సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా లేదని, థర్డ్ వేవ్ తీవ్రంగా ఉండదని అనుకోవద్దని రెండేళ్లుగా కరోనా చికిత్సలో నిమగ్నమైన వైద్య నిపుణులు డా. హరికిషన్ గోనుగుంట్ల, డా.వీవీ రమణప్రసాద్ హెచ్చరిస్తున్నారు. కేసులు పెరుగుతున్నకొద్దీ ఈ రకం వైరస్ కూడా తీవ్రమైనదిగా మారొచ్చని, ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా మూల్యం చెల్లించుకోక తప్పదని చెబుతున్నారు. దేశంలో, రాష్ట్రంలో ఫిబ్రవరి రెండోవారానికి కేసులు అత్యధిక స్థాయికి చేరుకుంటాయని, లక్షలాది కేసులు వస్తే ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగి తట్టుకోవడం కష్టమవుతుందని వివరిస్తున్నారు.
ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కేసులు ఇప్పటి నుంచి క్రమంగా పెరిగి ఫిబ్రవరిలో భారీగా నమోదై మార్చికల్లా క్రమంగా తగ్గే అవకాశముందని చెబుతున్నారు. ఒమిక్రాన్‌కు సంబంధించి కీలకమైన విషయాలను వీళ్లిద్దరూ ‘సాక్షి’కి వెల్లడించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..
కష్టాన్ని కొనితెచ్చుకున్నట్టే
ఒమిక్రాన్ అంత తీవ్రమైనది కాదని, అంతగా ప్రభావం చూపదని అతి విశ్వాసం, అతి నమ్మకంతో ఉంటే కోరి కష్టాన్ని కొనితెచ్చుకున్నట్టే. ప్రస్తుత ఇన్ఫెక్షన్లలో తీవ్రమైన లక్షణాలు లేకున్నా పాజిటివ్ కేసులు బాగా పెరిగితే ఈ రకం వైరస్ కూడా తీవ్రమైనదిగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఒమిక్రాన్ వల్ల దేశంలో తక్కువ సమయంలోనే కేసులు కొన్ని లక్షల్లోకి చేరుకోవచ్చు.
ఒక్కసారిగా కేసులెక్కువైతే ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతుంది. వైద్య రంగం పూర్తిగా ప్రభావితమైతే విపత్కర పరిస్థితులు ఎదురుకావొచ్చు. ఏమాత్రం అలక్ష్యం వద్దు. మాస్క్‌లు, అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఒమిక్రాన్‌పై మోనోక్లోనల్ యాంటీ బాడీస్ చికిత్స అంతగా పని చేయదు. అందుకే జాగ్రత్తగా వాడాలి.ఈసారి దాదాపుగా అందరూ ఇన్‌ఫెక్ట్ అవుతారు. కాబట్టి మరో వేరియెంట్ రాకపోవచ్చు.
– డా.హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద ఆస్పత్రి
ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగితే కష్టమే
మన దగ్గర స్వల్ప జ్వరం, జలుబు, దగ్గు ఉన్నవాళ్లు టెస్టు చేయించుకుంటే చాలా మందికి పాజిటివ్‌గా తేలుతోంది. వీళ్లలో ప్రధానంగా ‘అప్పర్ రెస్పిరేటరీ’ సమస్యలే ఉంటున్నాయి. జలుబు, తుమ్ములు, తలనొప్పి, నస, దగ్గు, జ్వరంతో ‘అప్పర్ ఎయిర్‌వేస్’ పైనే ప్రభావం కనబడుతోంది. ప్రస్తుతానికి ఊపిరితిత్తులు ప్రభావితం కావట్లేదు. డెల్టా ప్లస్, ఒమిక్రాన్ రెండు కేసులూ వస్తున్నాయి. 30 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికాలో రోజుకు 10 లక్షల కేసుల దాకా వస్తుండటంతో ఓపీలు, హాస్పిటల్ బెడ్స్ నిండిపోయాయి.
భారత్‌లో 130 కోట్ల జనాభాలో 10 శాతం పాజిటివ్ వచ్చినా 13 కోట్ల మందిలో ఎంతో మంది ఆస్పత్రుల్లో చేరతారు. కోమార్బిడ్ కండీషన్ ఉన్న వారికి, వృద్ధులకు సీరియసైతే ఆస్పత్రులపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. ఓపీలు కిటకిటలాడి, బెడ్స్ నిండి, మందుల కొరత ఏర్పడే పరిస్థితి రావొచ్చు. కాబట్టి ఒమిక్రాన్ స్వల్ప లక్షణాలేనని, థర్డ్ వేవ్ తీవ్రత ఉండదని నిర్లక్ష్యం వద్దు.
– డా. వీవీ రమణప్రసాద్, పల్మనాలజిస్ట్–స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్, కిమ్స్ ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment