చేవెళ్ల రూరల్: గుర్తుతెలియని వ్యక్తులు హైదరాబాద్-బీజాపూర్ అంతర్రాష్ట రహదారిపై మద్యం సీసాలు పడేసి వెళ్లారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చేవెళ్ల మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. చేవెళ్ల మండలం తోలుకట్ట బస్‌స్టేజీ నుంచి కేసారం బస్ స్టేజీ వరకు దాదాపు 9 కిలోమీటర్ల పరిధిలో హైదరాబాద్-బీజాపూర్ అంతర్రాష్ట రహదారిపై గుర్తుతెలియని వ్యక్తులు ఓ డీసీఎం వాహనంలోంచి రోడ్డుపక్కన మద్యం బాటిళ్ల కాటన్‌లు (ఆఫీసర్ చాయిస్ క్వార్టర్ సీసాలు) విసిరేసి వెళ్లారు. సమీప గ్రామాల ప్రజలు, వాహనదారులు గమనించి మద్యం సీసాలను తీసుకెళ్లారు.
సమాచారం అందుకున్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ హరికిషన్, సూపరింటెండెంట్ దశరథ్ తదితరులు వచ్చి ఏడు బృందాలుగా విడిపోయారు. చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల, మల్కాపూర్, కందవాడ, పలుగుట్ట, కేసారం, తోలుకట్టతోపాటు ముడిమ్యాల అటవీ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. దాదాపు 500 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, సదరు మద్యం సుంకం చెల్లించనిది అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లాలోని కొయ్యూర్, పెద్దపూర్, కౌలంపేట తదిర ప్రాంతాల్లో సుంకం చెల్లించని మద్యం విషయమై దాడులు చేస్తున్నామని, దీనికి సంబంధించి 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వారిలో ముగ్గురు పరారీలో ఉన్నారని, వారేఇలా మద్యాన్ని అధికారులకు లభించకుండా రోడ్డుపై పడేసి ఉండొచ్చన్నారు. సదరు మద్యం ఈ ప్రాంతానికి చెందినది కాదన్నారు. ఎవరు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి పడేసి వెళ్లారు? అనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మద్యం బాటిళ్లు తీసుకుపోయిన ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తిరిగి ఇవ్వాలన్నారు. కల్తీ మద్యం అయి కూడా ఉండొచ్చు, కాబట్టి ప్రజలు గ్రామ పంచాయతీల్లో అప్పగించినా తమ సిబ్బంది స్వాధీనం చేసుకుంటారని అధికారులు సూచించారు.
మద్యం సీసాల కలకలం
Published Sun, Jan 18 2015 1:10 PM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM
Advertisement
Advertisement