సాక్షి, హైదరాబాద్: మెడికల్ టూరిజమ్ హబ్ స్టేటస్ దిశగా దూసుకుపోతున్న హైదరాబాద్ సిటీ స్పీడ్‌కు కోవిడ్ బ్రేకులేసింది. వైద్య చికిత్స కోసం నగరానికి వచ్చే వారి సంఖ్య పూర్తిగా పడిపోయింది. నగరంలోని ఆసుపత్రుల ప్రతినిధులు చెబుతున్న ప్రకారం.. 2021 ఆఖరుకు చూస్తే విదేశీ రోగుల సంఖ్య దాదాపు 70% తగ్గింది. అయితే మూణ్నెళ్లుగా తిరిగి మెడికల్ టూరిజమ్ పుంజుకుంటున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రత్యేక చికిత్సల కోసం ఎందరో విదేశీయులు నగరాన్ని ఎంచుకుంటూ ఉండటంతో కొంతకాలంగా మెడికల్ టూరిజంలో నగరం తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వైద్య సదుపాయాలు, అత్యున్నత అర్హతలున్న వైద్యులు సుశిక్షితులైన ఆసుపత్రి సహాయక సిబ్బంది, తక్కువ ఖర్చు, ఇంగ్లిష్ మాట్లాడే సిబ్బంది, అందుబాటులో ట్రీట్‌మెంట్ ప్యాకేజీలు.. వంటివి మెడికల్ టూరిస్ట్‌లు మన నగరానికి ప్రాధాన్యం ఇచ్చేందుకు కారణాల్లో కొన్ని..
కోవిడ్ నుంచి కోలుకుంటూ..
గతంలో విదేశాల నుంచి నెలకు 70–80 మంది రోగులు వచ్చేవారమని, కోవిడ్ టైమ్‌లో అది నెలకు 30కి తగ్గి ఇప్పుడు మళ్లీ బాగా పుంజుకుని 20కి చేరిందని అంటున్నారు మెడికవర్ ఆసుపత్రికి చెందిన శ్రీకాంత్. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ ప్రతినిధి మాట్లాడుతూ ఏటా దాదాపు 4 వేల మంది అంతర్జాతీయ రోగులు ఆసుపత్రిని సందర్శించేవారని, అయితే కోవిడ్ కారణంగా ఆ సంఖ్య 60–70% తగ్గినప్పటికీ వెబ్‌సైట్ లీడ్స్, ఈమెయిల్ ఎంక్వైరీలు, ప్రాంతీయ మేనేజర్‌లతో డైరెక్ట్ కనెక్షన్లు, వీడియో కన్సల్టేషన్లపై విచారణలు బాగా పెరిగాయంటున్నారు. యశోద హాస్పిటల్స్ గ్రూప్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ ఎ.లింగయ్య మాట్లాడుతూ సాధారణంగా ఏటా 7,000–7,500 అంతర్జాతీయ రోగులు వచ్చేవారని, మధ్యలో కోవిడ్ దెబ్బ తీసినా ఇప్పుడు మళ్లీ వారి రాక పెరుగుతోందని అంటున్నారు.
ఎక్కడెక్కడ నుంచి..
► తూర్పు ఆఫ్రికా, ఇరాక్, సోమాలియా, సూడాన్, కెన్యా, రువాండా యెమెన్, ఉగాండా, రజాంబియా, నైజీరియా, ఇథియోపియా, కామెరూన్, టాంజానియా, యుఏఈ సౌదీ నుంచి కూడా గణనీయమైన సంఖ్యలో రోగులు నగరానికి వస్తున్నారు. బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్, మయన్మార్ ఇతర ప్రాంతాల వారూ వస్తున్నారు.
విదేశీయులను రప్పిస్తున్న చికిత్సలు..
► ఆంకాలజీ, మెదడు కణితులకు సంబంధించిన న్యూరో, వెన్నెముక చికిత్సలు, అవయవ మార్పిడి(కిడ్నీ, లివర్, బోన్ మ్యారో), హిప్, మోకాలి మార్పిడి, కార్డియాలజీ, ఆంకాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఆర్థోపెడిక్స్, క్యాన్సర్ సంబంధిత అత్యవసర చికిత్సల కోసం విదేశీ రోగులు ఎక్కువగా వస్తున్నారు. (క్లిక్: ఇంజనీరింగ్ పట్టాతో ఎగిరిపోవాల్సిందే.. ఉద్యోగం వచ్చినా వద్దే వద్దు)
కోవిడ్ పూర్వ స్థితికి స్వదేశీ మెడికల్ టూరిజమ్
ఆఫ్రికన్ దేశాల్లో చాలా చోట్ల క్లిష్టమైన సర్జరీలు అందుబాటులో లేవు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్, బోన్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ వంటి అరుదైన చికిత్సలకు సంబంధించి నగరం బాగా పేరొందింది. మనకు తగినంత వైద్య సదుపాయాలు ఉన్నాయి. ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, అస్సాంల నుంచీ రోగుల సంఖ్య పెరిగింది. స్వదేశీ రోగుల విషయానికి వస్తే అది దాదాపుగా పూర్తిగా కోవిడ్ పూర్వ స్థితికి చేరిందనొచ్చు. అంతర్జాతీయ రోగుల సంఖ్య మాత్రం నిదానంగా రికవరీ అవుతోంది. మా ఆసుపత్రి వరకూ చూస్తే అది 25శాతం పుంజుకుంది. మరోవైపు కోవిడ్ ముందు కన్నా ఎక్కువగా ఆన్‌లైన్ కన్సల్టేషన్స్ బాగా పెరగడం ఒక మంచి పరిణామంగా చెప్పాలి.
– డా.కిషోర్‌రెడ్డి, ఎండీ, అమోర్ ఆసుపత్రులు
30–40 శాతం పెరిగింది..
మిగిలిన మెట్రోలతో పోలిస్తే నగరంలో వైద్య ఖర్చులు తక్కువ. అదే విదేశీ రోగుల రాకకు ప్రధాన కారణం. అయితే కోవిడ్ సమయంలో వైద్య సేవల కోసం వచ్చే విదేశీయులు సంఖ్య బాగా పడిపోయింది. అయితే గత ఏప్రిల్ నెల నుంచి బాగా పుంజుకుంది. ఇప్పుడు ఆ పతనం నుంచీ 40 శాతం రికవరీ అయింది. ఇది వేగవంతమైన రికవరీగానే చెప్పాలి. ఫోర్త్ వేవ్ భయాందోళనలు పూర్తిగా మాయమైతే అతి త్వరలోనే కోవిడ్ పూర్వ స్థితికి చేరుకుంటుంది.
– డా.బి.భాస్కరావు, ఎండీ, కిమ్స్ ఆసుపత్రి, అధ్యక్షుడు, తెలంగాణ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్స్
Comments
Please login to add a commentAdd a comment