harikishan
-
World Health Day: ఏయే వయసుల్లో.. ఏయే వ్యాక్సిన్లు! ఏయే వైద్య పరీక్షలు..?
ఆరోగ్య సమస్య ఏమైనా వస్తే చికిత్స తప్ప ప్రత్యామ్నాయం లేదు. కానీ సమస్య రాకుండా ముందే నివారించుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదు. చికిత్స కంటే నివారణే మేలు అనే సూక్తి మేరకు వ్యాధుల నివారణకు ఉపయోగపడే అంశాల్లో మొట్టమొదటి అంశం టీకాలు (వ్యాక్సిన్లు). రెండో అంశం.. లక్షణాలు కనిపించగానే చేయించాల్సిన వైద్యపరీక్షలు. నేడు ‘వరల్డ్ హెల్త్ డే’. ఈ సందర్భంగా ఏ వయసులో. వారు ఏయే వ్యాక్సిన్లు తీసుకోవాలన్న అంశంపై అవగాహన కోసం ఈ కథనం. టీకాలు.. చిన్నారి పుట్టిన వెంటనే.. ఓపీవీ, బీసీజీలతో పాటు హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత 6, 10, 14 వారాల్లో ఇస్తారు). ఆరు వారాలప్పుడు: డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా ఫస్ట్ డోస్ హెచ్ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి) టీకా ఫస్ట్ డోస్ ఐపీవీ (ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్)/ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా ఫస్ట్ డోస్ పీసీవీ 13 (న్యూమోకోకల్ కాంజుగేట్ టీకా) ఫస్ట్ డోస్ రొటావైరస్ టీకా మొదటి డోస్ (ఇది నోటిద్వారా ఇస్తారు) హెపటైటిస్–బి వ్యాక్సిన్ రెండో డోస్. పది వారాలప్పుడు: డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా రెండో మోతాదు హెచ్ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి) టీకా రెండో మోతాదు ఐపీవీ / ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా రెండోడోస్ పీసీవీ 13 రెండో మోతాదు నోటిద్వారా ఇచ్చే రొటావైరస్ టీకా రెండో డోస్ హెపటైటిస్–బి మూడో డోస్. పద్నాలుగు వారాలప్పుడు: డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా మూడో మోతాదు హెచ్ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి) టీకా మూడోమోతాదు ఐపీవీ (ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్)/ ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా మూడో మోతాదు పీసీవీ 13 (న్యూమోకోకల్ కాంజుగేట్ టీకా) మూడో మోతాదు రొటావైరస్ టీకా మూడో డోస్ (ఇది నోటిద్వారా ఇచ్చే డోస్) హెపటైటిస్–బి వ్యాక్సిన్ నాలుగో మోతాదు. ఆరు నెలల వయసప్పుడు: ఇన్ఫ్లుయెంజా టీకా మొదటి మోతాదు ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) మొదటి మోతాదు ఏడు నెలల వయసప్పుడు: ఇన్ఫ్లుయెంజా టీకా రెండో మోతాదు తొమ్మిది నెలల వయసప్పుడు: ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) రెండో మోతాదు ఎమ్ఎమ్ఆర్ (తట్టు, గవదబిళ్లలు, రుబెల్లా) టీకా ఫస్ట్ డోస్ టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఇస్తారు. పన్నెండు నుంచి 15 నెలల వయసప్పుడు: ఎమ్ఎమ్ఆర్ (తట్టు, గవదబిళ్లలు, రుబెల్లా) టీకా రెండో మోతాదు వారిసెల్లా (చికెన్‌పాక్స్) టీకా మొదటి మోతాదు హెపటైటిస్–ఏ టీకా మొదటి మోతాదు (దీని రెండో డోస్ సాధారణంగా 18 నెలలప్పుడు ఇస్తారు) పీసీవీ (ప్యాక్డ్ సెల్ వాల్యూమ్) బూస్టర్. పద్దెనిమిది నెలల వయసప్పుడు: డీట్యాప్ టీకా మొదటి బూస్టర్ డోస్ హెచ్ఐబీ (హిబ్) టీకా మొదటి బూస్టర్ డోస్ ఐపీవీ లేదా ఓపీవీ టీకా హెపటైటిస్–ఏ రెండో డోస్. మూడేళ్ల వయసప్పుడు: వారిసెల్లా వ్యాక్సిన్ రెండో డోస్ టీకా. ఐదేళ్లప్పుడు: డీ–ట్యాప్ టీకా రెండో బూస్టర్ ఐపీవీ టీకా ∙ఎమ్ఎమ్ఆర్ టీకా మూడో డోస్. పది నుంచి పన్నెండేళ్ల వయసప్పుడు: హెచ్‌పీవీ టీకా మొదటి డోస్ (దీని రెండు, మూడు డోసులు 9 నుంచి 18 ఏళ్ల వయసప్పుడు) టీడ్యాప్ టీకా బూస్టర్ డోస్ ∙మెనింగోకోకల్ కాంజుగేట్ టీకా మొదటి డోస్ (దీని బూస్టర్ 16 ఏళ్ల వయసప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది). పదిహేను నుంచి 16 ఏళ్ల వయసప్పుడు: మెనింగోకోకల్ కాంజుగేట్ టీకా బూస్టర్ డోస్ టీడీ / డీటీ టీకా. 18 నుంచి 65 ఏళ్ల వరకు: ఈ వయసులో ఎవరికైనా మంచి వ్యాధి నిరోధకత ఉంటుంది. గతం లో ఏదైనా వ్యాక్సిన్ తీసుకోకపోతే... డాక్టర్ సలహా మేరకు తీసుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకున్నదీ లేనిదీ గుర్తులేనప్పుడు డాక్టర్‌కు ఆ విషయం చెబితే... వారు కొన్ని పరీక్షల ద్వారా వ్యాక్సిన్ తీసుకున్నదీ లేనిదీ నిర్ధారించి అవసరమైతే ఇస్తారు. 65 ఏళ్లు పైబడిన వారికి: ఈ వయసు దాటాక కొన్ని వ్యాక్సిన్లు తప్పనిసరిగాను, మరికొన్ని అవసరాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. పీసీవీ–13 అండ్ పీపీఎస్వీ 23 అనే వ్యాక్సిన్లను సాధారణంగా 65 ఏళ్లు దాటినవారికి ఇస్తుంటారు. ఇవి నిమోనియాను నివారించే నిమోకోకల్ వ్యాక్సిన్స్‌లు. ఇందులో తొలుత పీసీవీ–13 ఇస్తారు. ఆ తర్వాత రెండు నెలలకు పీపీఎస్వీ–23 ఇస్తారు టీ–డ్యాప్ వ్యాక్సిన్: చిన్నప్పుడు తీసుకున్న టెటనస్, డిఫ్తీరియా, పెర్టుసిస్ వ్యాధులను నివారించే వ్యాక్సిన్ తాలూకు బూస్టర్ డోసులను 65 ఏళ్లు పైబడ్డ తర్వాత ప్రతి పదేళ్లకోమారు తీసుకుంటూ ఉండాలి. - డాక్టర్ బీవీఎస్ అపూర్వ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. పరీక్షలు.. ముందుగానే కొన్ని వైద్య పరీక్షలు చేయించడం వల్ల కొన్ని వ్యాధుల్ని కనుగొని సంపూర్ణంగా నయం చేసుకోవచ్చు. ఉదాహరణకు సర్వైకల్ క్యాన్సర్ అనే వ్యాధికి సుదీర్ఘమైన ముందస్తు వ్యవధి ఉంటుంది. అంటే అసలు వ్యాధి రావడానికి పదేళ్ల ముందునుంచే ‘ప్రీ–సర్వైకల్ పీరియడ్’ ఉంటుంది. పాప్ స్మియర్ అనే పరీక్ష ద్వారా వ్యాధి రాబోయే దశాబ్దకాలం ముందుగానే దాన్ని కనుగొనవచ్చు. క్యాన్సర్ ను ఎంత త్వరగా కనుగొంటే అంత తేలికగా నయమవుతుంది. ఆరోగ్యంగా ఉండటం కోసం ముందస్తుగా ఏయే వయసుల్లో ఏయే వైద్యపరీక్షలు ఉపకరిస్తాయో తెలుసుకుందాం. 0 – 10 ఏళ్ల వయసులో: ఈ వయసులో అవసరం అయితే తప్ప పెద్దగా వైద్యపరీక్షలు అవసరం లేదు. 11 – 20 ఏళ్లు: ఇది యుక్తవయసులోకి మారే దశ. నిర్దిష్టంగా ఏవైనా వైద్యసమస్యలు ఉండటం లేదా లక్షణాలు కనిపించడం వంటి సమయాల్లో తప్ప... ఈ వయసులోనూ పెద్దగా వైద్యపరీక్షలు అవసరం పడవు. 20 – 30 ఏళ్లు: ఈ వయసులో కొన్ని లైంగిక సాంక్రమిక వ్యాధులు (ఎస్టీఐ’స్) కోసం మరీ ముఖ్యంగా హెపటైటిస్–బీ నిర్ధారణ పరీక్షలు చేయించి హెచ్‌బీఐజీ వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే అమ్మాయిలైతే పాప్‌స్మియర్ వంటి గైనిక్ పరీక్ష లు చేయించుకుని, 12 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్యకాలంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ప్రయోజనకరం. 