మేరకు తీసుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకున్నదీ లేనిదీ గుర్తులేనప్పుడు డాక్టర్‌కు ఆ విషయం చెబితే... వారు కొన్ని పరీక్షల ద్వారా వ్యాక్సిన్ తీసుకున్నదీ లేనిదీ నిర్ధారించి అవసరమైతే ఇస్తారు.
65 ఏళ్లు పైబడిన వారికి: ఈ వయసు దాటాక కొన్ని వ్యాక్సిన్లు తప్పనిసరిగాను, మరికొన్ని అవసరాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. పీసీవీ–13 అండ్ పీపీఎస్‌వీ 23 అనే వ్యాక్సిన్లను సాధారణంగా 65 ఏళ్లు దాటినవారికి ఇస్తుంటారు. ఇవి నిమోనియాను నివారించే నిమోకోకల్ వ్యాక్సిన్స్‌లు. ఇందులో తొలుత పీసీవీ–13 ఇస్తారు. ఆ తర్వాత రెండు నెలలకు పీపీఎస్‌వీ–23 ఇస్తారు
టీ–డ్యాప్ వ్యాక్సిన్: చిన్నప్పుడు తీసుకున్న టెటనస్, డిఫ్తీరియా, పెర్టుసిస్ వ్యాధులను నివారించే వ్యాక్సిన్ తాలూకు బూస్టర్ డోసులను 65 ఏళ్లు పైబడ్డ తర్వాత ప్రతి పదేళ్లకోమారు తీసుకుంటూ ఉండాలి.
- డాక్టర్ బీవీఎస్ అపూర్వ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్.
పరీక్షలు..
ముందుగానే కొన్ని వైద్య పరీక్షలు చేయించడం వల్ల కొన్ని వ్యాధుల్ని కనుగొని సంపూర్ణంగా నయం చేసుకోవచ్చు. ఉదాహరణకు సర్వైకల్ క్యాన్సర్ అనే వ్యాధికి సుదీర్ఘమైన ముందస్తు వ్యవధి ఉంటుంది. అంటే అసలు వ్యాధి రావడానికి పదేళ్ల ముందునుంచే ‘ప్రీ–సర్వైకల్ పీరియడ్’ ఉంటుంది. పాప్ స్మియర్ అనే పరీక్ష ద్వారా వ్యాధి రాబోయే దశాబ్దకాలం ముందుగానే దాన్ని కనుగొనవచ్చు. క్యాన్సర్ ను ఎంత త్వరగా కనుగొంటే అంత తేలికగా నయమవుతుంది. ఆరోగ్యంగా ఉండటం కోసం ముందస్తుగా ఏయే వయసుల్లో ఏయే వైద్యపరీక్షలు ఉపకరిస్తాయో తెలుసుకుందాం.
0 – 10 ఏళ్ల వయసులో:
ఈ వయసులో అవసరం అయితే తప్ప పెద్దగా వైద్యపరీక్షలు అవసరం లేదు.
11 – 20 ఏళ్లు: ఇది యుక్తవయసులోకి మారే దశ. నిర్దిష్టంగా ఏవైనా వైద్యసమస్యలు ఉండటం లేదా లక్షణాలు కనిపించడం వంటి సమయాల్లో తప్ప... ఈ వయసులోనూ పెద్దగా వైద్యపరీక్షలు అవసరం పడవు.
20 – 30 ఏళ్లు: ఈ వయసులో కొన్ని లైంగిక సాంక్రమిక వ్యాధులు (ఎస్‌టీఐ’స్) కోసం మరీ ముఖ్యంగా హెపటైటిస్–బీ నిర్ధారణ పరీక్షలు చేయించి హెచ్‌బీఐజీ వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే అమ్మాయిలైతే పాప్‌స్మియర్ వంటి గైనిక్ పరీక్ష లు చేయించుకుని, 12 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్యకాలంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ప్రయోజనకరం.
30 నుంచి 40 ఏళ్లు: ఈ వయసు నుంచి డయాబెటిస్ కోసం హెచ్‌బీఏ1సీ అనే రక్తపరీక్షలు, రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి. ఏవైనా తేడాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి ఈసీజీ, టూ డీ ఎకో, అవసరాన్ని బట్టి ట్రెడ్‌మిల్ వంటి పరీక్షలు చేయించాలి. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలూ మంచిదే. మహిళలైతే డాక్టర్ సలహా మేరకు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మామోగ్రామ్ పరీక్ష చేయించాలి.
40 – 50 ఏళ్లు: ఈ వయసు నుంచి దేహంలో కొన్ని మార్పులు మొదలవుతాయి. అందుకే ఈ వయసులో పరీక్షలు తరచూ చేయిస్తుండటం మేలు. రక్తపోటును తెలుసుకోవడం కోసం సిస్టోల్, డయాస్టోల్ ప్రెషర్స్, రక్తలో చక్కెర మోతాదుల కోసం హెచ్‌బీఏ1సీతో పాటు అవసరమైతే గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ), పొద్దున్నే పరగడుపున, ఏదైనా తిన్న తర్వాత చేసే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ్రపాండియల్ వైద్య పరీక్షలతోపాటు అవసరాన్ని బట్టి కొన్నిరకాల క్యాన్సర్ పరీక్షలు చేయించడం మంచిది.
అలాగే మహిళలైతే ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ డెన్సిటీ పరీక్ష చేయించాలి. దాంతోపాటు మామోగ్రామ్, పాప్ స్మియర్ పరీక్షలను డాక్టర్ చెప్పిన వ్యవధుల్లో చేయించాలి.
ఇక పురుషులైతే ఈ వయసు నుంచి ్రపోస్టేట్ స్పెసిఫిక్ ఏంటీజెన్... సంక్షిప్తంగా పీఎస్‌ఏ అనే పరీక్షను డాక్టర్లు చెప్పిన వ్యవధుల్లో చేయించుకుంటూ ఉండాలి.
50 – 60 ఏళ్లు: చాలామంది 50 ఏళ్ల వరకు ఎలాంటి పరీక్షలు చేయించకపోవచ్చు. అయితే అలాంటివాళ్లంతా ఈ 50 – 60 ఏళ్ల మధ్యవయసులో తప్పక వైద్యపరీక్షలు చేయించాల్సిన అవసరం తప్పక వస్తుంది. ముందు నుంచి పరీక్షలు చేయించని వాళ్లతోపాటు ఈ వయసులోని అందరూ ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ స్కాన్, కోలన్ క్యాన్సర్ నిర్ధారణ కోసం కొలనోస్కోపీ, గుండె జబ్బుల కోసం తరచూ ఈసీజీ, టూ డీ ఎకో, ట్రెడ్‌మిల్ పరీక్షలతో పాటు లక్షణాలను బట్టి ఇతర వైద్యపరీక్షలు చేయిస్తుండాలి.
మహిళలకు 50 ఏళ్ల వయసు తర్వాత మెనోపాజ్ రావడంతో గుండెకు ఉండే ఒక సహజ రక్షణ తొలగిపోతుంది. అందువల్ల గతంలో చేయించినా, చేయించక పోయినా ఈ వయసు నుంచి మహిళలు గుండెకు సంబంధించిన అన్ని స్క్రీనింగ్ పరీక్షలు అంటే ఈసీజీ, టూడీ ఎకో, ట్రెడ్‌మిల్ వంటి పరీక్షలు చేయించాలి.
60 నుంచి 70 ఏళ్లు: ఈ వయసులో వాళ్లనే సీనియర్ సిటిజెన్‌గా పరిగణిస్తుంటారు. పురుషులూ మహిళలు అన్న తేడాలేకుండా... ఈ వయసు నుంచి అందరూ... ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ స్కాన్, కోలన్ క్యాన్సర్ నిర్ధారణ కోసం కొలనోస్కోపీ, గుండెజబ్బుల కోసం తరచూ ఈసీజీ, టూ డీ ఎకో, ట్రెడ్‌మిల్ పరీక్షలతోపాటు లక్షణాలను బట్టి మరికొన్ని ప్రత్యేకమైన పరీక్షలు అవసరమవుతాయి.
70+ పైబడ్డాక.. ఆపైన కూడా..
ఈ వయసు నుంచి లక్షణాలను బట్టి ఓ వ్యక్తి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండేందుకు పైన పేర్కొన్న వైద్యపరీక్షలతో పాటు కొన్ని వ్యాక్సిన్లు, మరికొన్ని మందులు తీసుకోవాలి. ఒకవేళ పోషకాహార లోపం ఉంటే, తగిన ఆహారం తీసుకోవాలి. దాంతోపాటు అవసరం అయితే మరికొన్ని హెల్త్ సప్లిమెంట్స్ వంటివి తీసుకోవాల్సి ఉంటుంది.
- డాక్టర్ హరికిషన్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్.
Comments
Please login to add a commentAdd a comment