సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వన్యప్రాణి, ప్రకృతి–పర్యావరణహిత పర్యాటకానికి (వైల్డ్‌లైఫ్, ఎకో టూరిజం) ఆదరణ, ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి కారణంగా యావత్ మానవాళి ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో భారీ కుదుపునకు లోనైంది. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సురక్షిత, పర్యావరణహిత, జీవవైవిధ్యానికి ఆలవాలమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనే కుతూహలం పర్యాటకుల్లో అధికమైంది.
ఈ నేపథ్యంలో విశాల భారత్‌లోని వైవిధ్యత, సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం, అడవులను దేశ, విదేశాల్లోని టూరిస్టులకు పరిచయం చేసి పర్యాటకాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వీటిలో భాగంగా వైల్డ్‌లైఫ్, ఎకో టూరిజంకు అధిక ప్రాధాన్యతనిచ్చి కొత్త ఊపును ఇచ్చేందుకు అవసరమైన కార్యాచరణను అమలుచేస్తోంది. భారత్‌లోని అడవులు, వివిధ రకాల వన్యప్రాణులు, జంతుజాలం, ప్రత్యేకమైన వృక్షాలు, జలపాతాలు, సెలయేళ్లు, సరస్సులు, ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన వివిధ ప్రాంతాలను పర్యాటకానికి ఉపయోగించుకునేందుకు నడుం బిగించింది.
దేశంలోని మొత్తం 981 రక్షిత ప్రాంతాలు, 566 వైల్డ్‌లైఫ్ శాంక్చురీలు, 104 నేషనల్ పార్కులు, 214 కమ్యూనిటీ రిజర్వ్‌లు, 97 కన్జర్వేషన్ రిజర్వ్‌లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో తమదైన ప్రత్యేకతలతో కూడుకున్న ప్రదేశాలు, ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి ఆయా రాష్ట్రాలు, పర్యాటకంతో ముడిపడి ఉన్న శాఖలు, రంగాలు, ఏజెన్సీలు, టూర్ ఆపరేటర్లతో కలిసి కేంద్ర పర్యాటకశాఖ వినూత్న చర్యలు చేపడుతున్నట్టు ఆ శాఖ డైరెక్టర్ జనరల్, ఐటీడీసీ సీఎండీ గంజి కమలవర్ధన్‌రావు సాక్షి ఇంటర్వ్యూలో వెల్లడించారు.
వివిధ రాష్ట్రాలు, ఏజెన్సీలతో కేంద్రం సమన్వయం..
జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు, వాటిలోని పర్యాటక శాఖలు, టూరిజంతో మమేకమైన సంస్థలు, ఏజెన్సీలు, ఆపరేటర్లు, ఇతర భాగసామ్యపక్షాలను భాగంచేసి పర్యాటకాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కమలవర్ధన్‌రావు వెల్లడించారు. కేంద్రస్థాయిలో టూరిజం శాఖలోనే వివిధ కమిటీల భాగస్వామ్యం, వివిధ మంత్రిత్వశాఖల కమిటీల్లో అటవీ, పర్యావరణ, విమానయాన, రోడ్లు, రైల్వే తదితర శాఖలు కలిసి వైల్డ్‌లైఫ్ టూరిజానికి ఊతమిచ్చే చర్యలపై దృష్టి నిలుపుతున్నామని, టూరిస్ట్‌లకు స్పెషల్ ప్యాకేజీలు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో అటవీశాఖల పరంగా సఫారీలు, శాంక్చురీల్లో డీఎఫ్‌వోల సహకారం, రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములను చేయడం ద్వారా వైల్డ్‌లైఫ్, ఎకో, అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
ఇటీవల 8 ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక, సాంస్కృతికరంగాల అభివృద్ధి ప్రత్యేక సదస్సును నిర్వహించామని, అదేవిధంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పర్యాటకాభివృద్ధికి సంబంధించి ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, అటవీ–పర్యావరణశాఖలు తమ త మ టూరిస్ట్ ప్యాకేజీలు సిద్ధం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని, ఈ విషయంలో రాష్ట్రాలతో, అటవీ, సంబంధిత శాఖలను సమన్వయపరిచే చర్యలు తీసుకుంటున్నామని కమలవర్ధన్‌రావు తెలిపారు.
అటవీ అనుభవానికి భారత్‌ను మించింది లేదు..
‘ప్రపంచ వైల్డ్‌లైఫ్ టూరిజం అనగానే మసైమారా, సౌతాఫ్రికా, కెన్యా తదితర దేశాలు గుర్తుకు వస్తున్నాయి. ఎక్కువ జంతువులను దగ్గర నుంచి చూసే అవకాశం, మౌలిక వసతులు, ప్యాకేజీల కారణంగా ఆ ప్రదేశాలు ఎంచుకుంటామని టూరిస్ట్‌లు చెబుతుంటారు. మనదేశం విషయానికొస్తే గుజరాత్‌లోని గిర్ ఫారెస్ట్ సింహాలకు పెట్టింది పేరు. రంతంబోర్ ఫారెస్ట్, కన్హా నేషనల్ పార్కు, తదితరాలు ప్రపంచ స్థాయిలోనూ బాగా గుర్తింపు పొందాయి.
విదేశాల్లో కేవలం జంతువులు చూసి వెనక్కు తిరగాల్సి ఉంటుంది. మనదగ్గర మాత్రం అద్భుతమైన అడవి, జీవవైవిధ్యం, రకరకాల జంతువులు, పచ్చదనం, జలపాతాలు, తదితరాలను చూసే అవకాశం కలుగుతుంది. ఈ విధంగా అడవిలోకి వెళ్లిన ఒక అరుదైన అనుభవం పొందే వీలు, ప్రత్యేకత మనదగ్గరే ఉంది. వీటన్నింటిని ఉపయోగించుకుని పర్యాటకానికి ఊపునిచ్చే దిశలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నాం. కేవలం జంతువులు చూడాలంటే జూకు వెళితే సరిపోతుంది. అడవిని చూశామన్న అనుభూతి లభించాలంటే భారత్‌కు మించిన ప్రదేశం లేదని మేము గట్టిగా నమ్ముతున్నాం’అని ఆయన వ్యాఖ్యానించారు.
కరోనా కాలంలోనూ సానుకూలంశాలివే
‘కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతుండడంతో మనదేశంలోని వన్యప్రాణులు, వైవిధ్యభరితమైన అటవీ అందాలు, జీవవైవిధ్యం, సహజసిద్ధ ఆవాసాల్లో సింహాలు, పులులు, ఇతర రకరకాల జంతువులు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విదేశాలకు స్వేచ్ఛగా వెళ్లి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో దేశీయంగానూ టూరిస్ట్‌లు, ముఖ్యంగా మనదేశంలోని యువత వైల్డ్‌లైఫ్, ఎకో, అడ్వెంచర్ టూరిజం పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఎక్కువగా జనాలతో కిక్కిరిసిన ప్రాంతాలకు కాకుండా ప్రకృతి ఒడిలో సహజసిద్ధంగా ఉన్న ప్రదేశాలు, అడవుల్లోని జంతువులను చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. అందువల్ల ఇప్పుడు లేహ్, లడాఖ్, శ్రీనగర్, గోవా, ఈశాన్య రాష్ట్రాలు తదితరాల్లో వైల్డ్‌లైఫ్ శాంక్చురీల సందర్శనకు ప్రాధాన్యతనిస్తున్నారు. కరోనా తర్వాత పర్యాటకానికి సంబంధించి ఇదొక సానుకూలాంశం’అని కమలవర్ధన్‌రావు వెల్లడించారు.
చదవండి: Sumukhi Suresh: 30 వేల జీతం.. జీవితం బాగానే సాగేది.. కానీ నవ్వించడంలో..
Comments
Please login to add a commentAdd a comment