30 నుంచి 40 ఏళ్లు: ఈ వయసు నుంచి డయాబెటిస్ కోసం హెచ్‌బీఏ1సీ అనే రక్తపరీక్షలు, రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి. ఏవైనా తేడాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి ఈసీజీ, టూ డీ ఎకో, అవసరాన్ని బట్టి ట్రెడ్మిల్ వంటి పరీక్షలు చేయించాలి. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలూ మంచిదే. మహిళలైతే డాక్టర్ సలహా మేరకు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మామోగ్రామ్ పరీక్ష చేయించాలి. 40 – 50 ఏళ్లు: ఈ వయసు నుంచి దేహంలో కొన్ని మార్పులు మొదలవుతాయి. అందుకే ఈ వయసులో పరీక్షలు తరచూ చేయిస్తుండటం మేలు. రక్తపోటును తెలుసుకోవడం కోసం సిస్టోల్, డయాస్టోల్ ప్రెషర్స్, రక్తలో చక్కెర మోతాదుల కోసం హెచ్‌బీఏ1సీతో పాటు అవసరమైతే గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ), పొద్దున్నే పరగడుపున, ఏదైనా తిన్న తర్వాత చేసే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ్రపాండియల్ వైద్య పరీక్షలతోపాటు అవసరాన్ని బట్టి కొన్నిరకాల క్యాన్సర్ పరీక్షలు చేయించడం మంచిది. అలాగే మహిళలైతే ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ డెన్సిటీ పరీక్ష చేయించాలి. దాంతోపాటు మామోగ్రామ్, పాప్ స్మియర్ పరీక్షలను డాక్టర్ చెప్పిన వ్యవధుల్లో చేయించాలి. ఇక పురుషులైతే ఈ వయసు నుంచి ్రపోస్టేట్ స్పెసిఫిక్ ఏంటీజెన్... సంక్షిప్తంగా పీఎస్ఏ అనే పరీక్షను డాక్టర్లు చెప్పిన వ్యవధుల్లో చేయించుకుంటూ ఉండాలి. 50 – 60 ఏళ్లు: చాలామంది 50 ఏళ్ల వరకు ఎలాంటి పరీక్షలు చేయించకపోవచ్చు. అయితే అలాంటివాళ్లంతా ఈ 50 – 60 ఏళ్ల మధ్యవయసులో తప్పక వైద్యపరీక్షలు చేయించాల్సిన అవసరం తప్పక వస్తుంది. ముందు నుంచి పరీక్షలు చేయించని వాళ్లతోపాటు ఈ వయసులోని అందరూ ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ స్కాన్, కోలన్ క్యాన్సర్ నిర్ధారణ కోసం కొలనోస్కోపీ, గుండె జబ్బుల కోసం తరచూ ఈసీజీ, టూ డీ ఎకో, ట్రెడ్మిల్ పరీక్షలతో పాటు లక్షణాలను బట్టి ఇతర వైద్యపరీక్షలు చేయిస్తుండాలి. మహిళలకు 50 ఏళ్ల వయసు తర్వాత మెనోపాజ్ రావడంతో గుండెకు ఉండే ఒక సహజ రక్షణ తొలగిపోతుంది. అందువల్ల గతంలో చేయించినా, చేయించక పోయినా ఈ వయసు నుంచి మహిళలు గుండెకు సంబంధించిన అన్ని స్క్రీనింగ్ పరీక్షలు అంటే ఈసీజీ, టూడీ ఎకో, ట్రెడ్మిల్ వంటి పరీక్షలు చేయించాలి. 60 నుంచి 70 ఏళ్లు: ఈ వయసులో వాళ్లనే సీనియర్ సిటిజెన్‌గా పరిగణిస్తుంటారు. పురుషులూ మహిళలు అన్న తేడాలేకుండా... ఈ వయసు నుంచి అందరూ... ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ స్కాన్, కోలన్ క్యాన్సర్ నిర్ధారణ కోసం కొలనోస్కోపీ, గుండెజబ్బుల కోసం తరచూ ఈసీజీ, టూ డీ ఎకో, ట్రెడ్మిల్ పరీక్షలతోపాటు లక్షణాలను బట్టి మరికొన్ని ప్రత్యేకమైన పరీక్షలు అవసరమవుతాయి. 70+ పైబడ్డాక.. ఆపైన కూడా.. ఈ వయసు నుంచి లక్షణాలను బట్టి ఓ వ్యక్తి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండేందుకు పైన పేర్కొన్న వైద్యపరీక్షలతో పాటు కొన్ని వ్యాక్సిన్లు, మరికొన్ని మందులు తీసుకోవాలి. ఒకవేళ పోషకాహార లోపం ఉంటే, తగిన ఆహారం తీసుకోవాలి. దాంతోపాటు అవసరం అయితే మరికొన్ని హెల్త్ సప్లిమెంట్స్ వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. - డాక్టర్ హరికిషన్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్. ఇవి చదవండి: మన తెలుగువాడి బయోపిక్ -
