సాక్షి, హైదరాబాద్: పలు అభివృద్ధి చెందిన దేశాల్లో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు అవసరమని వైద్య నిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రెండు డోసుల టీకాలు తీసుకున్నా కరోనా వైరస్ వ్యాప్తి ఆగకపోవడంతో అమెరికాలో గత జూలై నుంచి మళ్లీ మాస్కులు, ఇతర జాగ్రత్తలు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దేశంలో కరోనా కేసులు విజృంభిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు.
ఇప్పటివరకు గుర్తించిన అన్ని వేరియెంట్లపైనా వ్యాక్సిన్లు ప్రభావశీలకంగా పనిచేయడం శుభపరిణామమని తెలిపారు. అయితే వ్యాక్సిన్ల ప్రభావశీలత ఆర్నేళ్ల తర్వాత క్రమంగా తగ్గుతోందని, అప్పడు 50 శాతం కంటే తక్కువగా ఉండొచ్చని ఇటీవల వెలువడిన పలు అంతర్జాతీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతోపాటు ఇటీవల ‘బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్ల’శాతం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నందున బూస్టర్ డోస్‌లు వేసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో అంతా మామూలైనట్లు ప్రజలు వ్యవహరించడం, మాస్కులు, ఇతర జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, బహిరంగ ప్రదేశాల్లో చాలా మంది ప్రజలు మాస్కులు లేకుండానే తిరగడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న పరిస్థితులు, వ్యాక్సిన్ల ప్రభావశీలత, భారత్‌లో ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రముఖ వైద్యులు వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే..
వైరస్‌ను పూర్తిగా నిర్మూలించలేవు..
వ్యాక్సిన్లు కోవిడ్ మహమ్మారిని పూర్తిగా కనుమరుగు చేస్తాయని, ఒకరి నుంచి ఒకరికి ఇది సోకకుండా నిరోధిస్తాయని, రెండు డోసులు తీసుకున్న వారికి ఏ రకమైన వైరస్ ఇన్‌ఫెక్షన్ సోకకుండా రక్షణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తమైంది. కానీ అమెరికాలోని వెర్మంట్‌లో రెండు డోసులు వేసుకున్న చాలా మందికి మళ్లీ ఇన్‌ఫెక్షన్ సోకుతోంది. ఇజ్రాయెల్‌లో 12 ఏళ్లు పైబడిన వారికి మూడో డోస్ వేస్తున్నారు. టీకాలు తీసుకున్న వారికి, సహజసిద్ధ ఇన్‌ఫెక్షన్ నుంచి రోగ నిరోధక శక్తి పొందిన వారికి కూడా మళ్లీ వైరస్ సోకవచ్చు.
అయితే వారిపై తీవ్ర ప్రభావం పడకపోవచ్చు. టీకాల వల్ల ఇతరులకు సోకడం తగ్గుతుందే తప్ప ఆ ప్రమాదాన్ని పూర్తిగా నిర్మూలించలేవు. జనసమ్మర్దమున్న ప్రాంతాల్లోకి వెళ్లకుండా, ధారాళంగా గాలి, వెలుతురు ప్రసరించే ప్రదేశాల్లో పని చేయడం, తదితర జాగ్రత్తల ద్వారా శ్వాసకోశ మార్గంలోకి వైరస్ కణాలు చేరకుండా జాగ్రత్త పడాలి. వైరస్ తీవ్రస్థాయికి చేరకుండా తక్కువ ›ప్రభావవంతంగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం.
– డా.కె.శ్రీనాథ్‌రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ప్రముఖ వైద్యుడు
వ్యాక్సిన్ తీసుకున్న ఆర్నెళ్ల తర్వాత..
కరోనా వైరస్ సోకకుండా నియంత్రణకు వేసుకునే టీకాల ప్రభావశీలత ఆర్నేళ్లు గడిచాక 50 శాతానికి తగ్గిపోతుందని వివిధ అధ్యయనాల ద్వారా వెల్లడైంది. వ్యాక్సిన్ తీసుకున్నాక తీవ్రస్థాయిలో ఇన్‌ఫెక్షన్ సోకకపోవడం, మరణాలు సంభవించడం తగ్గుతుంది. కానీ ఇది 100 శాతం మాత్రం కాదు. పెద్ద వయసు వారు.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారిపై టీకాల ప్రభావం వేగంగా తగ్గే అవకాశం ఉంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నాక ఆర్నెళ్ల తర్వాత ఇన్‌ఫెక్షన్ శాతం, తీవ్రత పెరుగుతుందని ఇజ్రాయెల్ పరిశోధన ఆందోళన కలిగిస్తోంది.
దీనిని బట్టి వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి బూస్టర్ డోస్ ఇవ్వాల్సిన ఆవశ్యకతను ఇది స్పష్టం చేస్తోంది. కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల కచ్చితంగా ప్రయోజనం కలిగినా.. దాని పరిమితులను కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. వ్యాక్సిన్లు వేసుకున్న వారికి కరోనా సోకినా, వ్యాక్సిన్లు తీసుకోని వారితో సమానంలో వైరల్ లోడ్ ఉన్న పక్షంలో టీకాల ప్రయోజనం కారణంగా వైరల్ లోడ్ వేగంగా తగ్గిపోతోంది.
– డా.గోపీచంద్ ఖిల్నానీ, చైర్మన్, పీఎస్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పల్మొనరీ, క్రిటికల్‌కేర్, ఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment