
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది.
సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్(57) కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అనుకరణ విద్యలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కలిగిన ఆయన ఎంతో సినిమా ప్రముఖుల గొంతులను, హావభావాలను అలవోకగా అనుకరించేవారు. జురాసిక్‌పార్క్ సినిమాలోని సన్నివేశాన్ని అనుకరించడంలో ఆయన పేరెన్నికగన్నారు. అలాగే వివిధ శబ్దాలను, జంతువులు, పక్షుల కూతలను అనుకరించడంతో దిట్ట అయిన ఆయన విదేశాల్లోనూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. పలు సినిమాల్లోనూ ఆయన నటించారు. (సినిమా పరిశ్రమ బతకాలి)
హరికిషన్ 1963, మే 30న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. రంగమణి, వీఎల్‌ఎన్ చార్యులు ఆయన తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచే ఆయనకు మిమిక్రీ అంటే ఆసక్తి. తనకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు, తోటి వారి గొంతులను అనుకరిస్తూ ఉండేవారు. అలా ప్రస్థానం ప్రారంభించిన ఆయన తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ ప్రముఖ మిమిక్రీ కళాకారుడిగా పేరు సంపాదించారు. పది వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు. ధ్వన్యనుకరణతో ప్రేక్షకులను రంజింపజేసి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఎంతో మంది శిష్యులను ఆయన తయారు చేశారు. నటుడు శివారెడ్డి కూడా ఈయన శిష్యుడే. హరికిషన్ మరణం పట్ల ఆయన శిష్యులు, అభిమానులు, వివిధ రంగాల ప్రముఖులు సంతాపం తెల్పుతున్నారు. (సినీనటి వాణిశ్రీ కుమారుడు ఆత్మహత్య)