రెండు ఊపిరితిత్తుల మార్పిడి.. ప్రపంచంలో అరుదైన ట్రాన్స్‌ప్లాంట్
సికింద్రాబాద్, రాంగోపాల్‌పేట్: విషం తాగి తీవ్ర ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఓ యువకుడికి యశోద ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌తో ప్రాణం పోశారు. ఒకేసారి డబుల్ లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతంగా చేసి చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో ఇలాంటి శస్త్ర చికిత్స నాలుగవది కావడం గమనార్హం. శుక్రవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి డైరెక్టర్ గోరుకంటి పవన్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు డాక్టర్ హరికిషన్‌లు వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా మర్రాయిగూడెంకు చెందిన 23 ఏళ్ల రోహిత్ గత నెలలో వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగి, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో అతన్ని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేర్చారు. విషం ఊపిరితిత్తుల్లోకి వెళ్లి కోలుకోలేని పల్మనరీ ఫైబ్రోసిస్ పరిస్థితి ఏర్పడింది. అలాగే కిడ్నీలు, కాలేయం కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆయనకు మెకానికల్ వెంటిలేటర్స్ వైద్యం అందించిన తర్వాత 20 రోజులకు పైగానే ఎక్మోపై చికిత్స అందించారు. అయినా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడలేదు. దీంతో రెండు ఊపిరితిత్తులను మారిస్తేనే యువకుడి ప్రాణాలు నిలబెట్టవచ్చని వైద్యులు బావించారు. కానీ భారతదేశంలో ఇలాంటి కేసుల్లో ఎక్మో వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడిన వాళ్లు లేరు. శరీరంలో ఎటువంటి పురుగుల మందు అవశేషాలు లేవని నిర్ధారించుకున్నాక ఊపిరితిత్తుల మారి్పడి కోసం జీవన్‌దాన్‌లో నమోదు చేశారు. జీవన్‌దాన్ చొరవతో ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు డాక్టర్ హరికిషన్, థొరాసిక్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ కేఆర్ బాల సుబ్రహ్మణ్యం, డాక్టర్ మంజునాథ్ బాలే, డాక్టర్ చేతన్, డాక్టర్ శ్రీచరణ్, డాక్టర్ మిమి వర్గీస్‌లతో కూడిన బృందం ఆరు గంటల పాటు శ్రమించి విజయవంతంగా రెండు ఊపిరితిత్తులను మార్చారు. సంపూర్ణమైన ఆరోగ్యంతో రోహిత్‌ను డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. -
అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా లేదని, థర్డ్ వేవ్ తీవ్రంగా ఉండదని అనుకోవద్దని రెండేళ్లుగా కరోనా చికిత్సలో నిమగ్నమైన వైద్య నిపుణులు డా. హరికిషన్ గోనుగుంట్ల, డా.వీవీ రమణప్రసాద్ హెచ్చరిస్తున్నారు. కేసులు పెరుగుతున్నకొద్దీ ఈ రకం వైరస్ కూడా తీవ్రమైనదిగా మారొచ్చని, ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా మూల్యం చెల్లించుకోక తప్పదని చెబుతున్నారు. దేశంలో, రాష్ట్రంలో ఫిబ్రవరి రెండోవారానికి కేసులు అత్యధిక స్థాయికి చేరుకుంటాయని, లక్షలాది కేసులు వస్తే ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగి తట్టుకోవడం కష్టమవుతుందని వివరిస్తున్నారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కేసులు ఇప్పటి నుంచి క్రమంగా పెరిగి ఫిబ్రవరిలో భారీగా నమోదై మార్చికల్లా క్రమంగా తగ్గే అవకాశముందని చెబుతున్నారు. ఒమిక్రాన్‌కు సంబంధించి కీలకమైన విషయాలను వీళ్లిద్దరూ ‘సాక్షి’కి వెల్లడించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. కష్టాన్ని కొనితెచ్చుకున్నట్టే ఒమిక్రాన్ అంత తీవ్రమైనది కాదని, అంతగా ప్రభావం చూపదని అతి విశ్వాసం, అతి నమ్మకంతో ఉంటే కోరి కష్టాన్ని కొనితెచ్చుకున్నట్టే. ప్రస్తుత ఇన్ఫెక్షన్లలో తీవ్రమైన లక్షణాలు లేకున్నా పాజిటివ్ కేసులు బాగా పెరిగితే ఈ రకం వైరస్ కూడా తీవ్రమైనదిగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఒమిక్రాన్ వల్ల దేశంలో తక్కువ సమయంలోనే కేసులు కొన్ని లక్షల్లోకి చేరుకోవచ్చు. ఒక్కసారిగా కేసులెక్కువైతే ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతుంది. వైద్య రంగం పూర్తిగా ప్రభావితమైతే విపత్కర పరిస్థితులు ఎదురుకావొచ్చు. ఏమాత్రం అలక్ష్యం వద్దు. మాస్క్‌లు, అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఒమిక్రాన్‌పై మోనోక్లోనల్ యాంటీ బాడీస్ చికిత్స అంతగా పని చేయదు. అందుకే జాగ్రత్తగా వాడాలి.ఈసారి దాదాపుగా అందరూ ఇన్ఫెక్ట్ అవుతారు. కాబట్టి మరో వేరియెంట్ రాకపోవచ్చు. – డా.హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద ఆస్పత్రి ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగితే కష్టమే మన దగ్గర స్వల్ప జ్వరం, జలుబు, దగ్గు ఉన్నవాళ్లు టెస్టు చేయించుకుంటే చాలా మందికి పాజిటివ్‌గా తేలుతోంది. వీళ్లలో ప్రధానంగా ‘అప్పర్ రెస్పిరేటరీ’ సమస్యలే ఉంటున్నాయి. జలుబు, తుమ్ములు, తలనొప్పి, నస, దగ్గు, జ్వరంతో ‘అప్పర్ ఎయిర్వేస్’ పైనే ప్రభావం కనబడుతోంది. ప్రస్తుతానికి ఊపిరితిత్తులు ప్రభావితం కావట్లేదు. డెల్టా ప్లస్, ఒమిక్రాన్ రెండు కేసులూ వస్తున్నాయి. 30 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికాలో రోజుకు 10 లక్షల కేసుల దాకా వస్తుండటంతో ఓపీలు, హాస్పిటల్ బెడ్స్ నిండిపోయాయి. భారత్‌లో 130 కోట్ల జనాభాలో 10 శాతం పాజిటివ్ వచ్చినా 13 కోట్ల మందిలో ఎంతో మంది ఆస్పత్రుల్లో చేరతారు. కోమార్బిడ్ కండీషన్ ఉన్న వారికి, వృద్ధులకు సీరియసైతే ఆస్పత్రులపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. ఓపీలు కిటకిటలాడి, బెడ్స్ నిండి, మందుల కొరత ఏర్పడే పరిస్థితి రావొచ్చు. కాబట్టి ఒమిక్రాన్ స్వల్ప లక్షణాలేనని, థర్డ్ వేవ్ తీవ్రత ఉండదని నిర్లక్ష్యం వద్దు. – డా. వీవీ రమణప్రసాద్, పల్మనాలజిస్ట్–స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్, కిమ్స్ ఆస్పత్రి -
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూత
-
టాలీవుడ్లో మరో విషాదం
సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్(57) కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అనుకరణ విద్యలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కలిగిన ఆయన ఎంతో సినిమా ప్రముఖుల గొంతులను, హావభావాలను అలవోకగా అనుకరించేవారు. జురాసిక్‌పార్క్ సినిమాలోని సన్నివేశాన్ని అనుకరించడంలో ఆయన పేరెన్నికగన్నారు. అలాగే వివిధ శబ్దాలను, జంతువులు, పక్షుల కూతలను అనుకరించడంతో దిట్ట అయిన ఆయన విదేశాల్లోనూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. పలు సినిమాల్లోనూ ఆయన నటించారు. (సినిమా పరిశ్రమ బతకాలి) హరికిషన్ 1963, మే 30న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. రంగమణి, వీఎల్ఎన్ చార్యులు ఆయన తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచే ఆయనకు మిమిక్రీ అంటే ఆసక్తి. తనకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు, తోటి వారి గొంతులను అనుకరిస్తూ ఉండేవారు. అలా ప్రస్థానం ప్రారంభించిన ఆయన తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ ప్రముఖ మిమిక్రీ కళాకారుడిగా పేరు సంపాదించారు. పది వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు. ధ్వన్యనుకరణతో ప్రేక్షకులను రంజింపజేసి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఎంతో మంది శిష్యులను ఆయన తయారు చేశారు. నటుడు శివారెడ్డి కూడా ఈయన శిష్యుడే. హరికిషన్ మరణం పట్ల ఆయన శిష్యులు, అభిమానులు, వివిధ రంగాల ప్రముఖులు సంతాపం తెల్పుతున్నారు. (సినీనటి వాణిశ్రీ కుమారుడు ఆత్మహత్య) -
మద్యం సీసాల కలకలం
చేవెళ్ల రూరల్: గుర్తుతెలియని వ్యక్తులు హైదరాబాద్-బీజాపూర్ అంతర్రాష్ట రహదారిపై మద్యం సీసాలు పడేసి వెళ్లారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చేవెళ్ల మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. చేవెళ్ల మండలం తోలుకట్ట బస్‌స్టేజీ నుంచి కేసారం బస్ స్టేజీ వరకు దాదాపు 9 కిలోమీటర్ల పరిధిలో హైదరాబాద్-బీజాపూర్ అంతర్రాష్ట రహదారిపై గుర్తుతెలియని వ్యక్తులు ఓ డీసీఎం వాహనంలోంచి రోడ్డుపక్కన మద్యం బాటిళ్ల కాటన్లు (ఆఫీసర్ చాయిస్ క్వార్టర్ సీసాలు) విసిరేసి వెళ్లారు. సమీప గ్రామాల ప్రజలు, వాహనదారులు గమనించి మద్యం సీసాలను తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ హరికిషన్, సూపరింటెండెంట్ దశరథ్ తదితరులు వచ్చి ఏడు బృందాలుగా విడిపోయారు. చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల, మల్కాపూర్, కందవాడ, పలుగుట్ట, కేసారం, తోలుకట్టతోపాటు ముడిమ్యాల అటవీ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. దాదాపు 500 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, సదరు మద్యం సుంకం చెల్లించనిది అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలోని కొయ్యూర్, పెద్దపూర్, కౌలంపేట తదిర ప్రాంతాల్లో సుంకం చెల్లించని మద్యం విషయమై దాడులు చేస్తున్నామని, దీనికి సంబంధించి 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వారిలో ముగ్గురు పరారీలో ఉన్నారని, వారేఇలా మద్యాన్ని అధికారులకు లభించకుండా రోడ్డుపై పడేసి ఉండొచ్చన్నారు. సదరు మద్యం ఈ ప్రాంతానికి చెందినది కాదన్నారు. ఎవరు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి పడేసి వెళ్లారు? అనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మద్యం బాటిళ్లు తీసుకుపోయిన ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తిరిగి ఇవ్వాలన్నారు. కల్తీ మద్యం అయి కూడా ఉండొచ్చు, కాబట్టి ప్రజలు గ్రామ పంచాయతీల్లో అప్పగించినా తమ సిబ్బంది స్వాధీనం చేసుకుంటారని అధికారులు సూచించారు.